logo

మూడింతల మెగా ఆనందం!

డీఎస్సీలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 1134 పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Published : 26 Jun 2024 01:33 IST

నిరుద్యోగ యువతకు కానుకగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ
ఉమ్మడి జిల్లాలో 1134 పోస్టులు
వైకాపా ప్రకటించిన దగా డీఎస్సీకి మూడురెట్లు అదనం

 

నిరుద్యోగ యువత కలలను కూటమి సర్కారు నిజం చేయబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు సిద్ధమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజునే మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం పెట్టారు. తొలి క్యాబినెట్‌లోనే ఆ దస్త్రానికి ఆమోదముద్ర వేశారు. 

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం : డీఎస్సీలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 1134 పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ముందు వైకాపా సర్కారు ప్రకటించి పరీక్ష నిర్వహించకుండా వదిలేసిన దగా డీఎస్సీ కంటే మూడురెట్లు ఎక్కువ ఖాళీలు భర్తీ చేయనుండటంతో నిరుద్యోగ యువతలో మూడింతల ఆనందం కనిపిస్తోంది.

వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టూ భర్తీ చేయలేదు. పాఠశాలలను విలీనం చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకే పని లేదన్నట్లు ప్రచారం చేసింది. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉన్నా సర్దుబాటుతోనే అయిదేళ్లు కాలయాపన చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి కోసం ఆఖరిలో 6,100 పోస్టులు భర్తీచేస్తామని దగా డీఎస్సీ ప్రకటించింది. అందులో ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం 334 పోస్టులే ఖాళీలు చూపించింది. అందులో కేవలం 89 మాత్రం ఎస్‌జీటీ పోస్టులు చూపించారు. మిగతావి గిరిజన సంక్షేమశాఖ, మోడల్‌ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలనే ప్రదర్శించారు. ఎన్నికల వేళ హడావుడి ప్రకటన తప్ప పరీక్ష నిర్వహించే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ చెందారు. కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే మెగా డీఎస్సీకిసన్నాహాలు చేయడం... గతం కంటే ఎక్కువ ఖాళీలు భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. టెట్‌తోపాటు డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించడంతో ఆ దిశగా సాధన చేయడానికి సిద్ధమవుతున్నారు.

పోటీ ఎక్కువే..

అర్ధ దశాబ్దం తర్వాత డీఎస్సీ ప్రకటిస్తుండడంతో ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ రాసినవారే 25   వేల మంది ఉన్నారు. అంతకంటే టెట్‌ రాసి అర్హత సాధించిన వారు డీఎస్సీ ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది బీఎడ్, డీఎడ్‌ పూర్తిచేసిన వారు కూడా టెట్‌ రాసి డీఎస్సీ రాసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో అభ్యర్థుల సంఖ్య భారీగా పెరగనుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి 50 వేల నుంచి 60 వేల మంది డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. 

నాడు-నేడు.. బాబు వచ్చాకే జాబు

నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు 2014లో డీఎస్సీ ద్వారా 9,061 పోస్టులు భర్తీచేశారు. మరో నాలుగేళ్ల తర్వాత ఆయనే 2018 డీఎస్సీ ద్వారా 7,254 పోస్టులు తీశారు. అప్పుడు ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల్లో కలిపి 765 ఖాళీలను భర్తీచేశారు. 2019లో ప్రభుత్వం మారి వైకాపా వచ్చిన తర్వాత ఈ అయిదేళ్లు డీఎస్సీ అనే మాటే వినిపించలేదు. తాజాగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతే మరలా డీఎస్సీ ప్రకటన వెలువడబోతోంది. ఈసారి ఉమ్మడి జిల్లాలో 1,134 పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులే 551 వరకు ఉన్నాయి. మిగతా వాటిలో పాఠశాల సహాయకులు, పీఈటీ, పీడీ, భాషా పండితులు, గిరిజన సంక్షేమం, ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, పురపాలక పోస్టులు ఉన్నాయి. జూలై 1న నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఖాళీల సంఖ్యలో కొద్దిగా అటూ, ఇటూ మార్పులున్నా గతం కంటే ఈ సారి ఎక్కువ పోస్టులు భర్తీ చేయనుండడం యువతకు ఉత్సాహాన్నిస్తోంది.

 హామీ నిలబెట్టుకుంటున్నారు..: బీఈడీ పూర్తిచేసి ఏళ్లు గడుస్తున్నా డీఎస్సీ ప్రకటన లేకపోవడంతో ఉద్యోగం పొందలేకపోయాను. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబునాయుడు తొలిసంతకం చేయడం నిరుద్యోగులకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను.
 - ధర్మిరెడ్డి సరోజని, బీఈడీ, రామన్నపాలెం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు