logo

ఉద్యమంలా రక్తదానం

చింతపల్లి మండలం పెంటపాడు గ్రామానికి చెందిన యువకుడు ఇంటి కృష్ణమహేశ్వర్లు ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Updated : 14 Jun 2024 06:13 IST

నేడు రక్తదాతల దినోత్సవం

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి మండలం పెంటపాడు గ్రామానికి చెందిన యువకుడు ఇంటి కృష్ణమహేశ్వర్లు ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ యువకుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రక్తదానం ఆవశ్యకత, ప్రాధాన్యత తెలియడంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈయన స్వచ్ఛందంగానే రక్తదానం చేస్తున్నాడు. ఎక్కడ శిబిరాలు జరిగినా ఈయన హాజరవుతుంటాడు. ఎవరికైనా రక్తం అవసరమని సామాజిక మాధ్యమాల్లో తెలిస్తే చాలు అక్కడికే వెళ్లి రక్తం ఇస్తున్నాడు. తనది ఏబీ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపని, 15 సార్లు రక్తదానం చేసినట్లు కృష్ణమహేశ్వర్లు తెలిపారు. ఎవరి వద్దా రూపాయి ఆశించకుండా సొంత ఖర్చులతోనే దూరప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు.

ఉప సర్పంచి ఉదారత

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఉప సర్పంచిగా ప్రజా సేవతో పాటు తనవంతుగా రక్తదానం చేస్తున్నారు  మడపల సోమేష్‌ కుమార్‌. ఈయనది గూడెంకొత్తవీధి మండలం రింతాడ. రాజకీయాల్లోకి రాకముందే మన్యపుత్ర యువజన సంఘం స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. మొదటిగా 2015లో రెడ్‌క్రాస్‌ సొసైటీతో కలసి శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రింతాడలో అయిదు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వందల సంఖ్యలో యూనిట్ల రక్తం సేకరించారు. ఆయన 15సార్లు రక్తదానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 14న రింతాడలో మరో శిబిరం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తన ద్విచక్రవాహనానికి మైకు ఏర్పాటు చేసుకుని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఆ శిబిరం ద్వారా రక్తం సేకరించి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడనున్నట్లు తెలిపారు.

క్షతగాత్రుల పాలిట ఆపద్భాందవుడు

కూనవరం, న్యూస్‌టుడే: ఆపద సమయంలో ఉన్న మనిషిని కాపాడటంలో ఉండే సంతృప్తి ఎందులోనూ ఉండదని గట్టిగా నమ్ముతారు టేకులబోరుకు చెందిన మచ్చా వినయ్‌ ప్రసాదు. కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు, భద్రాచలం మండలాల్లో ఎవరికి రక్తం అవసరమన్నా తనే ముందుగా చొరవ తీసుకుని అక్కడకు వెళ్లి రక్తదానం చేస్తుంటారు. ఏబీ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ను కలిగి ఉన్న ఈయన  ఇప్పటివరకు 36 సార్లు రక్తం దానం చేశారు. విజయవాడ, రాజమహేంద్రవరం కాకినాడ వంటి ప్రదేశాలకు సొంత ఖర్చులో వెళ్లి రక్తదానం చేసిన సందర్భాలు ఉన్నాయి. పలువురు అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రశంసపత్రాలు అందించారు.

మన్యం వాసులు మృత్యువాత పడకూడదనే..

రంపచోడవరం, న్యూస్‌టుడే: వై.రామవరం గ్రామానికి చెందిన జగ్గారపు గణేష్‌ అనే యువకుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారి నుంచి రక్తాన్ని సేకరించి పదుగురి ప్రాణాలు నిలపాలని భావించాడు. తనతోపాటు కలిసి వచ్చిన మరి కొందరితో ‘గిరిమిత్ర సర్వీసెస్‌’ అనే సంస్థను స్థాపించాడు. వీరందరి సహకారంతో ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 20 శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించాడు. ఇలా సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని బ్లడ్‌ బ్యాంకులకు ఇవ్వడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి స్వచ్ఛందంగా అందించేవారు. 

ఇప్పటివరకు 1800 మందికి రక్తాన్ని అందించి అందరి మన్ననలను అందుకున్నారు. ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి ఎనిమిది ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. 28 ఏళ్ల గణేష్‌ కూడా ఇప్పటికే 18 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశాడు.

తనతోపాటు పెదిరెడ్ల దుర్గాప్రసాద్, ఆబోతుల అనిల్‌కుమార్, గొర్లె రోహిత్‌చరణ్, సింగంశెట్టి ప్రసాద్, కుంజం రఘుచైతన్య, కంభం మధు, కుప్పాల జయరామ్, పెంటగట్ల మణికుమార్‌ సంస్థ నిర్వహణలో సహకరిస్తున్నారని గణేష్‌ తెలిపాడు. శిబిరాల నిర్వహణలో రెడ్‌క్రాస్, రాజమహేంద్రవరం సంజీవని బ్లడ్‌ బ్యాంకు డాక్టర్లు తోడ్పాటునందిస్తున్నారని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని