logo

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతిథి ఉపాధ్యాయులకు కష్టం

గత వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Published : 18 Jun 2024 01:58 IST

విద్యార్థులకూ తప్పని ఇబ్బందులు
పెదబయలు, న్యూస్‌టుడే

పెదబయలు ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు

గత వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడంతో ఆయా ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.

ఆదివాసీ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు సీబీఎస్‌ఈ విధానంలో ఉత్తమ విద్య, నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో ఏకలవ్య మోడల్‌ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రారంభంలో సొంత భవనాలు లేకపోవడంతో చెంతనే ఉన్న గిరిజన సంక్షేమ గురుకులాలకు వీటిని అనుసంధానం చేస్తూ ఆరు నుంచి ఇంటర్‌ వరకు ప్రవేశాలు చేర్పించారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడం, గురుకులాల కంటే ఇక్కడ వేతనాలు ఎక్కువగా ఉండడంతో ఎప్పటికైనా ఉద్యోగ భద్రత ఉంటుందని ఉన్న ఉద్యోగాలను వదిలేసి రెండేళ్ల క్రితం ఏకలవ్యలో అతిథి ఉపాధ్యాయులుగా పలువురు చేరారు. ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి గతేడాది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. వెంటనే రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు జరిపి ఈ విద్యా సంవత్సరం ఆరంభానికే వారు విధుల్లో చేరేలా చర్యలు చేపట్టింది. ఇటీవల అన్ని పాఠశాలల్లో కనీసం 12 నుంచి 20 మంది వరకు శాశ్వత ప్రాతిపదికన చేరుతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు చేరుతున్నారు. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైకాపా ప్రభుత్వం తమ పరిస్థితి వివరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అతిథి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 28 ఏకలవ్య పాఠశాలలున్నాయి. అతిథి ఉపాధ్యాయులు 350 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఉన్న శాశ్వత ఉద్యోగులకు ఈఎంఆర్‌ ప్రిన్సిపల్‌ బాధ్యతలు అప్పగించారు. గురుకులాల్లో ఉన్న ఉపాధ్యాయులతో డిప్యుటేషన్‌ పద్ధతిలో కొన్నాళ్లు, ఆ తరువాత అతిథి ఉపాధ్యాయులతో ఏకలవ్యలను నడిపించారు. రెండేళ్ల క్రితం ఇక్కడ అతిథి ఉపాధ్యాయుల నియామకం కోసం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రకటన జారీ చేశారు. మెరిట్‌ ప్రాతిపదికన డెమో నిర్వహించి పక్కాగా నియామకాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఏకలవ్యల్లో సుమారు పదివేల పోస్టుల నియామకానికి గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఎన్నికలకు ముందే రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు ముగించి, ఇటీవలే నియామకపత్రాలూ ఇచ్చింది. రాష్ట్రంలో 650 మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న అతిథి ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి రెన్యువల్‌ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోతే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బోధన అర్థంకాక..

గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు ఇప్పటివరకున్న అతిథి ఉపాధ్యాయులు ఆంగ్లంతోపాటు తెలుగులో బోధించడం వల్ల ఇబ్బందులు ఎదురవ్వలేదు. ప్రస్తుతం ఉత్తర భారతదేశానికి చెందిన వారు రావడంతో వారు తెలుగు మాట్లాడలేకపోవడంతో పిల్లలకు పాఠాలు అర్థమయ్యే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గిరిజన విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు పి.భగవాన్, ఎన్‌.నాయుడు, అశోక్‌ తదితరులు కోరుతున్నారు.

శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు వస్తే తాము వెనక్కి వెళ్లిపోతామని ముందుగానే ఒప్పందం రాసి అతిథి ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో చేరారని గురుకులాల కార్యదర్శి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారని ముంచంగిపుట్టు, పెదబయలు సంయుక్త ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్‌ పి.కేశవరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసి ఇటీవల నియామకాలు జరిపిందన్నారు. ఈనెల 19వ తేదీనాటికి ఎంతమంది చేరారో తెలుసుకొని తరువాత, మిగతా ఎంతమంది అతిథి ఉపాధ్యాయులు అవసరమో తీసుకుందామని చెప్పారన్నారు. అప్పటి వరకు ఎవర్నీ విధుల్లోకి తీసుకోవద్దని కార్యదర్శి చెప్పారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని