logo

శాంతిభద్రతలను కాపాడాలి

రంపచోడవరం నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు.

Updated : 17 Jun 2024 02:17 IST

హోంమంత్రికి ఎమ్మెల్యే శిరీషాదేవి వినతి

రాష్ట్ర హోం మంత్రి అనితను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి, విజయభాస్కర్‌ దంపతులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, విజయభాస్కర్‌ దంపతులు అనితను విశాఖపట్నంలో ఆదివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చూడాలన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు చేపట్టాల్సిన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేయాలని హోంమంత్రి అనితను కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేద్దామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టర్‌ రవి, ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆదివారం అనకాపల్లిలో నిర్వహించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు మంత్రిని పరిచయం చేసుకుని, ఆమెను సత్కరించారు. అనంతరం మంత్రి అనిత విలేకరులతో మాట్లాడుతూ నిబంధనలకు లోబడి అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలకుల మెప్పు కోసం కొందరు, మరికొంత మంది వారి స్వప్రయోజనాల కోసం పనిచేసి ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్నారు. అలాంటివాటికి స్వస్తి చెప్పాలని కోరారు. అధికారులకు రాజకీయాలు అవసరం లేదని, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా నిబంధనలకు లోబడి పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖకూ నిధులు కేటాయించక పోవడంతో పనులు జరగలేదన్నారు. ఎన్నికల అనంతరం విశాఖపట్నం నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్‌చేసి తన కుమార్తె అదృశ్యమైనా పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలపై విచారణ చేసి శాంతిభద్రతల పరిరక్షణతోపాటు క్రైం రేటు తగ్గిస్తామన్నారు. తాను మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఉన్నతాధికారులంతా సహకరించి మెరుగైన పాలన అందించేలా చొరవ చూపాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని