logo

వణికిస్తున్న వరద భయం

వైకాపా పాలనలో అయిదేళ్ల కాలం కరిగిపోయింది. జగనన్న పాలనలో తమ బతుకులు మారిపోతాయని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు నిరాశే మిగిలింది.

Updated : 17 Jun 2024 05:13 IST

చంద్రబాబుపైనే పోలవరం నిర్వాసితుల ఆశలు
చింతూరు, దేవీపట్నం, న్యూస్‌టుడే

గోకవరం మండలం గంగాలమ్మ ఆలయం సమీపాన అసంపూర్తిగా పూడిపల్లి పునరావాస కాలనీ

వైకాపా పాలనలో అయిదేళ్ల కాలం కరిగిపోయింది. జగనన్న పాలనలో తమ బతుకులు మారిపోతాయని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు నిరాశే మిగిలింది. పరిహారం అందలేదు.. పునరావాస కాలనీలు పూర్తికాలేదు. విలీన మండలాలకు మళ్లీ వరద సీజన్‌ వచ్చేసింది. 2022లో సంభవించిన వరదలతో బెంబేలెత్తిన విలీన మండలాల ప్రజలు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్నప్పుడల్లా భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని పోలవరం నిర్వాసితులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుండటంతో తమ సమస్యలపై దృష్టి పెడతారని నిర్వాసితులు ఆశ పడుతున్నారు.

జిల్లాల్లోని 373 ముంపు గ్రామాల్లో 1,06,006 నిర్వాసిత కుటుంబాలున్నాయి. తెదేపా హయాంలో 2017-18లో భూసేకరణ పూర్తిచేశారు. తొలి దశలో కొన్ని గ్రామాలకు పరిహారం చెల్లించారు. ఇంతలో 2019 ఎన్నికలు రావటం, అప్పటి తెదేపా ప్రభుత్వం మారి వైకాపా అధికారంలోకి రావటం జరిగింది. దీంతో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మార్గం లేకుండా పోయింది. అధికారంలోకి రాకముందు వైకాపా లెక్కలేనన్ని హామీలతో నిర్వాసితులకు ఎన్నెన్నో ఆశలు రేకెత్తించింది. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది.

2022 వరదలో కూనవరం

ఏ ప్రయోజనం లేని కాంటూరుల విభజన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎనిమిది మండలాల్లో  222 రెవెన్యూ గ్రామాలు, 373 ఆవాస ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇందులో 1,06,006 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నాయి. 2022లో సెప్టెంబరు నెలాఖరు నాటికి పునరావాస గ్రామాలకు తరలిస్తామని చెప్పారు. ఈ హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఒక్క గ్రామానికి కూడా పునరావాసం చూపించలేదు. వీటిలో ఇప్పటివరకు కేవలం 25 ఆవాస ప్రాంతాల్లోని 6,351 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 348 ఆవాసాలకు చెందిన 99,655 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం 213 పునరావాస కాలనీలు నిర్మించాలి. ఇప్పటివరకు పూర్తయినవి 50కి మించలేదు.

కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంతో ముంపునకు గురయ్యే గ్రామాలను 41.15 కాంటూరు పరిధిగా, మిగిలిన గ్రామాలను 45.72 కాంటూరు పరిధిలో చేర్చారు. ఇప్పటికే కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయినందున 41.15 కాంటూరు పరిధిలోని 107 గ్రామాలను రెండేళ్ల క్రితమే ఖాళీ చేయించాల్సి ఉంది. గతంలో ఖాళీ చేయించిన పోలవరం, దేవీపట్నం మండలాల్లోని కొన్ని గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలను ఇప్పటికీ ఖాళీ చేయించలేకపోయారు. 2022లో వరదల ప్రభావంతో మరో 48 గ్రామాలను ఖాళీ చేయించాల్సిన అవసరం కనిపించింది. ఆ గ్రామాలు 45.72 కాంటూరు పరిధిలోనివే అయినా, మొదటి ప్రాధాన్యంగా వాటినీ ఖాళీ చేయించనున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే వాటికి పునరావాసం, ప్యాకేజీలను అందించేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించినా పునరావాస కాలనీలు నిర్మించేందుకు భూసేకరణ చేయలేదు.

కదలని కాలనీల పనులు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన పునరావాస కాలనీల పనులను వైకాపా ప్రభుత్వం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందాన వదిలేసింది. ఈ అయిదేళ్లలో అనేక మంది నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల కోసం అధికారులకు దరఖాస్తులు అందజేసినా ఏ ఫలితం లేదు. దీంతో విరక్తి చెందిన నిర్వాసితుల్లో పూడిపల్లికి చెందిన దేవిశెట్టి నాగేశ్వరరావు, దేవీపట్నంకు చెందిన ఉండమట్ల సీతారామయ్య ఆత్మహత్యకు యత్నించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

  • దేవీపట్నం మండలంలోని 44 గ్రామాల పరిధిలోని దాదాపు ఆరువేల కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన పునరావాస కాలనీలు మినహా గత వైకాపా అయిదేళ్ల పాలనలో చేపట్టిన దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం పునరావాస కాలనీలు నేటికీ పూర్తికాలేదు.  
  • దేవీపట్నం మండల జడ్పీటీసీ సభ్యురాలు శిరసం సత్యవేణి ఉంటున్న కె.వీరవరం గ్రామానికి మూడేళ్లుగా పునరావాస కాలనీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులను మధ్యలోనే నిలిపివేశారు.
  • అధికారులు తమను మూడేళ్లుగా పట్టించుకోలేదని పూడిపల్లి, దేవీపట్నం గ్రామాల గిరిజనేతర నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు గ్రామాల పునరావాస కాలనీ నిర్మాణానికి వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని