logo

రేషన్‌ సరకుల్లో అక్రమాలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో రేషన్‌ సరకుల తూకాల్లో భారీ తేడాలు బయటపడ్డాయి. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెనాలిలో కొన్ని నిల్వ గోదాములను తనిఖీ చేశారు.

Updated : 21 Jun 2024 03:51 IST

తూకాల్లో భారీగా తేడాలు
25 కేసులు నమోదు

కందిపప్పు ప్యాకెట్ల బరువు తనిఖీ చేస్తున్న అధికారులు

ఈనాడు, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో రేషన్‌ సరకుల తూకాల్లో భారీ తేడాలు బయటపడ్డాయి. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెనాలిలో కొన్ని నిల్వ గోదాములను తనిఖీ చేశారు. పంచదార, కందిపప్పు ప్యాకెట్లలో కేజీకి 50 నుంచి 100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ నిలిపేయాలని ఆదేశించి అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించాలన్నారు. వారం రోజుల్లో తనిఖీ నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం 30 చోట్ల తనిఖీలు నిర్వహిచగా తూకాల్లో తేడాలు బయటపడ్డాయి. దీంతో సరఫరాదారుపై అధికారులు కేసులు నమోదు చేశారు.

  • ఏడుగురు సహాయ కంట్రోలర్‌ (ఏసీ)ల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. పంచదార, కందిపప్పు, పామాయిల్‌ నిల్వలను పరిశీలించాల్సి ఉండగా...కొన్ని చోట్ల మూడు రకాలు లేవు. ఉన్నవాటినే తనిఖీ చేశారు. వేలాదిగా ఉన్న ప్యాకెట్లలో కొన్నింటిని బయటకు తీసి పరిశీలించారు.
  • కందిపప్పు, పంచదార కిలో ప్యాకెట్లను పరిశీలించగా...చాలా ప్యాకెట్లలో 15 గ్రాములు తక్కువ ఉంది. తూనికలు, కొలతల శాఖ నిబంధనలు ప్రకారం 15 గ్రాములు లోపుంటే సరఫరాదారు ఆ తక్కువ కూడా భర్తీ చేసి మళ్లీ పంపాలి. అలా చేయడం లేదు.
  • విశాఖలోని మర్రిపాలెం, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నంలలో పేదలకు పంపిణీ చేసే పంచదార, అంగన్‌వాడీలకు సరఫరా చేసే కందిపప్పు, నూనెల తూకాల్లో తేడాలను గుర్తించారు. కేజీ కందిపప్పు ప్యాకెట్లకు 60 నుంచి 80 గ్రాములు, కేజీ పంచదారకు గరిష్ఠంగా 60  గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
  • ‘మంత్రి ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తనిఖీలు నిర్వహించాం. కందిపప్పు, పంచదార ప్యాకెట్లలో తేడాలను గుర్తించాం. ఈ నేపథ్యంలో 25 కేసులు నమోదు చేసి ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి’ అని తూనికలు, కొలతల శాఖ డీసీ థామస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని