logo

అయిదు సంతకాలు.. అందరింటా సంబరాలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కారు కొలువు తీరిన రోజు నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే ఆ హామీని నిలబెట్టుకున్నారు.

Updated : 14 Jun 2024 06:11 IST

జిల్లాలో లక్షల కుటుంబాలకు మేలు

ఈనాడు, పాడేరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కారు కొలువు తీరిన రోజు నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే ఆ హామీని నిలబెట్టుకున్నారు. గురువారం సచివాలయంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం పెట్టి నిరుద్యోగ యువత కలలకు రెక్కలు తొడిగారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు హామీలకు సంబంధించిన దస్త్రాలపైనా సంతకాలు పెట్టి పేదలు, రైతులు, యువత ఇంట ఆనందాలు నింపారు. చంద్రన్న సంతకాలతో ఉమ్మడి జిల్లాలో లక్షల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కనుంది. భూ భక్షకుల నుంచి రక్షణ కలగనుంది. యువతకు ఉపాది అవకాశాలు దక్కనున్నాయి.

భూ భక్షణ నుంచి రక్షణ..

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తానని చెప్పి చేసి చూపించారు చంద్రబాబు. వైకాపా సర్కారు ఈ చట్టాన్ని గతేడాది అక్టోబర్‌లో గుట్టుగా తెచ్చి భూ యజమానుల మెడపై కత్తిపెట్టింది. భూ వివాదాలను జిల్లా కోర్టుల్లో పరిష్కరించుకునే వీలు లేకుండా చట్టం చేసి పేదల భూములను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. భూముల రీసర్వేలు చేసి అసలు విస్తీర్ణంలో కోతలు పెట్టారు. భూ యాజమాన్య పత్రాలపై జగన్‌ ఫొటోలు ముద్రించారు. దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. కూటమి నేతలు ఈ అడ్డగోలు చట్టాన్ని రద్దుచేస్తామని హామీ ఇచ్చి అమలు చేసి చూపారు. ఇక ప్రభుత్వ చిహ్నంతోనే పాసు పుస్తకాలు ఇవ్వనున్నారు. భూ హక్కుల విషయమై చిక్కులు లేకుండా చేశారు.

నిరుద్యోగ యువత ఆశలకు ఊపిరి..

తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని చెప్పినట్లే చేశారు చంద్రబాబు. డీఎడ్, బీఎడ్‌ పూర్తిచేసిన వేలమంది నిరుద్యోగ యువత ఆశలకు ఊపిరి పోశారు. గత సర్కారు అయిదేళ్లలో ఒక్క టీచరు పోస్టు భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు హడావిడిగా 6,100  పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా కార్యరూపంలోకి రాకముందే ఆగిపోయింది. పోస్టులు పెద్దఎత్తున ఖాళీలున్నా జీవో నంబర్‌ 117 తెచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య నిష్పత్తులు మార్చి ఖాళీలను చాలా తక్కువగా చూపించారు. ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో కేవలం 99 పోస్టులే ఖాళీలు చూపించారు. ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ, ఇతర కేటగిరీ పోస్టులన్నీ కలిపి 330 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌తో అవేవీ భర్తీకాకుండా నిలిచిపోయాయి. 

3.89 లక్షల మందికి పింఛను లబ్ధి

పింఛనుదారులకు శుభవార్త. కూటమి సర్కారు ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు పింఛను అందించబోతోంది. ఆ మేరకు పింఛను పెంపు దస్త్రంపై సంతకం చంద్రబాబు సంతకం చేశారు. అంతేకాదు పెంచిన పింఛను సొమ్మును ఏప్రిల్‌ నుంచే లబ్ధిదారులకు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాని ప్రకారం వచ్చేనెలలో ఒక్కొక్కరికి రూ.7 వేల మొత్తం చేతికి అందనుంది. దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచి ఇవ్వనున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాలో 3.89 లక్షల మంది పింఛనుదారులున్నారు. వీరందరూ జులైలో రూ.7 వేలు పింఛను అందుకోనున్నారు. ఆగస్టు నుంచి ప్రతినెలా రూ.4 వేలు ఇంటికే అందించే ఏర్పాటు చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నారు.


సర్కారు మారడంతో ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను తెప్పించుకుంటున్నారు. గత సర్కారు చూపిన ఖాళీల కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీచేసే అవకాశం ఉంది. ఆ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వనున్నాయి.

యువతకు నైపుణ్యం

ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందులో భాగంగా యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఆ మేరకు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీనికోసం ముందుగా యువతలో ఉన్న నైపుణ్య విలువలను అంచనా వేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై చంద్రన్న అయిదో సంతకం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 20 వేల మందికి విద్యార్థులు ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకొస్తున్నారు. వీరిలో నైపుణ్యాన్ని గణన చేసి ఏయే కొలువులకు వారి నైపుణ్యం సరిపోతుంది?, ఇంకా ఎలాంటి శిక్షణ అవసరం అని అంచనా వేయనున్నారు. దీనివల్ల నిరుద్యోగితను తగ్గించడానికి వీలవుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని