logo

పీవీటీజీ గ్రామాలను అభివృద్ధి చేస్తాం

పీవీటీజీ గ్రామాలను ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అభిషేక్‌ తెలిపారు.

Published : 26 Jun 2024 01:36 IST

గోస్తనిపై పడవలో ప్రయాణిస్తున్న ఐటీడీఏ పీఓ అభిషేక్‌ తదితరులు 

అనంతగిరి, న్యూస్‌టుడే: పీవీటీజీ గ్రామాలను ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అభిషేక్‌ తెలిపారు. చిలకలగెడ్డ పంచాయతీ పరిధిలోని మెట్టపాలెం గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ గ్రామాన్ని ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద ఎంపిక చేశారు. దీంతో ఈ గ్రామంలో ఏ పనులు చేపట్టాలి, ఏఏ వసతులు కల్పించాలని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు ఖాతాల మంజూరు, అంతర్గత రహదారులతోపాటు మురుగు కాలువలు, గోస్తని నది సమీపం నుంచి గ్రామం వరకు తారురోడ్డు నిర్మించాలని స్థానికులు పీఓ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్థులు చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవలను పరిశీలించి దానిపై కొంత దూరం గోస్తనిలో ప్రయాణించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: గిరిజనులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీఓ అభిషేక్‌ పేర్కొన్నారు. అరకులోయ ఉప తపాలా కేంద్రం పరిధిలో సబ్‌ డివిజనల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు, ప్రమాద బీమా పరిహారం పంపిణీ కార్యక్రమం మంగళవారం అరకు తపాలా ఇన్‌స్పెక్టర్‌ ఉపేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పీఓ హాజరై మాట్లాడారు. గత ఆర్థిక ఏడాది ప్రతిభ చూపిన 20 మంది సిబ్బందికి సబ్‌ డివిజన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను పీఓ చేతులమీదుగా అందజేశారు. పెదబయలు మండలం బుంగాపుట్టు గ్రామానికి చెందిన కుర్తాడ శ్రీనివాసరావు ప్రమాద బీమా తీసుకున్న ఐదు రోజుల్లో మృతిచెందగా.. కుటుంబానికి రూ. 10 లక్షల బీమా పరిహారం చెక్కును అందజేశారు. పెదలబుడు, బొండాం సర్పంచులు దాసుబాబు, భాస్కర్, ఎంపీడీఓ వెంకటేష్, ఐసీడీఎస్‌ పీఓ శారద, తపాలా అనకాపల్లి డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరెడ్డి,   ఐపీపీబీ సీనియర్‌ మేనేజరు శ్రీదేవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని