logo

గిరిజన యువత ఉన్నతికి తోడ్పాటు అందిస్తా

గిరిజన యువత ఉన్నత విద్యాభ్యాసం చేయడంతోపాటు, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన తోడ్పాటును అందిస్తానని శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ కదల మాధురి వెల్లడించారు.

Published : 25 Jun 2024 03:19 IST

 మాధురిని సన్మానిస్తున్న సర్పంచి మల్లీశ్వరి, వెంకటలక్ష్మి

వేటుకూరు (మారేడుమిల్లి), న్యూస్‌టుడే: గిరిజన యువత ఉన్నత విద్యాభ్యాసం చేయడంతోపాటు, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన తోడ్పాటును అందిస్తానని శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ కదల మాధురి వెల్లడించారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామానికి చెందిన మాధురి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం స్వగ్రామానికి వచ్చిన ఆమెకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాధురిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను ప్రశంసించారు. అనంతరం మాధురి మాట్లాడుతూ గతంలో ఇక్కడి యువత చదువుకోవాలంటే సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. కృషి, పట్టుదల, కఠోరశ్రమ ఉంటే ఎటువంటి ఆశయాలను అయినా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈమె కదల ఆదిరెడ్డి, ఉమామహేశ్వరి దంపతుల తృతీయ కుమార్తె. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ అనారోగ్యంతో చిన్నతనంలోనే మృతి చెందారు. తల్లి ఉమామహేశ్వరి ప్రస్తుతం విద్యాశాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పిల్లలను చదివించారు. వేటుకూరు సర్పంచి ఈతపల్లి మల్లీశ్వరి, మాజీ సర్పంచులు గొర్లె మురళీకృష్ణ, కదల వెంకటలక్ష్మి, గిరిజన నాయకులు గొర్లె చిననారాయణరావు, మాణిక్యాలరావు, ఆర్‌ఐ ఏసుబాబు, వీఆర్వో గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని