logo

.. అను నేను.. అందరి ఆకాంక్షలు నెరవేరుస్తానని..!

జగన్‌ నిరంకుశపాలనపై జనమంతా ఓటుతో తిరగబడ్డారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 21 Jun 2024 04:28 IST

నేడు శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
జిల్లాను ప్రగతి పథంలో నడిపించే బాధ్యత వారిపైనే
ఈనాడు, అనకాపల్లి

జగన్‌ నిరంకుశపాలనపై జనమంతా ఓటుతో తిరగబడ్డారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణం చేసి వారి శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఎమ్మెల్యేలంతా శుక్రవారం జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో ప్రమాణం చేయబోతున్నారు. ఎన్నికల ఫలితాల రోజునే నేతలంతా తమను ఇంత భారీ మెజార్టీలతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటామని వారి ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీలు ఇచ్చారు. వాటిని గుర్తుచేసుకుంటూనే శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అధినేత భజన, విపక్షాలపై విషం చల్లడానికే శాసనసభ సమయమంతా హరించకుండా ప్రజా సమస్యలపైనే గళంవినిపించాలని ఆశిస్తున్నారు.


అనిత రెండోసారి..

జిల్లా నుంచి అసెంబ్లీలో రెండో సారి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేల్లో వంగలపూడి అనిత ఒకరు. 2014లో తొలిసారి పాయకరావుపేట నుంచి విజయం సాధించిన ఆమె తర్వాత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీచేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో పేట నుంచే మరోసారి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. మంత్రిగాను ప్రమోషన్‌ పొందారు. కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించారు.

ఒకరు మినహా అంతా సీనియర్లు..

అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. వీరిలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ మినహా మిగతా సభ్యులంతా ఇదివరకు శాసనసభలో గళం వినిపించిన వారే. ఒక్కొక్కరు రెండు నుంచి ఏడు సార్లు గెలుపొందిన సీనియర్‌ ఎమ్మెల్యేలూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేను పాతికే వేల నుంచి 80 వేలకు పైగా మెజార్టీతో గెలిపించారు. తమ ప్రాంత అభివృద్ధికి కొత్త నేతలు పాటుపడతారని ప్రజలు విశ్వసించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే పాలన సాగించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంది.


ఏడోసారి అయ్యన్న..

జిల్లా నుంచి శాసనసభలో అడుగుపెడుతున్న కూటమి ఎమ్మెల్యేల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడే సీనియర్‌. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించిన ఈయన ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజార్టీతో నర్సీపట్నం ప్రజలు గెలిపించారు. ఈ సారి మంత్రివర్గంలో సీనియర్లకు చోటు లేకపోయినా పార్టీకి విధేయత, కష్టకాలంలో అధినేతకు అండగా నిలిచి పనిచేయడంతో అత్యున్నతమైన స్పీకర్‌ స్థానంలో అయ్యన్నను కూర్చోబెట్టి గౌరవించాలని తెదేపా నిర్ణయించింది.


‘సుజల స్రవంతి’కి తొలి ప్రాధాన్యం

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం నియోజకవర్గాన్ని అభివృధ్ధి బాటలో నడిపించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయించడమే తొలి ప్రాధాన్యమని ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు పేర్కొన్నారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వర్షాధారంగానే రైతులు పంటలు పండిస్తున్నారు. సుజల స్రవంతి ఫేజ్‌1, 2 పూర్తయితే నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.


జలాశయాల పూర్తికి కృషి

మాడుగుల మండలంలో ఉరకగెడ్డ, పాలగెడ్డ, గొర్రిగెడ్డ, తారకరామ జలాశయాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ సహకారంతో మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. సాగునీటి కాలువల ఆధునికీకరణ లక్ష్యంగా ముందుకెళ్తానని చెప్పారు.


15 ఏళ్ల తర్వాత శాసనసభకు..

అనకాపల్లి నుంచి ఎన్నికైన కొణతాల రామకృష్ణ 15 ఏళ్ల తర్వాత శాసనసభలో అడుగుపెడుతున్నారు. ఈయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ పనిచేశారు. 2009 ఎన్నికల్లో పోటీచేసి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి తర్వాత నుంచి మొన్నటి వరకు ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈసారి జనసేన నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలిచి సత్తాచాటారు.


పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తా...

రంపచోడవరం, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సమావేశాలకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.  పోలవరం  నేటికి ఈ నిర్వాసితుల సమస్యలతో పాటు మన్యంలో రహదారులు, తాగునీరు, వైద్యంపై ప్రస్తావిస్తానని చెప్పారు.


గిరిజన వాణి వినిపిస్తా

అరకులోయ / పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన వాణిని అసెంబ్లీలో వినిపించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. జీఓ నంబరు 3 సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా ప్రత్యామ్నాయ జీఓ తీసుకురావాలని అసెంబ్లీలో ప్రస్తావిసానన్నారు.

సుందరపు తొలిసారి..

ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందిన ఈయన ఈసారి కూటమి తరఫున బరిలోకి దిగి కన్నబాబురాజుపై 48 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

గిరిజనుల హక్కులపై పోరాటం

పాడేరు, న్యూస్‌టుడే: గిరిజనుల హక్కులు, చట్టాల అమలుకు పోరాటం చేస్తానని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ‘మొదటిసారిగా శాసనసభలో అడుగుపెడుతుండటం ఆనందంగా ఉంది. పాడేరు నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటాను. తక్షణమే జీవో నం 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని ఏజెన్సీలో పటిష్ఠంగా అమలు చేయాలని కోరతాన’ని చెప్పారు.


అయ్యన్న ఎమ్మెల్యేగా పనిచేసిన పదవీ కాలాలు

  •  1983-85
  •  1985-89
  •  1994-96
  •  1999-2004
  •  2004-09
  •  2014-19
  •  2024-
  •  1996-99లో అనకాపల్లి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని