logo

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యల తిష్ఠ

జిల్లా కేంద్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కాలనుకుంటున్నారా.. అత్యవసర పనులన్నీ ముగించుకుని రండి.. మళ్లీ ఎప్పుడు వెళతారో తెలియదు.

Published : 17 Jun 2024 01:53 IST

జిల్లా కేంద్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కాలనుకుంటున్నారా.. అత్యవసర పనులన్నీ ముగించుకుని రండి.. మళ్లీ ఎప్పుడు వెళతారో తెలియదు. తాగునీటి సీసాతో రండి... ఎందుకంటే ఇక్కడ నీటి సదుపాయం సక్రమంగా ఉండదు. బస్సు వచ్చే వరకు కూర్చుంటామని ఆశ పడకూడదు. నిల్చునే సత్తా ఉండాలి... కారణం ఇక్కడ వేచి ఉండడానికి సరైన సౌకర్యాలు లేవు. బయలుదేరే ముందే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే కాంప్లెక్స్‌లో అరకొరగా ఉన్న మరుగుదొడ్లలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేవు.

బీ మన్యంలోని 11 మండలాలకు ప్రధాన కేంద్రమైన పాడేరులో జిల్లా కేంద్రం ఏర్పడక ముందే 1994లో ఆర్టీసీ కాంప్లెక్స్, బస్సు డిపో ఏర్పాటు చేశారు. అప్పట్లో సుమారు 10 నుంచి 20 సర్వీసులు తిరిగేవి. ప్రస్తుతం పాడేరు డిపోలో 47 బస్సులు ఉండగా 40 తిరుగుతున్నాయి. మరో ఏడు డిపోలో ఉంచుతున్నారు. కాంప్లెక్స్‌ ఆవరణలో విశ్రాంతి గదుల్లో కనీస మౌలిక వసతులు లేవు. కాంప్లెక్స్‌లో ప్రయాణికుల కోసం కుర్చీలు, గాలి పంకాలు, రక్షిత తాగునీరు, దీపాలు లేవు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో చెప్పేవారు రాత్రి సమయంలో అందుబాటులో ఉండడం లేదు. డిపోలో ఉన్న బస్సులు అన్ని మరమ్మతులకు గురై ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్నాయి. ఇటీవల పాడేరు-అరకు వెళ్లే బస్సు ప్రయాణికులతో వెళ్తూ బర్మన్‌గూడ సమీపంలో స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోయి అక్కడ నిలిచిపోయింది. దీంతో వేరే వాహనం వచ్చే వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలకు ఆశ్రయించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్‌ పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. వేతనాలు సకాలంలో ఇవ్వలేదని పారిశుద్ధ్య కార్మికులు పనులకు రావడం లేదు. ఇక్కడ స్త్రీలకు మూడు, పురుషులకు రెండు మరుగుదొడ్లే ఉన్నాయి.


ఫ్యాన్లు తిరగక వేడికి అల్లాడిపోతున్న ప్రయాణికులు

ఇలా చేస్తే మేలు

కంట్రోల్‌ రూమ్‌లో సమాచారం అందించేందుకు టెలిఫోన్‌ సౌకర్యం అందుబాటులో ఉంచాలి. ఫర్నీచర్, తాగునీరు, విద్యుత్తు దీపాలు, పంకాలు ఏర్పాటు చేయాలి. ప్రతి బస్సు వచ్చినప్పుడు, వెళ్లినప్పుడు అవి వెళ్లే గ్రామాల పేర్లు చెప్పేవారిని ఏర్పాటు చేయాలి. పాడేరు నుంచి విజయనగరం వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలి. పాడేరు నుంచి రంపచోడవరానికి రెండు బస్సులు ఏర్పాటు చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ప్రతి వారం జిల్లా స్థాయి సమావేశానికి వచ్చేందుకు బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని వివిధ శాఖల అధికారులు చెబుతున్నారు.

తాగునీటి కుళాయి

మౌలిక వసతులు కల్పిస్తాం

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతాం. కంట్రోల్‌ రూమ్‌లో ఓ ఉద్యోగి ఉంటున్నారు. ఏ సమయంలో ఏ ప్రాంతం బస్సు వెళ్తున్నాయో తెలియజేస్తున్నారు. ఇటీవల మోదకొండమ్మ ఉత్సవాల వల్ల తాగునీరు కుళాయి పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి. మరుగుదొడ్లను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. అదనంగా మరుగుదొడ్లు నిర్మించేందుకు ఉన్నత అధికారుల దృష్టికి  ప్రతిపాదనలు పంపించాం.

శ్రీనివాస్, ఆర్టీసీ డీఎం, పాడేరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని