logo

మన్యంలో గాలివాన బీభత్సం

మన్యంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. వీఆర్‌పురం, రేఖపల్లి, రాజుపేట, పాతరాజు పేట, వడ్డిగూడెం గ్రామాల్లో. పదుల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు కూలిపోగా, 20పైన చెట్లు నెలకొరిగాయి.

Published : 17 Jun 2024 01:55 IST

మారేడుమిల్లి- చింతూరు రహదారిపై కూలిన చెట్టు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మన్యంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. వీఆర్‌పురం, రేఖపల్లి, రాజుపేట, పాతరాజు పేట, వడ్డిగూడెం గ్రామాల్లో. పదుల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు కూలిపోగా, 20పైన చెట్లు నెలకొరిగాయి. రాజుపేట గ్రామంలో నలుగురి ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. 15 మందికి పైగా ఇళ్లపైన చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలాయి. పాతరాజుపేట నుంచి కొత్త రాజుపేట దారిలో, వీఆర్‌పురం హైస్కూల్‌లో అక్కడక్కడ రహదారులపైన చెట్లు కూలాయి. వీఆర్‌పురంలో మూడు, రాజుపేటలో నాలుగు విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. వీఆర్‌పురం, రేఖపల్లి, రాజుపేట గ్రామాల్లో ఈ గాలివానకు దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు ఆ సంస్థ అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరి వివరాలు ఉన్నతాధికారులకు పంపుతామని తహసీల్దార్‌ మౌలానా ఫాలిజ్‌ తెలిపారు. బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  తెదేపా కార్యదర్శి కన్నారావు, వైస్‌ ఎంపీపీ భాగ్యలక్ష్మీ, సింహాచలం పాల్గొన్నారు.

చింతూరు: ఏడుగురాళ్లపల్లి పంచాయతీ కాటుకపల్లిలో పిడుగుపడి సోడి నాంచారమ్మకు చెందిన ఇల్లు పూర్తి దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిడుగు పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లో  వస్తువులు కాలి బూడిదవ్వడంతో కుటుంబం కట్టుబట్టలతో వీధిన పడింది. తహసీల్దార్‌ నజీముల్లాషా తక్షణ సాయంగా 50 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరకులు అందజేశారు.
మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి - చింతూరు రహదారిలో రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు, ప్రభుత్వ సిబ్బంది చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అయింది. చెట్టు కూలిన ప్రదేశంలోనే విద్యుత్తు స్తంభాలు ఉండటంతో వైర్లు తెగిపోయి.ఈ ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది.

కొడెలిలో ఇంటిపై పడిన చింతచెట్టు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు, హుకుంపేట మండలాల మారుమూల గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు వీచాయి హుకుంపేట మండలం గూడ పంచాయతీ కొడెలి గ్రామానికి చెందిన కిముడు బలరాం అనే గిరిజనుడి ఇంటిపైన చింతచెట్టు పడింది.   

చింతపల్లి గ్రామీణం: కిటుముల పంచాయతీ లక్కవరంలో పిడుగుపాటుకు రెండు పశువులు, మేక మృతి చెందాయి. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లక్కవరంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో గ్రామానికి చెందిన గిరిజన వంతల రాజబాబు చెందిన రెండు పశువులు, మేక పిడుగుపాటుకు గురై మృతి చెందాయి.

దేవీపట్నం, న్యూస్‌టుడే:  ఇందుకూరుపేట గ్రామానికి చెందిన పోతుల అన్నారంకు చెందిన ఆరు మేకలు, పోతుల దుర్గకు చెందిన నాలుగు గొర్రెలు పొలంలో మేత మేస్తుండగా పిడుగుపాటుకు మృతి చెందాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

హుకుంపేట:  సుకూరు అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు మూగజీవాలు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం గ్రామానికి చెందిన రైతులు ఆవులను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లి విడిచిపెట్టి ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మేత మేస్తున్న మూగజీవాలపై పిడుగు పడింది. ఉదయం గిరిజనులు వెళ్లి చూడగా ఆరుగురు రైతులకు చెందిన 13 మూగజీవాలు మృతి చెంది ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని