logo

కూటమి కొలువుతీరగ.. ఊరూరా పండగ

జగన్‌ నిరంకుశ పాలనకు తెరపడి వారమైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం బుధవారం కొలువుతీరింది. నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 13 Jun 2024 03:38 IST

బాణసంచా, కేకులతో కార్యకర్తల సందడి
ఈనాడు, పాడేరు

జగన్‌ నిరంకుశ పాలనకు తెరపడి వారమైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం బుధవారం కొలువుతీరింది. నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కనుల పండగను చూసేందుకు కూటమి కార్యకర్తలు గన్నవరానికి పెద్దఎత్తున తరలివెళ్లారు. అక్కడి వెళ్లలేని వారి కోసం నియోజకవర్గం, మండల కేంద్రాల్లో టీవీలు, డిజిటల్‌ తెరలు ఏర్పాటుచేశారు. అనకాపల్లి కలెక్టర్‌ రవి, అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ సునీత ఆదేశాలతో మండల పరిషత్, వెలుగు, పురపాలక కార్యాలయాలు, ముఖ్య కూడళ్ల వద్ద టీవీలు, డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేసి ప్రజలంతా వీక్షించే సదుపాయం కల్పించారు. ప్రమాణస్వీకార పండగను ఊరూరా తిలకించారు. తమ నేతలు ప్రమాణం చేస్తున్నప్పుడు కూటమి కార్యకర్తలు కేకులు కోసి సంబరాలు జరుపుకొన్నారు.

ల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం అంబేడ్కర్‌ కూడళ్లలో, అరకులోయ గిరిజన మ్యూజియం ఎదుట బహిరంగ ప్రదేశాల్లో డిజిటల్‌ తెరలతో ప్రదర్శించారు. చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెరల ముందు కూటమి కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో హర్షం తెలిపారు. దశాబ్దంన్నర తర్వాత రంపచోడవరంలో కూటమి అభ్యర్థిశిరీషాదేవి గెలవడంతో అక్కడ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి సందడి చేశారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని గుర్తుకుతెచ్చారు. 


పాడేరు, న్యూస్‌టుడే: మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ విజయ సునీత, జేసీ భావన, డీఆర్‌ఓ పద్మావతి తదితరులు వీక్షించారు. పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ కూడలి వద్ద ఎంపీడీఓ నవీన్‌ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, అభిమానులు జై సీబీఎన్‌ అంటూ నినాదాలు హోరెత్తించారు. అధికారులు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లిలో తెదేపా నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. పాత బస్టాండు వద్దనున్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కేట్‌ కోశారు. స్వీట్లు పంచిపెట్టారు. తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, చింతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్, అప్పారావు, లక్ష్మణ్, మంగు, భూషణం, భాజపా నాయకులు ప్రభాకర్, జనసేన నాయకులు లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతగిరి, న్యూస్‌టుడే: అనంతగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెదేపా, జనసేన పార్టీల మండలాధ్యక్షులు బుజ్జిబాబు, మురళి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కేకు కోసి తినిపించుకున్నారు. తెదేపా నాయకులు ఆనంద్, శ్యామ్, రంజిత్, జోగులు తదితరులు పాల్గొన్నారు.


రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరంలో కూటమి నాయకులు సంబరాలు చేశారు. ఎంపీడీవో హరికృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణతోపాటు స్టేట్‌ బ్యాంకు ఎదురుగా ఏర్పాటుచేసిన డిజిటల్‌ స్క్రీన్‌ల వద్ద యువత బాణసంచా కాల్చారు. మోతా నాగేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కోసి పంచారు. అనంతరం భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నాయకులు సలాది బాపిరాజు, పెంటపాటి అనంత మోహన్, సిద్దా వెంకన్న, అడబాల రాంబాబు, పెదకాపు, నీలాపు సూరిబాబు, విరోధుల రాంబాబు, కారం శేషాయమ్మ, కాకి స్వామి తదితరులు పాల్గొన్నారు.  


అడ్డతీగల, న్యూస్‌టుడే: రాయపల్లిలో తెదేపా సీనియర్‌ నాయకుడు జుజ్జవరపు శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో తెదేపా, జనసేన నాయకులు కార్యకర్తలకు కేక్‌ తినిపించారు. బాణసంచా కాల్చారు. నాయకులు జర్తా కామరాజు, సింగంశెట్టి ఆదిలక్ష్మి, చెదల రమణారెడ్డి, కాపారపు సత్యనారాయణ, పల్లాల రాజారెడ్డి, బొమ్మిడి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అడ్డతీగల మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో అధికారులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని