logo

కొత్త పేరుతో.. మరింత జోరుతో..

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి శుక్రవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ఇకపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా సరికొత్త రూపు సంతరించుకుని ప్రజల సమస్యలు పరిష్కారానికి ముందుకు రానుంది.

Updated : 17 Jun 2024 02:49 IST

పాడేరు, న్యూస్‌టుడే

అనకాపల్లిలో అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి శుక్రవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ఇకపై ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా సరికొత్త రూపు సంతరించుకుని ప్రజల సమస్యలు పరిష్కారానికి ముందుకు రానుంది. కొత్తగా ఏర్పడిన తెదేపా ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనలో భాగంగా పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రసల్‌ సిస్టమ్‌ పేరుతో ప్రజలకు సేవలు అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలు పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు మండల, నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం ఇకపై సరికొత్తగా పేరు మార్చుకుని, ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందు రానుంది. వైకాపా ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే స్పందన, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాలు ద్వారా ఫిర్యాదులు స్వీకరించినా వీటి పరిష్కారం అంతంత మాత్రమే! ప్రతి సోమవారం జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఈ కార్యక్రమం నిర్వహించేవారు. నేరుగా ప్రజలు నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేవారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో జరిగేది. అర్జీ సమస్యను బట్టి 90 రోజుల్లో పరిష్కరించే విధంగా సమయం పెట్టేవారు. దీంతో ప్రారంభంలో ప్రజలు స్పందనకు భారీగా తరలివచ్చేవారు. రానురాను ఈ కార్యక్రమాన్ని నీరుగార్చడంతో పాటు సమస్యల పరిష్కారానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనికి రాని స్పందన ఎందుకు అంటూ పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పించేవారు. ఒకే సమస్యపై పదిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కరించేవారు కరవయ్యారు. దీంతో ఫిర్యాదుదారులు రావడం తగ్గింది. ప్రారంభంలో స్పందనకు జిల్లా నలుమూలల నుంచి 150 నుంచి 200 వరకు అర్జీలు వచ్చేవి. క్రమేపీ వీటి సంఖ్య బాగా పడిపోయింది.. ఇలా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న స్పందనను సైతం వైకాపా ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది.

మార్చి 16 నుంచి బ్రేక్‌

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో మార్చి 16న జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. సుమారు మూడు నెలల పాటు స్పందన లేకపోవడంతో ప్రజలు సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ప్రజలు, అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు రోజులు గడవక ముందే స్పందనపై దృష్టి సారించారు. ప్రజలు సమస్యలపై ఇబ్బందులు పడకూడదని తక్షణమే స్పందనను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా పేరుమార్చి తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ వెనువెంటనే ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీంతో అధికారులు దీని నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని