logo

బాలలందరూ బడికెళ్లేలా

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనతో ‘నేను బడికి పోతా’ వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Updated : 18 Jun 2024 06:19 IST

కొత్త కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీకారం
పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

లగిశపల్లిలో విద్యార్థులతో చైతన్య ర్యాలీ

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనతో ‘నేను బడికి పోతా’ వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి బడులు తెరుచుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలకు పునః ప్రారంభమయ్యాయి. బడి ఈడు పిల్లలందరినీ వచ్చేనెల 12 వరకూ నెల రోజులపాటు నేను బడికి పోతా అనే వినూత్న కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో  చేర్చేందుకు రంగంలో దిగుతున్నారు.

ప్రధానంగా 6-14 లోపు చిన్నారులు బడుల్లో చేరాల్సిన వారు బడి బయట సంచరిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో పాటు చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా ఆయా వయస్సు గల పిల్లలు చదువుపై ఆసక్తి చూపడం లేదని వివిధ సర్వేల ద్వారా వెల్లడైంది. చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు, సదస్సులు నిర్వహించడం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యం వివరించేలా నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి బడి బయట పిల్లలను పాఠశాలలకు రప్పించనున్నారు.

మూడు స్థాయిల్లో..

మూడు స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రధానంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పడ్డాయి. జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి అధికారులు మరో 13 మంది వరకూ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారులు సభ్య కన్వీనర్లుగా, ఎంపీడీఓ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్, సీడీపీఓ, గిరిజన సంక్షేమ విద్యాశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. గ్రామస్థాయిలో తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, సీఆర్‌పీ, సచివాలయ సంక్షేమాధికారి, అంగన్‌వాడీ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఈ మూడు స్థాయిల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.

అవగాహన ఇలా.. ఈ నెల 13 నుంచి జులై 12 వరకూ నెల రోజులపాటు నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజు 13న సమన్వయ సమావేశాలు, మండలాల కేటాయింపులు చేయనున్నారు. 14న ప్రభుత్వ బడుల్లో పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరణ గోడ పత్రికలు, వివిధ మాధ్యమాల ప్రచారం, ర్యాలీలు నిర్వహించడం, అమ్మఒడి, గోరుముద్ద, మధ్యాహ్నం భోజనం, ఇతర సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరిస్తారు. 15 నుంచి వచ్చే నెల 11 వరకూ మండల స్థాయి, గ్రామ స్థాయిలలో బృంద సభ్యులు ర్యాలీలు, సభలు, అవగాహన సదస్సులు నిర్వహించి 6-14 లోపు పిల్లల గుర్తింపు ప్రక్రియ చేపడతారు.

30 వేలమందికి పైగా..

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా 2527 ప్రాథమిక పాఠశాలలు, 370 వరకూ ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ విద్యాశాఖ, గురుకుల, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలల యాజమాన్యాల్లో సుమారుగా 1.8 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏటా 6-14 సంవత్సరాల లోపు వివిధ కారణాలతో సెలవుల అనంతరం స్కూల్‌ తెరిచే నాటికి బడులకు రావడంపై ఆసక్తి చూపడం లేదని వివిధ సర్వేల ద్వారా తెలుసోంది. ప్రధానంగా ఐదో తరగతి ఉత్తీర్ణత తరవాత ఆరో తరగతిలో ప్రవేశాలకు వెళ్లకపోవడంతోపాటు ఆరు, ఏడు తరగతుల తర్వాత ఇంటికే పరిమితమై చదువుకు దూరమవుతూ ఉన్నారు. వీరంతా సుమారు 30 వేల నుంచి 35 వేల మంది వరకూ ఉంటారని అంచనా.

  • 100 శాతం సర్కారీ బడుల్లో ప్రవేశాలు
  • 6-14 వయస్సు పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి లేకుండా చేయడం
  • బడి బయట ఉన్న వారిని గుర్తించి వారికి తిరిగి ప్రవేశాలు కల్పించడం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని