logo

వేటకు వేళాయే!

ప్రాణాలే పెట్టుబడిగా.. కడలి కెరటాలే కడుపు నింపే కాలచక్రాలుగా.. మర పడవలే నేస్తాలుగా.. నిత్యం పోరాటం చేసే మత్స్యకారులు బతుకు నావను నడపడానికి సమయం వచ్చింది.

Updated : 14 Jun 2024 06:13 IST

60 రోజులు ఉపాధికి దూరమైన మత్స్యకారులు
భరోసా సాయం ఇవ్వని జగన్‌ సర్కార్‌

వలలు బాగుచేసుకుంటున్న మత్స్యకారులు

అచ్యుతాపురం, నక్కపల్లి న్యూస్‌టుడే: ప్రాణాలే పెట్టుబడిగా.. కడలి      కెరటాలే కడుపు నింపే కాలచక్రాలుగా.. మర పడవలే నేస్తాలుగా.. నిత్యం పోరాటం చేసే మత్స్యకారులు బతుకు నావను నడపడానికి సమయం వచ్చింది. రెండు నెలలుగా దూరమైన చేపల వేటకు వేళైౖంది. కడలి కరుణతో.. మొండి ధైర్యాన్ని మూటకట్టుకుని ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
చేపల వేటను నమ్ముకొని కుటుంబాలను పోషించే ప్రతి మత్స్యకార కుటుంబానికి నిషేధ సమయం ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలలపాటు వేటకు వెళ్లక కుటుంబ గడవక వీరేపడే ఇబ్బందులు అన్నీఇన్నీకావు. జిల్లాలో 9 మండలాల పరిధిలో సువిశాలమైన తీర ప్రాంతం ఉంది. తీరం అందరికీ ఆనందాన్ని, మనసుకు హాయిని అందిస్తే ఉమ్మడి విశాఖËలోని 32 మత్స్యకార గ్రామాల ప్రజలకు ఇది జీవనాన్ని అందిస్తోంది. గంగమ్మ తల్లిని నమ్ముకొని తీరాన్ని ఆనుకొని 92 వేలమంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ప్రతి రోజు    18 వేల మంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తుంటారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌  15 వరకు చేపల గుడ్లు పెట్టే సమయం కావడంతో వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు గట్టి బందోబస్తు నిర్వహిస్తారు.    ఈ విధంగా జిల్లాలో 2550 బోట్లలో మత్స్యకారులు సముద్రానికి దూరమవుతారు.

అర్హుల జాబితాలు కుదించి..

గంగమ్మతల్లినే నమ్ముకున్న మత్స్యకారులను ఈ ఏడాది జగన్‌ ప్రభుత్వం గంగలో ముంచింది. రెండు నెలలపాటు ప్రతి ఏడాది నిషేధ సమయం ఉంటుందని,   ఆ సయమంలో వీరిని ఆదుకోవాలని ముందస్తు సమాచారం ఉన్నా ఒక్కరికీ మత్స్యకార భరోసా సాయం ఇవ్వలేదు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 అర్ధరాత్రి వరకు 60 రోజుల పాటు చేపల వేటను ప్రభుత్వం నిషేధించడంతో  పూడిమడకలో మత్స్యకారులు ఈ ఏడాది నానా ఇబ్బందులు పడ్డారు. వైకాపా ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార భరోసాలోనూ కొర్రీలు వేసి అర్హుల జాబితాలను కుదించింది. డీజిల్‌ రాయితీ వాడని మత్స్యకారుల వివరాలను భరోసా సాయం నుంచి తప్పించింది. రిజిస్ట్రేషన్‌ లేదని, రంగులు వేయలేదని ఇలా నచ్చిన సాకులు చూపించి అమాయకులకు అన్యాయం చేసింది. అర్హులంటూ    నాలుగేళ్లు అందించిన భరోసా ఈ ఏడాది మాత్రం నిలుపుదల చేసి మొండి చెయ్యి చూపించారని పూడిమడకకు చెందిన మత్స్యకారులు వాపోతున్నారు.

చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు  

 సామగ్రి ఇవ్వనే లేదు

తెదేపా ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసాతోపాటు తుపాన్ల సమయంలో   నిత్యావసర సరకులు అందించి ఆదుకునేది. రాష్ట్రంలో గత ఐదేళ్లు  వైకాపా ప్రభుత్వం మత్స్యకార భరోసా సాయం తప్ప ఎటువంటి సాయం ఇవ్వకుండా మొండిచెయ్యి చూపింది. వలలు, తాళ్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంజిన్లు, పడవులు, ఐస్‌  బాక్స్‌లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ వేట అనుబంధంగా సాయం అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తపాలన, సముద్రంలో చేపల వేట ఒకేసారి ప్రారంభమవుతోందని ఆనందంగా చెబుతున్నారు.

జిల్లాలో 11,500 మందికి భరోసా  

 జిల్లాలో 80 వేల మంది వరకు మత్స్యకారులు సముద్రాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు. గత ఏడాది మత్స్యకార భరోసా కింద 10 వేల మందికి సాయం అందించాం. ఎన్నికల కోడ్‌ వల్ల ఇప్పటివరకు సాయం ఇవ్వలేకపోయాం. భరోసా సాయానికి జిల్లా వ్యాప్తంగా 11,500 మందిని గుర్తించాం. వీరికి నూతన ప్రభుత్వం భరోసా సాయం అందిస్తుంది. అర్హులందరికీ సాయం చేయడానికి చర్యలు తీసుకుంటాం.

పి.ప్రసాద్, జిల్లా మత్స్యఅధికారి, అనకాపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని