logo

పాడేరు ఘాటీ... పట్టించుకోరేంటి?

పెదబయలులో ఈనెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన మోదకొండమ్మ ఉత్సవాల్లో ప్రోగాం ముగించుకుని లారీలో స్వగ్రామాలకు బయలుదేరిన సౌండ్‌ సిస్టమ్‌ బృంద సభ్యులు పాడేరు ఘాటీ 12వ మైలు దాటిన మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు.

Published : 14 Jun 2024 01:50 IST

ఇరుకైన రోడ్డు.. శిథిలమైన రక్షణ గోడలు

లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు (పాత చిత్రం)

పాడేరు ఘాట్‌రోడ్డులో ఏసుక్రీస్తు బొమ్మ, వంజంగి వ్యూ పాయింట్,  మినుములూరు కాఫీ ప్రాజెక్టు సమీపంలో మూడు భయానక మలుపులు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు తీసుకోవడం లేదు. ఘాట్‌రోడ్డులో రద్దీ పెరిగింది. రోడ్డు విస్తరణ పనులు తప్పక చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే :పెదబయలులో ఈనెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన మోదకొండమ్మ ఉత్సవాల్లో ప్రోగాం ముగించుకుని లారీలో స్వగ్రామాలకు బయలుదేరిన సౌండ్‌ సిస్టమ్‌ బృంద సభ్యులు పాడేరు ఘాటీ 12వ మైలు దాటిన మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. వాహనం బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. 

ఈనెల 12న ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో సామగ్రి

  • 2023 ఏప్రిల్‌ 26న పాడేరు నుంచి విశాఖపట్నం ఎల్‌ఐసీ ఉద్యోగి కుటుంబసభ్యులతో కారులో వెళ్తుండగా.. కోమాలమ్మ పనుకు సమీపంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ముగ్గురు మృతి చెందారు.బీ 2023 ఆగస్టు 20న విశాఖపట్నం నుంచి పాడేరు వస్తున్న ఆర్టీసీ బస్సు కాంతమ్మ వ్యూ పాయింట్‌కు ముందు ఓ మలుపు వద్ద బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో పక్కన ఉన్న రక్షణ గోడను దూసుకుని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బస్సు లోయలో ఓ భారీ చెట్టు కొమ్మకు చిక్కుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
  • 2024 ఏప్రిల్‌ 4న ఒడిశా రాష్ట్రం నుంచి విజయవాడకు కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ ఏసుక్రీస్తు బొమ్మవద్ద బోల్తా పడింది. వ్యాన్‌లో ఉన్న డ్రైవర్‌కు పాడేరు ఘాటీపై అనుభవం లేకపోవడంతోపాటు రాత్రి వేళలో ప్రయాణించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. బీ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు పట్టణానికి ముఖద్వారంగా ఉన్న పాడేరు ఘాట్‌ రోడ్డులో ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మైదాన ప్రాంతాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి పాడేరు ఏజెన్సీకి ఈ రహదారి మీదుగానే వెళ్లాలి. అల్లూరి జిల్లా కేంద్రంగా పాడేరు ఏర్పడడం, వంజంగి మేఘాలకొండ, కొత్తపల్లి జలపాతం పర్యటక ప్రాంతాలకు వెళ్లే మార్గం ఇదే కావడంతో రద్దీగా ఉంటోంది. 21 కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్న ఘాట్‌రోడ్డు ఇరుగ్గా ఉంది. మలుపుల్లో అనుభవం లేని డ్రైవర్లు వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

అతి ప్రమాదకరంగా అరకు ఘాటీ 

అనంతగిరి నుంచి కాశీపట్నం మధ్యలో దెబ్బతిన్న రక్షణ గోడ 

అనంతగిరి, అరకు మండలాల పరిధిలోని ఘాట్‌రోడ్డు అధ్వానంగా, అతి ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడలు శిథిలమై, పెద్దరంధ్రాలు పడి ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అవి మరింత పెద్దవయ్యాయి. రాత్రి వేళలో ఈ మార్గంలో ప్రయాణానికి వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రహదారికి మరమ్మతులు చేయాలని వాహనచోదకులు చెబుతున్నారు.

ఈనాడు, అరకులోయ

రూ.76 లక్షలతో ప్రతిపాదన

పాడేరు- విశాఖపట్నం ఘాట్‌ రోడ్డులో ఇటీవల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రస్తుతం 18 అడుగుల వెడల్పు ఉంది. 21 అడుగుల వరకూ దీన్ని విస్తరించేందుకు రూ.76 లక్షలతో అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఈ నిధులు వచ్చిన మరుక్షణమే అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.

 బాలసుందరరావు, ఈఈ, రోడ్లు భవనాలశాఖ, అల్లూరి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని