logo

మత్తు ముంచేస్తుంది.. మానేందుకు మార్గముంది!

ఎలమంచిలికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి స్నేహితులతో కలసి ఒక పార్టీలో బీరు తాగడం అలవాటు చేసుకున్నాడు. అలా చెడుస్నేహాలు చేస్తూ కళాశాలకు వెళ్లడం మానేసి మద్యం తాగడం మొదలుపెట్టారు.

Updated : 26 Jun 2024 04:07 IST

వ్యసనాల బారినపడిన వారికి ప్రత్యేక చికిత్స 
మాదకద్రవ్య వ్యతిరేక దినం నేడు

  • ఎలమంచిలికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి స్నేహితులతో కలసి ఒక పార్టీలో బీరు తాగడం అలవాటు చేసుకున్నాడు. అలా చెడుస్నేహాలు చేస్తూ కళాశాలకు వెళ్లడం మానేసి మద్యం తాగడం మొదలుపెట్టారు. దీనికి బానిసవడంతో చదువు పూర్తిగా పాడయింది.  
  • పాడేరులోని ఓ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులు సిగరెట్లు, మత్తు పదార్థాలతో ఉపాధ్యాయులకు దొరికారు. ఐదుగురికి పాఠశాల నుంచి టీసీలు ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 
  • మన్యంలో గంజాయి తాగుతున్న వారిలో ఎక్కువశాతం  ఆశ్రమ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులున్నట్లు వైద్యులు గుర్తించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించాల్సి వస్తోంది. 
  • కొత్తపాడేరు గ్రామానికి చెందిన కురుసా ఆనంద్‌ మూడేళ్లగా మద్యపానానికి బానిసయ్యాడు. ఇతడి కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రాన్ని ఆశ్రయించారు. వైద్యులు ఇచ్చిన చికిత్సతో ఇతడి పరిస్థితి మెరుగుపడింది.

అనకాపల్లిలోని పరివర్తన కేంద్రం 

అనకాపల్లి పట్టణం, పాడేరు, న్యూస్‌టుడే : ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ పాకింది. మత్తు పదార్ధాలు రకరాల రూపంలో కళాశాలలు, పాఠశాలలకు చేరుతున్నాయి. ధూమపానం, మద్యపానంతో సరదగా మొదలయ్యే దురలవాటు క్రమంగా మాదకద్రవ్యాల దాకా విస్తరిస్తోంది. ధూమపానం, మద్యపానంతోపాటు గంజాయి తాగుతూ చిక్కిన టీనేజర్ల సంఖ్య గత మూడేళ్లలో 2,265 మందికిపైనే ఉండటం కలవరం కలిగించే అంశం. వీరికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్తుండటంతో పిల్లలపై పర్యవేక్షణ లోపిస్తోంది. సినిమాలు, ప్రభావం, అతిగా సెల్‌ఫోన్‌ వాడకం, స్నేహితుల ప్రభావం, పట్టణీకరణ వంటివి యువతను పెడదారిలోకి నెడుతున్నాయి. 

మద్యం.. మాదకద్రవ్యాలు ఒకసారి అలవాటు చేసుకుంటే వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో (వ్యసన విముక్తి కేంద్రాలను) ఏర్పాటు చేసింది. అనకాపల్లి జిల్లాలో సీడ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో పిసినికాడ వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాకు సంబంధించి పాడేరు జిల్లా ఆసుపత్రిలో ఈ కేంద్రం ఉంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులు సైతం సిగరెట్లు తాగటం, పొగాకు, మత్తుపదార్థాలు తీసుకోవడం వైద్యులను సైతం కలవరపరుస్తోంది.  

  • పాడేరు వ్యసన విముక్తి కేంద్రానికి గత ఐదేళ్ల కాలంలో వచ్చినవారిలో మద్యపానానికి బానిసైన వారు అత్యధికంగా 4558 మంది ఉన్నారు. పొగాకు, ధూమపానం దురలవాటు ఉన్న 1,201 మందికి చికిత్స అందించారు. 
  • గంజాయి మత్తుకు అలవాటు పడినవారు 239 మంది, ఖైనీ, బాధితులు 254 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1088 మంది వ్యసన బాధితులకు సేవలందించారు. 
  • మద్యం, మాదక ద్రవ్యాలు, సిగరెట్‌ అలవాటు చేసుకుంటే జీవితాలు ఎలా నాశనం అవుతాయో కౌన్సిలింగ్‌ కేంద్రంలో రోజూ ఉదయం వివరిస్తారు. మధ్యాహ్నం వారి అనుభవాలను అడిగి తెలుసుకుంటారు. 
  • అనకాపల్లిలోని పరివర్తన కేంద్రంలో ప్రస్తుతం తొమ్మిది మంది మద్యం తాగే అలవాటు ఉన్నవారిని వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
  • చికిత్స పూర్తయి ఇళ్లకు తిరిగెళ్లి వారిని మూడేేళ్లపాటు ఏం చేస్తున్నారో నిశితంగా గమనిస్తారు. దీనివల్ల వారు మళ్లీ వ్యసనానికి లొంగిపోకుండా నివారించే ఆస్కారం ఉంటుంది.

జీవన నైపుణ్యాలపై శిక్షణ

వ్యసనాల నుంచి విముక్తి కల్పించడంతోపాటు తిరిగి దీని బారినపడకుండా చూడడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బాలలు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా వారిలోని జీవన నైపుణ్యాలను పెంచేందుకు అనకాపల్లి సీడ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. 
గ్రామాల్లో బాలలు, కౌమార దశలో ఉన్న వారిని గుర్తించి వారికి జీవన నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. 

గుట్టుగా మద్యం తాగే ప్రాంతాలను గుర్తిస్తున్న సీడ్‌ సభ్యులు 

యువతపై తీవ్ర ప్రభావాలు 

యుక్త వయసు పిల్లల్లో  విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలురకాల సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంది. ఆది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట స్నేహితులతో సరదాగా ప్రారంభమై, తరవాత వ్యసనంలా మారుతుంది. చివకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు పదార్థాలు తీసుకున్నాక మెదడులో డోపమైన్, సెరటోనిన్‌ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. వాటివల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. వారు చెడుదారుల్లోకి వెళ్లకుండా వారే తగిన జాగ్రత్త వహించాలి.

 - డాక్టర్‌ అబ్దుల్‌ బషీర్, మత్తు-వ్యసన విముక్తి కేంద్రం, పాడేరు జిల్లా ఆసుపత్రి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని