logo

తరతరాలకు స్ఫూర్తి.. రామోజీరావు కీర్తి!!

‘రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించారంటే ఆయన సమగ్ర పరిశీలన, నిరంతర   కృషే కారణం’ అని పలువురు గుర్తు  చేసుకున్నారు.

Updated : 21 Jun 2024 03:52 IST

 నివాళులర్పించిన ‘రామోజీ’ సంస్థల ఉద్యోగులు

ఈనాడు, విశాఖపట్నం: ‘రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించారంటే ఆయన సమగ్ర పరిశీలన, నిరంతర   కృషే కారణం’ అని పలువురు గుర్తు  చేసుకున్నారు. గురువారం విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంలోని ‘ఈనాడు’ కార్యాలయంలో మేనేజర్‌ ఎన్‌. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది, ‘న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్లు’ పాల్గొన్నారు. రామోజీరావుతో ఉన్న   అనుబంధాన్ని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన సాగించిన కృషిని గుర్తు చేసుకున్నారు. అక్షర శక్తిని ‘ఈనాడు’ ద్వారా నిరూపించి ప్రగతి వెలుగులకు దారి చూపారన్నారు. రామోజీరావు వ్యక్తి  కాదు..మహాశక్తని, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఆయన మార్గదర్శనం చేసిన సందర్భాలను   గుర్తు చేసుకున్నారు. విశాఖ నగరంలోని సీతంపేట, ఎంవీపీ కాలనీ, డాబాగార్డెన్స్, ఎన్‌ఏడీ, కూర్మన్నపాలెం, మధురవాడ, గాజువాక, అనకాపల్లి మార్గదర్శి శాఖల్లో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు. నగరంలోని డాల్ఫిన్‌ హోటల్, రామా టాకీస్‌ వద్ద ఉన్న కళాంజలి షోరూంలో ఉద్యోగులు అంజలి ఘటించారు. ‘ప్రియ’ షోరూంలలో రామోజీరావుకు సిబ్బంది ఘన నివాళులర్పించారు.


మహోన్నత వ్యక్తి రామోజీరావు : ఎంపీ భరత్‌

సంతాప సభలో నివాళులు అర్పిస్తున్న ఎంపీ శ్రీభరత్, ‘ఈనాడు’ పూర్వ ఉద్యోగులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే : నిబద్ధతతో నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అని విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. గురువారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్‌ హాల్‌లో రామోజీ గ్రూపు సంస్థల పూర్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీభరత్, వెలగపూడి మాట్లాడుతూ.. రామోజీరావు తెలుగు పత్రికా రంగాన్ని విలువలతో నడిపించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషిచేశారన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే  రామకృష్ణబాబు

అలుపెరుగని పోరాట యోధుడన్నారు. కార్యక్రమంలో ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ‘ఈనాడు’ పూర్వ ఉద్యోగులు సర్వేశ్వరరావు, డి.శివకుమార్‌రెడ్డి, ఎం.కోటి, సుబ్బయ్య, ఆర్‌.శ్రీనివాసరావు, ఏవీ సత్యనారాయణ, పట్టేపు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


తెలుగు భాష పరిరక్షణకు అవిరళ కృషి

విద్యార్థులకు సామగ్రి అందజేసిన ఉపాధ్యాయులు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు భాష పరిరక్షణకు రామోజీరావు ఎంతో కృషి చేశారని మండలంలోని అరట్లకోట పాఠశాల ఉపాధ్యాయులు హరికృష్ణ, విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో ‘ఈనాడు’ అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు నివాళులు అర్పించారు. రామోజీ ఫౌండేషన్‌ రూపొందించిన తెలుగు వెలుగు పుస్తక రచయితలుగా ఉపాధ్యాయులుగా హరికృష్ణ, విజయలక్ష్మి పనిచేశారు. ఈ సందర్భంగా రామోజీరావు అందించిన ప్రశంసాపత్రాలను ఆయన చిత్రపటం వద్ద ఉంచి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు.


క్రమశిక్షణకు మారుపేరు..

 నివాళులర్పిస్తున్న మార్గదర్శి సిబ్బంది

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: క్రమశిక్షణ, అంకితభావం, నీతి, నిజాయతీతో విధులు, వ్యాపారాలు నిర్వహించిన ‘ఈనాడు’ అధినేత రామోజీరావు నేటి తరంతోపాటు, రానున్న తరాలకు ఆదర్శంగా నిలుస్తారని మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనకాపల్లి శాఖ మేనేజర్‌ ఎం.సుధీర్‌ పేర్కొన్నారు. అనకాపల్లిలోని ఆ శాఖ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి మేనేజర్, సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. తెలుగు భాష పరిరక్షణకు అవిరళ కృషి చేశారన్నారు. ఆయన లేనిలోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు. ఆయన సూచించిన బాటలోనే అందరూ నడుద్దామని పిలుపునిచ్చారు. కొండబాబు, రవి, సూరిబాబు, వర్మ, కోటేశ్వరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని