logo

ఫ్యాన్‌ సేవలో రెక్కలుముక్కలు.. గత అయిదేళ్లు కొమ్ముకాసిన ఖాకీలెందరో..

గత అయిదేళ్లలో పోలీసులందు ఏపీ పోలీసులు వేరయా అన్నట్లు ఆ శాఖ తీరు ఉంది. డీజీపీ స్థాయి అధికారులే వైకాపాకు ఊడిగం చేస్తే మా స్థాయిలో మేం చేయొద్దా అంటూ స్థానిక పోలీసులు అప్పటి వైకాపా నేతల సేవలో తరించడానికి పోటీపడ్డారు.

Updated : 23 Jun 2024 07:05 IST

స్వామికార్యం.. స్వకార్యాలకే పెద్దపీట

ఈనాడు, అనకాపల్లి, రంపచోడవరం: గత అయిదేళ్లలో పోలీసులందు ఏపీ పోలీసులు వేరయా అన్నట్లు ఆ శాఖ తీరు ఉంది. డీజీపీ స్థాయి అధికారులే వైకాపాకు ఊడిగం చేస్తే మా స్థాయిలో మేం చేయొద్దా అంటూ స్థానిక పోలీసులు అప్పటి వైకాపా నేతల సేవలో తరించడానికి పోటీపడ్డారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కంటే నాటి అధికార పార్టీ నేతల కొమ్ముకాయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ‘వారు చెప్పిన వాళ్లపై కేసులు పెట్టాలి.. వద్దన్నవారిని విడిచిపెట్టేయాలి. నాడు నేతలు చెప్పిందే చట్టం.. అంతా మా ఇష్టం’ అన్నట్లు కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరించారు.

ఓవైపు స్వామి కార్యాలకు సహకారం అందిస్తూనే మరోవైపు స్వకార్యాలను చక్కబెట్టుకుని ఎన్నికల ముందు చల్లగా జారుకున్నారు. ఇప్పుడున్న ఎస్‌ఐ, సీఐలలో చాలా మంది అప్పటి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతోనే పోస్టింగ్‌ల్లో చేరారు. వారంతా ఇప్పుడు కూటమి నేతలను ప్రసన్నం చేసుకుని బదిలీలకు పావులు కదుపుతున్నారు. 

అ‘ధర్మా’నికే  కొమ్ముకాశారు..

  • చోడవరం నియోజకవర్గంలో లక్ష్మణమూర్తి అనే సీఐ కొత్తకోట సర్కిల్‌లో మూడేళ్లకు పైగా పనిచేశారు. ఈయన వైకాపాకు ఏకపక్షంగా పనిచేశారు. రావికమతం మండలం చినపాచిల సర్పంచి రామలక్ష్మి, ఆమె భర్త, ఉప సర్పంచి శంకర్రావుపై వైకాపా వర్గీయులు నాటు తుపాకీతో హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇంటిపైకి వెళ్లి కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే తిరిగి తెదేపా నేతలపైనే కేసులు పెట్టించారు. శంకర్రావును వైకాపాలోకి మారిపోవాలని సీఐ లక్ష్మణమూర్తే ఒత్తిడి తెచ్చారు. పార్టీ మారకపోవడంతో రౌడీషీట్ తెరిచి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

  • లియాస్‌ మహమ్మద్‌’ చోడవరం నియోజకవర్గంలో ఎక్కువ కాలం పోలిసింగ్‌ చేసిన అధికారి ఈయన. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గానూ ఆ నియోజకవర్గంలో పనిచేశారు. గత ప్రభుత్వంలో మూడేళ్లకుపైగా ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఇలాకాలోనే చోడవరం, కొత్తకోట సర్కిల్‌లో సీఐగా పనిచేశారు. ఆ సమయంలో ధర్మశ్రీ చెప్పిందే వేదంగా నడుచుకున్నారనే ఆరోపణలున్నాయి. అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ధర్మశ్రీతో వేదికను పంచుకునేవారని స్థానిక తెదేపా నేతలు చెబుతున్నారు. వైకాపా వాళ్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి వస్తే తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని, నచ్చజెప్పి రాజీచేసి పంపిచేసేవారు. అదే వైకాపా వాళ్లు ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు నమోదుచేయించేవారు. 
  • చినపాచిలలోనే వైకాపాకు చెందిన ఓ యువకుడు 250 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. ఆ కేసులో విప్‌ కరణం ధర్మశ్రీ సూచన మేరకు ప్రధాన నిందితునిగా ఆ యువకున్ని చూపించకుండా బెయిల్‌పై వెంటనే విడులయ్యేలా ఈయనే సహకారం అందించారని స్థానికులు చెబుతున్నారు.
  • ప్రస్తుతం చోడవరం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ పోలీస్‌ అధికారి కూడా ధర్మశ్రీ సిఫార్సు లేఖతోనే ఎన్నికల ముందు సీట్లోకి వచ్చారు. ఈయన కూడా వైకాపాకు తొత్తుగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను పట్టుకుంటే వాటిని ధర్మశ్రీ కొత్తగా నిర్మించే ఇంటి దగ్గర పోయించి స్వామి భక్తిని చాటుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  

తెదేపా వారిపైనే ‘దాడి’..

ఎన్నికలకు ముందు వరకు అనకాపల్లి సీఐగా దాడి మోహనరావు పనిచేశారు. ఈయన మాజీ మంత్రి అమర్‌నాథ్‌ నివాసమున్న మిందిలోనే ఉంటున్నారు. మోహనరావును సీఐగా నియమించక తెదేపా వర్గీయులను గృహనిర్బంధాలు చేయడం, ముందస్తు అరెస్టు చేయడంలో ఎక్కువ ఉత్సాహం చూపారు. క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిలో వైకాపా వాళ్లను తప్పించారనే ఆరోపణలున్నాయి. వైకాపా నేతలు చెప్పడమే ఆలస్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. మార్గదర్శి కేసులో పాటదారునికి స్యూరిటీగా ఉన్న వ్యక్తితో ఇచ్చిన కాదు ఇప్పించిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ లేకుండానే మేనేజర్‌పై కేసు నమోదు చేసేశారు. అలాంటి ఫిర్యాదే విశాఖలోనూ ఒకరు ఇస్తే అందులో విషయం లేదని పోలీసులు కేసు నమోదు చేయకుండా పంపించేశారు.. అనకాపల్లిలో మోహనరావు మాత్రం కేసు పెట్టి అప్పటి అధికార పార్టీ నేతల దగ్గర మెప్పు పొందారు. 

బుచ్చిరాజుకు కన్నబాబు ఆశీస్సులు

ఎలమంచిలిలో అప్పటి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు) సిఫార్సు లేఖ ఇచ్చి మరీ సీఐ బుచ్చిరాజును అచ్యుతాపురంలో నియమించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ముద్రపడిన వారు అచ్యుతాపురం సెజ్‌లో విద్యుత్తు సబ్‌స్టేషన్‌ పనులు చేయనివ్వకుండా ఈ సీఐ అడ్డగించారని ఆరోపణలున్నాయి. పూడిమడక నుంచి ఎటువంటి కేసు వచ్చినా వైకాపా వారితోనే మాట్లాడి మిగిలిన వారిని బయటకు పంపించేవారని మత్స్యకారులు చెబుతున్నారు. వైకాపా నాయకుల సూచన మేరకు అచ్యుతాపురం పరిసరాల్లో ఉన్న స్థిరాస్తి వ్యాపారాల్లో తలదూర్చి తెదేపా నాయకులు, అనుచరులను ఇబ్బందులకు గురిచేసేవారని ఆరోపణలున్నాయి.

బూడి చెబితే ‘ఎస్‌’.. 

అప్పటి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి ఇలాకాలో సీఐగా పనిచేసి పదోన్నతిపై వెళ్లిపోయిన ఎస్‌.తాతారావు పూర్తిగా అధికార పార్టీకి అంటకాగి తిరిగారు. గతంలో దేవరాపల్లి ఎస్‌ఐగా పనిచేసిన రోజుల్లో బూడితో ఉన్న అనుబంధాన్ని వాడుకుని ఆయన సిఫార్సుతో కె.కోటపాడు సర్కిల్‌కి సీఐగా వచ్చారు. అప్పటి నుంచి మంత్రి సేవకే ఆయన పరిమితమయ్యారు. బూడిని ప్రసన్నం చేసుకునేందుకు తెదేపా వాళ్లను కేసులతో వేధించేవారు. అప్పటి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిచిన ఇసుక, గంజాయి మాఫియాలను చూసీ చూడనట్లు వదిలేసేవారు.

  • దేవరాపల్లి ఎస్‌ఐగా పనిచేస్తున్న నాగేంద్రతో పాటు ప్రస్తుత సీఐ సైతం మాజీ మంత్రి చెప్పిందే వేదంలా పనిచేశారు. ఎన్నికల సమయంలో తారువలో జరిగిన ఘటనలో ఎంపీ సీఎం రమేష్‌పై దాడి జరిగినా బూడి వర్గానికి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. 

అనంత బాబు సేవలో తరించారు

రంపచోడవరం నియోజకవర్గంలో పోలీసులు ఎమ్మెల్సీ అనంత బాబు సేవలో తరించడానికి ఒకర్ని మించి మరొకరు పోటీపడ్డారు. సాధారణంగా జైలుకు వెళ్లిన నేతలతో అంటకాగడానికి ఎవరైనా సంకోచిస్తారు. అనంత బాబు విషయంలో మాత్రం పోలీసులు ఎలాంటి సంకోచం లేకుండా ఎన్నికల వరకు ఆయనతో కలిసి మెలిసే తిరిగారు. తన దగ్గర పనిచేసిన దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ జైలుకు వెళ్లారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత ఎన్ని అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయకుండా పోలీసు గ్రౌండ్‌లోనే బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతులిచ్చారు. ఆ సమావేశానికి ఊరేగింపుగా వచ్చిన అనంత బాబుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలపడానికి నియోజకవర్గ పరిధిలోని స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐలు తరలివచ్చి గ్రూప్‌ ఫొటోలు దిగి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. తెదేపా, ఇతర పక్షాల ర్యాలీలు, నిరసనలను ఎక్కడ కనిపించకుండా అణచివేయడంలో అత్యుత్సాహం చూపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని