logo

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: కొణతాల

ఎన్‌టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని, అసెంబ్లీ తొలి సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.

Published : 17 Jun 2024 01:56 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కొణతాల తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే : ఎన్‌టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని, అసెంబ్లీ తొలి సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. స్థానిక రింగ్‌రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయానికి ఆదివారం ఆయన వచ్చి ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా ఈమేరకు తీర్మానం చేయాలన్నారు.  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నది తెలుగు వారందరి కోరికని చెప్పారు.  మూడు పార్టీల పొత్తును ప్రజలు గౌరవించారని, అందుకే కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీలు వచ్చాయని వివరించారు. తన జీవితంలో మరిచిపోలేనంత ఆధిక్యతను ప్రజలు ఇచ్చారన్నారు. వైకాపా కార్యకర్తలు కూడా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారన్న విషయం మరిచిపోరాదన్నారు. రాష్ట్రంలో వైకాపా రావాలి, స్థానికంగా ఓడిపోవాలని వైకాపా నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారని, రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉన్నందునే వారికి అన్ని తక్కువ సీట్లు వచ్చాయన్నారు. పదవీ స్వీకారం రోజున అయిదు సంతకాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. కక్ష సాధింపులు ఉండవని అలాగని తప్పులు చేసిన వారిని వదిలే ప్రశ్నే లేదన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. వారికి నా పాదాభివందనాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగద్వీరరావు ఆధ్వర్యంలో కొణతాలను ఘనంగా సత్కరించారు. సమావేశానికి పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు డాక్టరు కేకేవీ నారాయణరావు అధ్యక్షత వహించారు. నాయకులు కోట్ని రామకృష్ణ, కొణతాల వెంకటరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక బెల్లం మార్కెట్‌లోని కార్మికులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్డులోని నాగదేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి): పట్టణంలోని రింగురోడ్డు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా కొణతాలకు అనిత పాదాభివందనం చేశారు. అనంతరం కొణతాల అనితను శాలువాతో సత్కరించి వినాయకుడు చిత్రపటాన్ని అందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించి నిరుపేదలకు న్యాయం చేయాలని సూచించారు. అనంతరం అనిత రామకృష్ణను శాలువాతో సత్కరించి రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. పలువురు కూటమి నాయకులు అనితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ మంత్రి దాడితో భేటీ

అనకాపల్లి పట్టణం: అమరావతి నుంచి ఆదివారం అనకాపల్లి వచ్చిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొణతాలను ఆయన సత్కరించారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రత్నాకర్, జయవీర్, నారాయణరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని