logo

అమూల్‌.. ఢమాల్‌..!

జగనన్న పాలవెల్లువ పేరుతో హెరిటేజ్, ఇతర సహకార డెయిరీలను దెబ్బకొట్టాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్‌ డెయిరీల కథ ఢమాల్‌ అయ్యింది. వైకాపా సర్కారు అన్నీ తానై అమూల్‌కు మేళ్లు చేకూర్చినా పాలసేకరణలో ముందుకు వెళ్లలేకపోయింది.

Updated : 18 Jun 2024 08:20 IST

మూతపడుతున్న పాలసేకరణ కేంద్రాలు
అన్నీ సర్కారే సమకూర్చినా కొరవడిన నిర్వహణ
కరెంటు బిల్లులు కట్టడానికీ సొమ్ముల్లేవంట!
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి, అనకాపల్లి

జగనన్న పాలవెల్లువ పేరుతో హెరిటేజ్, ఇతర సహకార డెయిరీలను దెబ్బకొట్టాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్‌ డెయిరీల కథ ఢమాల్‌ అయ్యింది. వైకాపా సర్కారు అన్నీ తానై అమూల్‌కు మేళ్లు చేకూర్చినా పాలసేకరణలో ముందుకు వెళ్లలేకపోయింది. రైతులు ఆసక్తి చూపకపోవడం, కేంద్రాల నిర్వహణకు సొమ్ముల్లేక ఇప్పటికే 55 కేంద్రాలు మూతపడ్డాయి. గతంలో రోజుకు 50 వేల లీటర్లు పాలు రాగా ప్రస్తుతం 37,600 లీటర్లు మాత్రమే వస్తున్నాయి. వీటి వల్ల పాడి రైతులకు ఎంతో మేలు చేకూరినట్లు ప్రచారం చేసుకున్నా వారికి ఒనగూరిన ప్రయోజనం సున్నాయే..

అమూల్‌ డెయిరీపై గత సర్కారు అవాజ్యమైన ప్రేమ చూపింది. ఆ సంస్థ ఏం కోరినా అధికారులతో చకచకా ఏర్పాట్లు చేసింది. పాడి రైతులను సంఘటితం చేసి పాలసేకరణకు వసతిని కల్పించడం వరకూ అన్నీ సర్కారే దగ్గరుండి చక్కబెట్టింది. నెలనెలా పాలసేకరణ పెంచేలా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చింది. ఇంత చేసినా పాల సేకరణలో సహకార, ప్రైవేటు డెయిరీలను తట్టుకుని నిలబడలేకపోతోంది. అనకాపల్లి జిల్లాలో 305 పాలసేకరణ కేంద్రాలు ప్రారంభించగా అందులో 55 కేంద్రాలు మూతపడ్డాయి. పాలు పోయడానికి రైతులెవ్వరూ ముందుకురాక మరో 29 కేంద్రాలు తలుపులే తెరుచుకోలేదు. కొన్నిచోట్ల పంచాయతీ భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటి నిర్వహణ ఖర్చులు అమూల్‌ భరించాల్సి ఉంది. అయితే ఆ భారం పంచాయతీల నెత్తినే వేస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్‌ వచ్చాక గతంలో విశాఖ డెయిరీ నుంచి రైతులకు అదనంగా అందించే బోనస్‌లు, ఏరువాక ప్రోత్సాహకాలన్నీ నిలిపేశారని పాడిరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పంచాయతీలపై డెయిరీల భారం..

నక్కపల్లి, అనకాపల్లి మండలాల్లోని సీహెచ్‌ఎల్‌పురం, మార్టూరు పంచాయతీ కార్యాలయాల్లో అమూల్‌ డెయిరీలు రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. అప్పట్లో అధికారులు పంచాయతీ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వీటిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వల్ల పంచాయతీకి ఎలాంటి ఆదాయం లేకపోగా వాటి నిర్వహణ ఖర్చుల భారం భరించాల్సివస్తోంది. సీహెచ్‌ఎల్‌పురం పంచాయతీకి అమూల్‌ మహిళా డెయిరీ నుంచి సుమారు రూ.20 వేల విద్యుత్తు ఛార్జీల బకాయిలు రావాల్సి ఉంది. మార్టూరు పంచాయతీకి సైతం డెయిరీ విద్యుత్తు ఛార్జీలు చెల్లించడం లేదు. దీనిపై పంచాయతీ పాలకవర్గాలు గుర్రుగా ఉన్నాయి.

పాలకేంద్రంలో ఉపయోగిస్తున్న యంత్రాలు

ఆరంభశూరత్వం..

జిల్లాలో విశాఖ, హెరిటేజ్, తిరుమల మరికొన్ని ప్రైవేటు డెయిరీలు పాలు సేకరిస్తున్నాయి. వాటిని కాదని వైకాపా సర్కారు అమూల్‌ను తీసుకువచ్చి రైతులపై ఒత్తిళ్లు తెచ్చి పాలు సేకరించడం మొదలుపెట్టింది. పాడి రైతుల సంఘాలు ఏర్పాటు చేసి వారి పేరున బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రైతులకు సహకార బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్భాంటగా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇతర డెయిరీలు పాలు పోసే రైతుల పిల్లలకు విద్య, వారి కుటుంబాలకు వైద్యం, పాడి పశువులకు దాణా రాయితీపై అందిస్తున్నాయి. పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. అమూల్‌ సంస్థ ఇవేవీ అమలు చేయకపోవడంతో క్రమంగా ఆ సంస్థకు పాలు పోసేందుకు గ్రామాలలో అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఒక్కో కేంద్రం మూతపడుతూ వస్తోంది. మునగపాక మండలంలో మూలపేట, పాటిపల్లి, కాకరాపల్లి, తోటాడ, పి.ఆనందపురం, చోడవరం మండలంలో జుత్తాడ, అంభేరుపురం, రాయపురాజుపేట, అచ్యుతాపురం మండలంలో ఆవసోమవారం, చీమలాపల్లి, మడుతూరు, వెదురువాడ, అనకాపల్లి మండలంలో పాపయ్యపాలెం, గొలగాం, తలారిపాలెంలలో అమూల్‌ కేంద్రాలు మూతపడ్డాయి.

కొత్త ప్రభుత్వం ఎలా చెబితే అలా..

గత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అమూల్‌ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో కొన్నిచోట్ల రైతులు పాలుపోయడానికి ముందుకు రాకపోవడంతో మూతపడ్డాయి. కొన్నిచోట్ల కొత్త కేంద్రాలను తెరుస్తున్నాం. డెయిరీల వల్ల పంచాయతీలపై భారం పడుతున్న సంగతి మాకు తెలీదు.. ఆ సంస్థ వాటిని పరిష్కరించుకోవాలి. కొత్త ప్రభుత్వం వాటిపై ఎలాంటి ఉత్తర్వులు ఇస్తే ఆ విధంగా ముందుకు వెళతాం.

ప్రసాదరావు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని