logo

కూటమి సర్కారుపైనే కర్షకుల ఆశలు

వైకాపా సర్కారు కొలువుతీరింది మొదలు అధికార పీఠం దిగిపోయే వరకు ఒక్క రైతుకు కూడా రాయితీపై వ్యక్తిగత వ్యవసాయ పరికరాలను అందించిన పాపాన పోలేదు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొంటూనే అయిదేళ్లు యాంత్రీకరణ పథకంపై కాలయాపన చేస్తూ వచ్చింది.

Updated : 22 Jun 2024 05:20 IST

వైకాపా హయాంలో వ్యక్తిగత వ్యవసాయ పరికరాలకు మంగళం

స్ప్రేయింగ్‌ మిషన్‌తో పిచికారీ చేస్తున్న రైతు

వైకాపా సర్కారు కొలువుతీరింది మొదలు అధికార పీఠం దిగిపోయే వరకు ఒక్క రైతుకు కూడా రాయితీపై వ్యక్తిగత వ్యవసాయ పరికరాలను అందించిన పాపాన పోలేదు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొంటూనే అయిదేళ్లు యాంత్రీకరణ పథకంపై కాలయాపన చేస్తూ వచ్చింది. వ్యక్తిగత పరికరాలకు స్వస్తి పలికి గ్రూపులుగా ఏర్పడిన రైతులకే వ్యవసాయ పరికరాలు ఇచ్చారు. ప్రస్తుతం వైకాపా సర్కారు పడిపోయి కూటమి ప్రభుత్వం కొలువుతీరడంతో రైతుల్లో రాయితీ యంత్రాలపై మరలా ఆశలు రేగుతున్నాయి. గతంలో తెదేపా హయాంలో ఏటా లక్ష్యాలను విధించి రాయితీ పరికరాలు అందించేవారు. ఇప్పుడు కూడా అదే తీరున రైతులకు పరికరాలు అందిస్తారని ఆశగా చూస్తున్నారు.     

ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, అచ్యుతాపురం: ఉమ్మడి జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తుంటారు. దుక్కి దున్నడం నుంచి మార్కెట్‌లో పంట ఉత్పత్తులు అమ్ముకునే వరకు అనేక రకాల యంత్ర పరికరాలు రైతులకు అవసరం. 2019 ముందు ప్రభుత్వాలు చిన్నచిన్న పరికరాలపైనా రాయితీలు ఇచ్చి రైతులు వినియోగించేలా చూసేవారు. వైకాపా ప్రభుత్వం వ్యక్తిగత యూనిట్లకు మంగళం పాడేసింది. అయిదారుగురు రైతుల బృందాన్ని యూనిట్‌గా అద్దె కేంద్రాలు (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌) అమల్లోకి తెచ్చింది. వైకాపా నేతలే తమ అనుచరులు, బినామీలతో బృందాలుగా ఏర్పడి అద్దె కేంద్రాల పేరుతో 40 శాతం రాయితీపై రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు విలువైన యంత్ర పరికరాలను దక్కించుకున్నారు. రైతుల సేవకు కాకుండా నేతల అవసరాలకే వినియోగించుకున్నారు. పరికరాలు బృందాలకు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, అవసరమైన రైతులకు విడివిడిగా ఇవ్వాలని స్థానిక వైకాపా నేతలు సైతం మండల, జడ్పీ సమావేశాల్లో గగ్గోలు పెట్టినా ఒక్క రైతుకు కూడా ఇవ్వకుండానే అధికారం నుంచి దిగిపోయారు. 

గ్రూపులుగా ఏర్పడిన సభ్యులకు మాత్రమే అందించిన యంత్రం (పాత చిత్రం)

ఖరీఫ్‌ ముంగిట ఇవ్వాలని

గతంలో తెదేపా హయాంలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందే మండలాల వారీగా లక్ష్యాలను విధించి పరికరాలను అందుబాటులో ఉంచేవారు. ఎక్కువగా స్ప్రేయర్లు, రోటోవీడర్లు, దుక్కి నాగళ్లు, టార్పాలిన్లు రైతులకు 30 నుంచి 50 శాతం రాయితీపై అందించేవారు. రైతురథం పేరుతో వ్యక్తిగతంగానే రాయితీపై ట్రాక్టర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే తమకు రాయితీ యంత్రాలు, పరికరాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. కూటమి సర్కారు త్వరలోనే విధాన ప్రకటన చేస్తుందని ఆశిస్తున్నారు. 

స్ప్రేయర్లు లేక ఇక్కట్లు..

రైౖతులకు పురుగుమందు పిచికారీ పరికరాలు, దుక్కిసెట్లు, పరదాలు ఎక్కువగా అవసరం అవుతాయి.  వీటిని గత అయిదేళ్లు అందివ్వడం లేదు. గ్రూపులు ఏర్పడి దరఖాస్తు చేసుకుని నేతలు సిఫార్సు చేసిన వారికే ఇచ్చారు. వాటి వల్ల గొడవలు తప్ప ఉపయోగం లేదు. వ్యక్తిగతంగా అందివ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడుతున్నాం. నేను అయిదెకరాల్లో వరి సాగుచేస్తున్నాను. స్ప్రేయర్లు బయట దొరక్క అవస్థలు పడుతున్నా. కొత్త ప్రభుత్వం వ్యక్తిగతంగా పరికరాలు అందిస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది. 

-బుద్ధ రంగారావు, ఆదర్శ రైతు, అందలాపల్లి

అయిదేళ్లలో ఒక్క రైతుకూ ఇవ్వలేదు..

వైకాపా అధికారంలోకి రావడం దిగిపోవడం జరిగిపోయింది. ఈ అయిదేళ్లలో ఒక్క రైతుకు వ్యక్తిగతంగా రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇచ్చింది లేదు. సన్న, చిన్నకారు రైతుల గ్రూపులుగా ఏర్పడే అవకాశం లేదు. సంఘాలుగా దరఖాస్తు చేసుకున్నవారిలో కూడా కొంతమందికే అందాయి. కూటమి ప్రభుత్వమైనా స్పందించి రాయితీపై రైతులకు కావాల్సిన పరికరాలను సరఫరా చేయాలి.

- కర్రి అప్పారావు, రైతుసంఘం నాయకుడు, తిమ్మరాజుపేట

తప్పకుండా ఇస్తారు..

గతంలో తెదేపా ప్రభుత్వంలో ఇచ్చినట్లే ఈసారి రాయితీపై యంత్ర పరికరాలను రైతులందరికీ తప్పకుండా అందిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం కొలువుతీరి కుదురుకునే పనిలో ఉంది. త్వరలోనే యాంత్రీకరణపై ఆలోచన చేస్తారనే నమ్మకం ఉంది. వ్యక్తిగత పరికరాలను అందించడానికే ఎక్కువ అవకాశం ఉంది.

-ఎస్‌బీఎస్‌ నంద్, జిల్లా వ్యవసాయాధికారి, అల్లూరి సీతారామరాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని