logo

ఏపీ ఈఏపీసెట్‌లో గ్రామీణ బాలల మెరుపులు

ఏపీ ఈఏపీసెట-2024 ఫలితాలలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో పలువురు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో కూడా ప్రతిభ చూపారు. ఆయా విద్యార్థుల వివరాలు..

Updated : 12 Jun 2024 02:50 IST

న్యూస్‌టుడే, ఎలమంచిలి, నర్సీపట్నం అర్బన్, పాయకరావుపేట, కె. కోటపాడు, చీడికాడ, చోడవరం పట్టణం

ఏపీ ఈఏపీసెట-2024 ఫలితాలలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో పలువురు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో కూడా ప్రతిభ చూపారు. ఆయా విద్యార్థుల వివరాలు..


ఇంజినీరింగ్‌

విదేశాల్లోవిద్యాభ్యాసం: పట్టాభిరెడ్డితోటకు చెందిన ఎం.బాల ఆదిత్య ఇంజినీరింగ్‌లో 13వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు శివప్రసాద్, సుజాతలు ప్రోత్సహించారు. ప్రతీరోజు 12 గంటలు సమయం వెచ్చించి ఈ ర్యాంకు తెచ్చుకున్నట్లు బాల ఆదిత్య తెలిపాడు. భవిష్యత్తు ముంబయి ఐఐటీలో సీఎస్‌సీ చదివి ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లాలని ఉందన్నాడు.


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరవుతా..: జీవీఎంసీ 92వ వార్డు నరసింహనగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డి అనిల్‌కు 34వ ర్యాంకు వచ్చింది. అతడి తల్లిదండ్రులు వెంకట సత్యసాయినాయుడు డిఫెన్స్‌ సివిలియన్‌గా పని చేస్తున్నారు. తల్లి పద్మ గృహిణి. ముఖ్యమైన అంశాలపై నిత్యం నోట్స్‌ రాసుకుని చదవడంతో మంచి ర్యాంకు వచ్చిందని, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడతానని అనిల్‌ చెప్పాడు.


మద్రాస్‌ ఐఐటీలో చేరుతా..: కూర్మన్నపాలెం వుడానగర్‌ ఫేజ్‌-7 ద్వారకాపురి కాలనీలో నివాసం ఉంటున్న తోటధీరజేశ్వర్‌కు ఇంజినీరింగ్‌లో 43వ ర్యాంకు వచ్చింది. ఆయన తండ్రి ఎల్‌వీ సూర్యనారాయణ ఫార్మా ఉద్యోగి. తల్లి నళిని గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలో 693వ ర్యాంకు రావడంతో మద్రాసు ఐఐటీలో చేరి.. సీఎస్‌ఈ చదువుతానని ధీరజేశ్వర్‌ తెలిపాడు.


ఎలమంచిలికి చెందిన కట్టమూరి కుశాల్‌ ఏపీ ఈఏపీసెట్‌లో 97 ర్యాంక్‌ సాధించాడు. తండ్రి రాజేష్‌ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. కుశాల్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జనరల్‌ కేటగిరీలో 1345 ర్యాంక్‌ సాధించాడు. ఓసీ కేటగిరీలో పోటీ ఎక్కువగా ఉందని, ఐఐటీలో సీటు రావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తనను బాగా చదివించిన తల్లిదండ్రులకు, గురువులకు ఈ సందర్భంగా కుశాల్‌  ధన్యవాదాలు తెలిపాడు. ఐఐటీలో సీఎస్‌ఈ చదవాలన్నదే తన కోరికని ‘న్యూస్‌టుడే’కు చెప్పాడు. మంచి ఇంజినీర్‌గా మారి దేశానికి సేవలందించాలన్నదే తన లక్ష్యమన్నాడు. రోజుకు 16 గంటపాటు చదివేవాడినని, దానివల్లే మంచి ర్యాంకు సాధించానన్నాడు. ఇతన్ని పట్టణవాసులు అభినందించారు.


నర్సీపట్నం కాపువీధికి చెందిన గండపల్లి యశశ్రీ 180వ ర్యాంకు సాధించింది. తండ్రి మురళీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. రాజమండ్రిలో ఇంటర్‌ చదివిన యశశ్రీ నీట్‌లో 596వ ర్యాంకు సాధించింది. వైద్యవిద్య పూర్తి చేసి సమాజానికి తనవంతు సేవలు అందిస్తానని చెబుతోంది.


నర్సీపట్నం శారదానగర్‌కు చెందిన రొంగలి లక్ష్మీలిఖితశ్రీ 190వ ర్యాంకు సాధించింది. ఈ యువతి తండ్రి శ్రీను రేషన్‌డిపో డీలరు. తల్లి గృహిణి. వెలివెన్నులో ఇంటర్‌ పూర్తి చేసింది. నీట్‌లోనూ 695వ ర్యాంకు సాధించింది. వైద్యురాలిగా సేవలు అందించాలన్నది తన లక్ష్యమని పేర్కొంది.


చీడికాడ మండలం అర్జునగిరి గ్రామానికి చెందిన కశిరెడ్డి సాయిచంద్ర కిరణ్‌ నాయుడు ఇంజినీరింగ్‌ విభాగంలో 80.3725 మార్కులతో 265వ ర్యాంకు సాధించాడు. ఇతడి తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి గృహిణి.


చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన బుద్దా నాగవరహా శ్రీనివాసరావు, దేవీరమాకుమారి దంపతుల కుమారుడు విఘ్నేశ్‌కుమార్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 77.65 మార్కులతో 393వ ర్యాంకు సాధించాడు. 1 నుంచి పదో తరగతి వరకు చోడవరంలో చదువుకున్నాడు. పదిలో 575 మార్కులు రాగా, రాజమహేంద్రవరంలో ఇంటరు (ఎంపీసీ) చదివి 989 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి శ్రీనివాసరావు ఆర్టీసీ కండక్టర్‌. కంప్యూటర్‌ ఇంజినీర్‌ కావడమే లక్ష్యమని విఘ్నేశ్‌ పేర్కొన్నాడు.


నర్సీపట్నం నీలంపేటకు చెందిన వంటాకుల సుజన్‌కుమార్‌ 541వ సాధించాడు. తండ్రి సత్తిబాబు రాజమండ్రిలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కుమార్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 3392వ ర్యాంకు, మెయిన్స్‌లో 2416 ర్యాంకు సాధించాడు.


ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో అగ్రికల్చర్‌ విభాగంలో అరకులోయకు చెందిన మజ్జి ఉష 2904 ర్యాంకుతో ప్రతిభ చాటింది. అరకులోయ మండల కేంద్రం కంఠబంసుగుడకు చెందిన ఈమె ఇటీవల వచ్చిన నీట్‌ ఫలితాల్లోనూ మెరుగైన ఫలితాన్ని సాధించింది. జాతీయ స్థాయిలో 28,151 ర్యాంకు రాగా ఎస్టీ విభాగంలో 5162 ర్యాంకును సాధించింది. తండ్రి మజ్జి భద్రయ్య మాడగడ పీహెచ్‌సీ హెల్త్‌ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్నారు. పది, ఇంటర్‌ విద్యాభ్యాసం విశాఖ గ్రామీణ పరిధిలో జరిగింది.


కె.కోటపాడు మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. పిండ్రంగికి చెందిన జారెడ్డి మారుతి 48వ ర్యాంకు, కె.కోటపాడుకు చెందిన రొంగలి చరణ్‌కుమార్‌ 213 ర్యాంకు, పాతవలసకు చెందిన జామి భరత్‌చంద్ర 363వ ర్యాంకు, గుల్లిపల్లికి చెందిన గొలగాని మారుతి 674వ ర్యాంకు సాధించారు. వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ వీరిని చదివిస్తున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని