logo

సరిచేస్తారా.. సరిపెట్టేస్తారా!

ఆంధ్రాఊటీ అరకులోయను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2019కు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక నిధులను కేటాయించారు.

Published : 18 Jun 2024 02:14 IST

రూ. 16 కోట్ల రహదారి పనుల్లో లోపాలు
అరకులోయ, న్యూస్‌టుడే

గోతులమయంగా బీటీ రహదారి

ఆంధ్రాఊటీ అరకులోయను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2019కు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక నిధులను కేటాయించారు. అరకులోయ రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఆర్‌ఐటీఐ నుంచి ఎండపల్లివలస వరకు రోడ్డు విస్తరించేందుకు రూ. 16 కోట్ల నిధులు కేటాయించారు. ఎట్టకేలకు 2021లో ఈ పనులు ప్రారంభించారు. మూడేళ్లపాటు సాగదీస్తూ 9 మాసాల క్రితం పనులు పూర్తయ్యాయని ప్రకటించారు. గుత్తేదారు చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత కొరవడింది. లోపభూయిష్టంగా వీటిని చేపట్టారు. డ్రైనేజీ, యూటర్న్‌ పాయింట్స్, బీటీ నిర్మాణాల్లో ఎన్నో లోపాలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఈ రహదారి రూపురేఖలు మారుస్తారా.. అలాగే వదిలేస్తారా అని స్థానికులు పేర్కొంటున్నారు.

లోపాలమయంగా యూటర్న్‌లు .. అరకులోయ పట్టణంలో సుమారు 10 చోట్ల యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. వీటిని లోపాలమయంగా నిర్మించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలు యూటర్న్‌ తీసుకునేందుకు వీలుగా ఖాళీ వదిలి డివైడర్లు నిర్మించాలి. గుత్తేదారు మాత్రం ఎటువంటి ముందు చూపు లేకుండా డివైడర్లను దగ్గరగా ఏర్పాటు చేయటంతో వాహనాలు యూటర్న్‌ తీసుకునేందుకు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని యూటర్న్‌ల వద్ద వాహనాలు డివైడర్‌లను ఢీకొడుతున్నాయి. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ ఏఈఈ నాగేంద్రప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. రహదారిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

సెరికల్చర్‌ కార్యాలయం వద్ద నిలిపేసిన డ్రైనేజీ నిర్మాణం

గోతులమయం

అరకులోయ నుంచి ఎండపల్లివలసకు వెళ్లే మార్గంలోని కోడిగెడ్డ వంతెన సమీపంలో బీటీ రహదారి గోతులమయంగా మారింది. ఒకవైపు పూర్తిగా గోతులమయంగా మారటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రమాదాలకు నిలయంగా రహదారిని మార్చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన నెల రోజులకే రహదారి ఇలా మారింది.

మురుగంతా రోడ్డు పక్కనే..

అరకులోయ పట్టణంలో రహదారి పక్కనే భూగర్భ డ్రైనేజీని నిర్మించారు. ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని సెరికల్చర్‌ కార్యాలయంతో ఆపేశారు. అక్కడ మురుగు నిల్వ ఉండిపోతోంది. దీంతో దుర్గంధం వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని