logo

వాలంటీర్లపై ప్రభుత్వానిదే తుదినిర్ణయం

రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా అనేది ప్రభుత్వస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, దీనిపై తాను ఏమీ చేయలేనని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 17 Jun 2024 02:14 IST

విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను కోరుతున్న వాలంటీర్లు 

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా అనేది ప్రభుత్వస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, దీనిపై తాను ఏమీ చేయలేనని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ తెలిపారు. వైకాపా నాయకుల ఒత్తిడి మేరకు తాము ఉద్యోగాలకు రాజీనామా చేశామని, రాజకీయాలకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఎలమంచిలికి చెందిన వాలంటీర్లు విజయ్‌కుమార్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడం వల్లే చేశామని తెలిపారు. ఐదేళ్లు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించామని, ఎన్నికల సమయంలో తమకు రాజకీయాలు అంటగట్టారని వాపోయారు. తమతో బలవంతంగా రాజీనామా చేయించిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని, తమ ఉపాధిని తిరిగి పునరుద్ధరించాలన్నారు. బలవంతంగా చేసిన రాజీనామాలకు విలువ ఇవ్వవద్దని కోరారు. సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని, అక్కడి నిర్ణయం ప్రకారంపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వారికి ఎమ్మెల్యే తెలిపారు.

  • అచ్యుతాపురంలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని సుందరపు విజయ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక కూడలిలో కాలువలు, రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను ఆదివారం పరిశీలించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డ్రీమ్స్‌ నాయుడు, పుర్రే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
  • రైతులకు అవసరమైన విత్తనాలు, యంత్ర పరికరాల కొరత లేకుండా చూస్తానని సుందరపు విజయ్‌కుమార్‌ తెలిపారు. పెదపాడులో రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఎలమంచిలి డివిజన్‌లో 1318 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జనసేన, తెదేపా నాయకులు జనపరెడ్డి శ్రీనివాసరావు, రాజాన రమేష్‌కుమార్, నర్సింగరావు, సర్పంచి అరుణ, ఏఓ శంకర్‌గోవింద్‌ పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని