logo

జలసిరిపై ఆశల చిగురింత

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన పోలవరం కాలువ పనులకు కదలిక వస్తోంది.

Updated : 25 Jun 2024 03:32 IST

పోలవరం కాలువ పనుల్లో కదలిక
ఎలమంచిలి, న్యూస్‌టుడే

ఏటికొప్పాక సమీపంలో పూర్తయిన కాలువ తవ్వకం

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన పోలవరం కాలువ పనులకు కదలిక వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమలతో పాటు రైతులకు సాగునీరు అందించడానికి రూ. 677 కోట్ల అంచనా వ్యయంతో 84 కిలోమీటర్ల పొడవున పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వుతున్నారు. అందులో సిమెంట్‌ పనులకు 2005లో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. భూసేకరణ పూర్తి చేసి ప్రధాన కాలువను 6, 7, 8 మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు.

  •  తాళ్లపాలెం నుంచి కణితి రిజర్వాయర్‌ వరకూ 8వ ప్యాకేజీ కింద రూ. 171 కోట్ల వ్యయంతో 33 కిలోమీటర్ల పొడవున ప్రస్తుతం ఉన్న ఏలూరు కాలువను వెడల్పు చేసి పోలవరం కాలువకు అనుసంధానం చేశారు. ఏలేరు కాలువకు రెండువైపులా భారీ యంత్రాల సాయంతో మట్టి తొలగించి కాలువను వెడల్పు చేశారు. తవ్విన మట్టి పక్కనే గుట్టలుగా పోయడం చాలా సంవత్సరాలు పనులు నిలిచిపోవడం వల్ల వర్షాలకు ఈ మట్టి తిరిగి కాలువలోకి కొట్టుకు వచ్చింది. వెడల్పు చేసిన కాలువ ప్రాంతంలో తుమ్మకంచె మొక్కలు దట్టంగా మొలిచాయి. దాదాపు కాలువ పనులన్నీ గడిచిన నాలుగేళ్లలో దెబ్బతిన్నాయి.

ఎలమంచిలి కేంద్రంగా పోలవరం ప్రాజెక్ట్‌ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు పోలవరం ప్రాజెక్ట్‌ చూడటానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులను సైతం ఏర్పాటు చేశారు. జగన్‌ అధికారంలోకి రాకముందు వరకూ పనులు చకచకా జరిగాయి. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్ట్‌తోపాటు కాలువ పనులను సైతం పక్కన పెట్టారు. దీంతో గతంలో నిర్మించిన కాలువలో తుప్పలు పెరిగి అధ్వానంగా మారింది. ఒకానొక దశలో తవ్విన కాలువ రూపు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో మళ్లీ చంద్రబాబు గద్దెనెక్కడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.

ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా పనులు చేయాల్సిన ప్రాంతం

  • పాయకరావుపేట నుంచి దార్లపూడి వరకూ ఆరో ప్యాకేజీ కింద రూ. 196 కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల పొడవున ఎడమ ప్రధాన కాలువను తవ్వారు. మట్టి పనులు పూర్తయ్యాయి. మధ్యలో వంతెనలు, కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చాలాచోట్ల నిలిచిపోయాయి. తాండవ నదిపై నిర్మిస్తున్న కాలువ పనులు పూర్తికాలేదు. కొన్నిచోట్ల కాలువ ఎగువ గ్రామాలకు వెళ్లడానికి వంతెనలు నిర్మించినా అప్రోచ్‌ రోడ్లు నిర్మించలేదు. దీంతో ఈ ప్యాకేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి. కొండలపై నుంచి కొట్టుకొచ్చిన మట్టి కాలువలో మేటలు వేసింది.
  •  దార్లపూడి నుంచి తాళ్లపాలెం వరకూ 7వ ప్యాకేజీ కింద రూ. 330 కోట్లతో 26 కిలోమీటర్ల పొడవునా కాలువ పనులు ప్రారంభించారు. కాలువ తవ్వకం పనులు తెదేపా పాలనలోనే పూర్తయ్యాయి. వరాహ నదిపై నిర్మిస్తున్న సిమెంట్‌ కాలువ పనులు పూర్తి కాలేదు. కొండగెడ్డల నీరు నేరుగా కిందకి పోవడానికి నిర్మించిన కాలువల పనులు నిలిచిపోయాయి. వంతెనల నిర్మాణం పూర్తి కాలేదు. కాలువు చుట్టూ వేసిన కాంక్రీట్‌ లైనింగ్‌ దెబ్బతింది. ఈ పగుళ్లలో నుంచి తుప్పలు మొలిచాయి. కాలువలో బయట నుంచి కొట్టుకువచ్చిన ఒండ్రు రెండడుగుల ఎత్తులో పేరుకుపోయింది. దీనిపై దట్టంగా గడ్డి మొక్కలు మొలిచాయి.

పనులు జరగక కాలువలో పెరిగిన తుప్పలు

జగన్‌ ప్రభుత్వం వచ్చాక పోలవరం కాలువ పనులు చేపట్టిన మూడు ప్యాకేజీల గుత్తేదార్లకు బిల్లులు చెల్లించడం మానేశారు. కాళ్లు అరిగేలా కార్యాలయాలకు తిరిగినా చేసిన పనులు బిల్లులు రాకపోవడంతో గుత్తేదార్లు అంతా పనులు నిలిపివేసి యంత్రాలన్నీ వారి కార్యాలయాలకు చేర్చారు. అద్దెలకు తీసుకున్నవి తిరిగి పంపించేశారు. ఇందులో పనిచేసే వేలాది మంది కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేశాక ముందుగా పోలవరం ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించడంతో నూతనోత్సాహం వచ్చింది. మిగులు పనులు ప్రారంభించడానికి తిరిగి యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్లిపోయిన కార్మికులను రప్పించే ప్రయత్నాలు ఆరంభించారు.

ఏడాదిలో పూర్తి చేస్తాం

పోలవరం కాలువ పనులు వేగవంతం చేస్తాం. ఏడాదిలోగా మిగులు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. ప్రధాన కాలువ పూర్తయితే రైతుల పొలాలకు నీరందించే బ్రాంచి కాలువల పనులు ప్రారంభిస్తాం. తాండవ, వరాహ నదులపై నిర్మిస్తున్న కట్టడాలు చేయిస్తాం. పనులు పూర్తయితే రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.

 క్రిస్టఫర్, ఈఈ, పోలవరం ప్రాజెక్ట్, ఎలమంచిలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని