logo

చెత్తపన్నుకు చెల్లు!

అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను వసూళ్లు పూర్తిగా నిలిపివేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్తపై పన్ను వసూళ్లు నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించారు.

Published : 13 Jun 2024 03:29 IST

ఎన్నికల హామీ నెరవేర్చిన చంద్రబాబు
కలెక్టరేట్, న్యూస్‌టుడే

ధికారంలోకి రాగానే చెత్తపై పన్ను వసూళ్లు పూర్తిగా నిలిపివేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్తపై పన్ను వసూళ్లు నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించారు. ఈమేరకు జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలో చెత్త పన్ను వసూళ్లు పూర్తిగా నిలిపివేశారు. వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ పన్ను కట్టమని ప్రజలు తిరగబడినా సచివాలయ సిబ్బందితో బలవంతంగా వసూళ్లు సైతం చేయించారు. పన్ను కట్టని వారికి నోటీసులు సైతం ఇచ్చి ఇంటికి నీటి సరఫరా నిలిపివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. పింఛను సొమ్ము నగదు నుంచి చెత్త పన్ను వసూలు చేసేవారు.

అనకాపల్లి  జోన్‌ పరిధిలో 30,200 పైగా ఉన్న గృహాల నుంచి 26 క్లాప్‌ వాహనాల ద్వారా చెత్త సేకరించేవారు. దీనికోసం ఇళ్ల దగ్గర నుంచి రూ. 60, అపార్టుమెంట్లు నుంచి రూ.120, వాణిజ్య సముదాయాల దగ్గర రూ. 150 నుంచి రూ. 1000 వరకు వసూళ్లు చేసేవారు. ప్రతినెలా రూ. 25,51,782 మేర వసూలు చేయాలని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేసేవారు. ఎన్నికల సమీపిస్తుండడంతో వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో ఆరు నెలల ముందు నుంచి వసూళ్లు నిలిపివేసింది. అయినా ప్రజలు ఓటుతో చెత్త ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించారు.


ఏజెన్సీలకు అడ్డంగా దోచిపెట్టారు 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను విధానానికి రూపకల్పన చేసింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో 2021 అక్టోబర్‌లో ఇళ్ల నుంచి చెత్తసేకరణ విధానాన్ని ప్రారంభించారు. ఇందుకు ఏజెన్సీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. 26 వాహనాలను సమకూర్చుకుని వారే చోదకులను నియమించేలా చేసింది. నెలకు వేలల్లో ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేపట్టేది. ఇందుకు ప్రజలపై చెత్తభారం విపరీతంగా మోపింది. ఏజెన్సీలు అన్నీ వైకాపాకు చెందినవి కావడంతో వారే ఆడిందే ఆట పాడిందే పాటలా ఉండేది. వాస్తవానికి ఇంటి పన్నులోనే పారిశుద్ధ్య పన్ను ఉండేది. వైకాపా ప్రభుత్వం విలువ ఆధారంగా మార్చేసి భారీగా పన్నులు వండించింది. ఏటా 15 శాతం పెంచుకుంటూ పోయింది. సచివాలయ, వాలంటీర్లతో ప్రతీ ఇంటి నుంచి దారుణంగా పన్ను వసూళ్లు చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే పన్ను వసూళ్లకు బ్రేకులు వేసింది. మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను త్వరలో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దీంతో వైకాపా పాలనలో చెత్తపై పన్ను కట్టి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడిన ప్రజలు నేడు చంద్రబాబు రాకతో ఊపిరిపీల్చుకుంటున్నారు.


మాటకు కట్టుబడి ఉండడం అభినందనీయం 

- మంగరాజు, భీమునిగుమ్మం

ఎన్నికల్లో ఇచ్చిన హామీ వరకు అధికారంలోకి రాగానే చెత్తపై పన్నులు నిలిపివేస్తామని చెప్పిన చంద్రబాబు హామీ అమలు చేయడం ఆనందంగా ఉంది. పెంచిన ఇంటి పన్నులు సైతం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. సంపాదించింది అంతా పన్నులు కట్టడానికే సరిపోతోంది. పలుమార్లు చెత్తపై పన్ను వసూళ్లు రద్దుచేయాలని జగన్‌ను వేడుకున్నా పట్టించుకోలేదు.


అడ్డంగా దోచేసింది

- శంకర్, వేల్పుల వీధి 

వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను కట్టకపోతే ఇబ్బందులకు గురి చేసింది. ఇంటింటికీ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని పంపించి వసూళ్లు చేశారు. ప్రతి నెలా రూ.60 నుంచి రూ. 150 వరకు చెల్లించాం. కట్టకపోతే తాగునీరు నిలిపివేస్తామని, పథకాలు అందకుండా చేస్తామని బెదిరింపులకు దిగేవారు. కూటమి ప్రభుత్వం పన్ను వసూళ్లు ఎత్తివేయడం సంతోషంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని