logo

ఇగ్నోలో కొత్తగా ఎంబీఏ కోర్సులు ప్రారంభం

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) జులై 2024 విద్యా సంవత్సరానికిగాను దూరవిద్యా కోర్సులతో పాటు కొత్తగా నాలుగు ఎంబీఏ కోర్సులను ప్రారంభించినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు తెలిపారు.

Updated : 26 Jun 2024 04:33 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) జులై 2024 విద్యా సంవత్సరానికిగాను దూరవిద్యా కోర్సులతో పాటు కొత్తగా నాలుగు ఎంబీఏ కోర్సులను ప్రారంభించినట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు తెలిపారు. ఎంబీఏలో హెల్త్‌ కేర్‌ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులను కొత్తగా ప్రారంభించటం జరుగుతుందన్నారు.

  • వైద్య ఆరోగ్య రంగాలతో పాటు నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఎంబీఏ-హెల్త్‌కేర్, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆరోగ్యరంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య నిర్వహణ సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచటానికి, రోగులకు సహాయ సహకారాలు అందించటానికి అవసరమైన మానవవనరుల్ని తయారు చేసుకోవటానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు. రెండేళ్లు కాలవ్యవధికి ఈ కోర్సు ఫీజు రూ.68వేలుగా నిర్ణయించామన్నారు.
  • ఎంబీఏ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్ కోర్సును దూర విద్యావిధానంలో అందిస్తుందని, వ్యవసాయాధారిత పరిశ్రమల్ని లాభసాటిగా ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిర్వహించటానికి కావల్సిన నైపుణ్యాల్ని ఈ కోర్సు అందిస్తుందన్నారు. ప్రభుత్వరంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలున్నాయన్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులన్నారు. రెండేళ్ల కాలవ్యవధికి రూ.64వేలు ఫీజుగా నిర్ణయించారన్నారు.
  • ఇంజినీరింగ్‌ రంగాల్లో ఉపాధి కోరుకునే వారికి, ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో, సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉపయోగకరంగా ఉండేలా కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నామన్నారు.  బీఎస్సీ, బీఈ, బీటెక్‌ పట్టభద్రులు చేరగలిగే ఈ కోర్సు రెండేళ్ల కాలవ్యవధి కలిగి ఉంటుందని, ఫీజు రూ.62వేలుగా నిర్ణయించటం జరిగిందన్నారు.
  • ఈ కోర్సులు జులై 2024 ప్రవేశాల్లో అందుబాటులో ఉన్నాయని, విశాఖలోనూ అందుబాటులో ఉందన్నారు. ఇగ్నో వెబ్‌సైట్లోని లింక్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చన్నారు. వివరాలకు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం నంబరు 0891-2511200లో సంప్రదించవచ్చన్నారు.

బీపీఓ పోస్టుల భర్తీకి 28, 29 తేదీల్లో జాబ్‌మేళా

రేసపువాని పాలెంలోని టెక్‌ మహీంద్ర సంస్థలో బీపీఓ ఉద్యోగాల కోసం ఈనెల 28, 29 తేదీల్లో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి వీఎస్‌ కృష్ణా కళాశాల ఆవరణలో జాబ్‌మేళా జరుగుతుందన్నారు. 328 పోస్టులను భర్తీ చేస్తారన్నారు. ఏదైనా డిగ్రీ పాస్‌/ఫెయిల్‌ అయిన వారు అర్హులన్నారు. ఆంగ్లభాషపై పట్టు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రాథమిక పరీక్ష, టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్ల ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగా వార్షిక వేతనం రూ.1.67 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇస్తారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టెక్‌ మహీంద్ర సంస్థ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని