logo

వైకాపా రక్తం ప్రవహిస్తున్న పోలీసులు స్వచ్ఛందంగా వెళ్లిపోండి..

‘గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసులు వైకాపా తొత్తులుగా పని చేశారు. ఒంటిపై ఖాకీ చొక్కాను వదిలితే వైకాపా కండువా వేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు.

Updated : 18 Jun 2024 05:30 IST

రాష్ట్ర హోం మంత్రి అనిత

అనితకు వేదాశీర్వచనం అందిస్తున్న అర్చకులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ‘గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసులు వైకాపా తొత్తులుగా పని చేశారు. ఒంటిపై ఖాకీ చొక్కాను వదిలితే వైకాపా కండువా వేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. అలాంటి వారందరికీ ఒకటే హెచ్చరిక. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఉండండి. ఇంకా వైకాపా రక్తం ప్రవహిస్తోందని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోండి’ అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులకు సూచించారు. రాష్ట్ర మంత్రిగా ఎంపికయిన నేపథ్యంలో సోమవారం ఆమె తొలిసారి కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారికి జీతాలిచ్చేది ప్రజలే. జనం కోసమే వారంతా పనిచేయాలి. అలా కాకుండా ఎవరికో తొత్తులుగా పని చేస్తామంటే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇంకా వైకాపాను అంటకాగే పోలీసులు ఉంటే శాంతి భద్రతల విభాగంలో కాకుండా మరో విభాగానికి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని సూచించారు. అలాంటి వారి సమాచారం తన వరకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల వైపు ఎవరైనా చెడుగా కన్నెత్తి చూడాలంటే భయపడేలా పాలన ఉంటుందన్నారు. పోలీసు విభాగం దానికి అనుగుణంగా పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లా మంత్రిగా, హోంమంత్రిగా సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని, సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, పంచగ్రామాల భూసమస్య పరిష్కరిస్తామని అన్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆమెకు సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కల్యాణ మండపంలో పండితులు వేదమంత్రాలతో అనిత, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని