logo

అన్న క్యాంటీన్లకు పునరుజ్జీవం

పేదలకు అతి తక్కువ ధరకే కడుపునిండా అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం రాకతో పునరుజ్జీవం సంతరించుకోబోతున్నాయి.

Updated : 14 Jun 2024 06:12 IST

కూటమి ప్రభుత్వం రాకతో నూతన శోభ
నాలుగో సంతకం వీటిపైనే...

తెదేపా హయాంలో పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్‌ 

అనకాపల్లి పట్టణం, కలెక్టరేట్, న్యూస్‌టుడే: పేదలకు అతి తక్కువ ధరకే కడుపునిండా అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం రాకతో పునరుజ్జీవం సంతరించుకోబోతున్నాయి. నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, ఇతర పనులు మీద ఆయా ప్రాంతాలకు వచ్చేవారికి ఈ క్యాంటీన్‌లు ఎంతో ఆసరాగా నిలిచేవి. వీటి ద్వారా పూటకు రూ.5కే ఆహారాన్ని అందించేవారు. ఎంతో మంది నిరుపేదలకు కడుపు నింపే దేవాలయాలుగా మారాయి. అనేక మంది నాయకులు, దాతలు విరాళాల రూపంలో సహాయం సైతం చేసేవారు. ప్రారంభించిన కొద్దిరోజులకే ఎంతో ప్రజాదరణ పొందడంతో వీటి వల్ల తెదేపాకు మంచి గుర్తింపు వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిపై కక్షసాధింపు చర్యలకు దిగి, వీటిని పూర్తిగా మూసి పేదల కడుపు కొట్టింది. మళ్లీ తెదేపా ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు నాలుగో సంతకం చేశారు.

గతంలో జిల్లాలోని చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేటల్లో నియోజకవర్గానికి రెండు నుంచి మూడు వరకు అన్న క్యాంటీన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు ఇవి పనిచేసేవి. రూ. 5కే నాణ్యమైన ఆహారం అందించడంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లు అటు ప్రయాణికులు ఇటు రోగుల ఆకలి తీర్చేవి. అలాంటి వాటిని వైకాపా ప్రభుత్వం మూసి వేసి పేదలను ఇబ్బంది పెట్టింది. దీంతో వైకాపా పాలనలో ఈ క్యాంటీన్‌లు శిథిలమై శునకాలు, అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి. మరికొన్ని భవనాలను పూర్తిగా ఇతర కార్యక్రమాలకు మార్చేశారు. పేరు మార్చి క్యాంటీన్‌లను కొనసాగించాలని ఎంతో మంది నిరుపేదలు మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికే హిందూపురంలో బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌ సేవలు ప్రారంభమయ్యాయి.


అప్పట్లో అందించిన మెనూ...: అల్పాహారంలో భాగంగా ప్రతిరోజూ ఇడ్లీ లేదా పూరీ, ఉప్మా, పొంగలి అందించేవారు. భోజనంలో అన్నంతోపాటు కూర, పచ్చడి, పెరుగు అందించేవారు. భోజనం చేయడానికి వీలుగా బల్లలు సైతం క్యాంటీన్ల వద్ద ఏర్పాటు చేశారు.

కొత్తవి సైతం ప్రారంభించేలా..:

ముఖ్యమంత్రిగా బాబు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు నాలుగో సంతకం చేయడంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా వీటి ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. గతంలో సేవలు అందించి నిరుపయోగంగా ఉన్న వాటిని తిరిగి మళ్లీ తెరవడానికి చర్యలు చేపడుతున్నారు. కొత్త ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారు.

పేదలకు ఎంతో ఉపయోగం

అన్న క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. మళ్లీ వీటిని తెరవడానికి చంద్రబాబు చర్యలు చేపట్టడం ఆనందంగా ఉంది. విపరీతంగా పెరిగిన ధరలు వల్ల నేడు పేదలకు ఆహారం దొరకడం కష్టంగా మారింది. వీటి పునరుద్ధరణ వల్ల మరలా పేదలకు మూడు పూటల ఆహారం దొరుకుతుంది.

చంద్రరావు, అనకాపల్లి

ఎంతో మంది ఆకలి తీర్చింది: 

తెదేపా హయాంలో అన్న క్యాంటీన్లు ఎంతో మంది ఆకలి తీర్చింది. ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలు, కార్మికులు, కర్షకులకు ఆకలి తీర్చేవి. వైకాపా నిర్లక్ష్యం చేయడంతో ఇవి మూలకు చేరాయి. మళ్లీ వీటిని తెరవడానికి చర్యలు చేపట్టడం ఆనందంగా ఉంది.

రమణ, నర్సీపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని