logo

రుణం కావాలంటే.. సరకులు కొనాలా?

ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణం అందజేస్తుందని.. ఆపై వడ్డీ రాయితీ అందుతుందన్న ఆశతో డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాల కోసం వెలుగు సిబ్బంది చుట్టూ తిరుగుతుంటారు.

Updated : 26 Jun 2024 06:41 IST

వెలుగు సిబ్బందిని నిలదీసిన పొదుపు మహిళలు

చోడవరంలో మహిళా మార్ట్‌

చోడవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణం అందజేస్తుందని.. ఆపై వడ్డీ రాయితీ అందుతుందన్న ఆశతో డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాల కోసం వెలుగు సిబ్బంది చుట్టూ తిరుగుతుంటారు. మీకు రుణం కావాలంటే మా వద్ద రూ.2 వేలకుపైగా నిత్యావసర సరకులు కొనుగోలు చేయాలి. లేకుంటే రుణం ఇవ్వలేమంటూ వెలుగు సిబ్బంది తెగేసి చెబుతుండటంతో సభ్యత్వం ఉన్న మహిళలు తెల్లముఖం వేస్తున్నారు. రుణాలు పొందేందుకు ఈ బలవంతపు కొనుగోలు ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ గ్రామానికి చెందిన ఐదారు గ్రూపుల ప్రతినిధులు, తెదేపా నాయకులు మంగళవారం వెలుగు కార్యాలయానికి వచ్చి సిబ్బందిని ఈ విషయమై నిలదీశారు. సిబ్బంది ఇచ్చిన సమాధానంతో శాంతించిన మహిళలు రుణాలకు దరఖాస్తు చేశారు. 

  • చోడవరం వెలుగు కార్యాలయం పరిధిలో పట్టణంలోని బీఎన్‌ రహదారిలో ఉన్న దుకాణ సముదాయంలో తొమ్మిది నెలల కిందట మహిళా మార్ట్‌ ఏర్పాటైంది. డ్వాక్రా మహిళల నిర్వహణలో నాణ్యమైన సరకులు సరసమైన ధరలకు అంటూ నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్నారు. ముందుగా గ్రూపు సభ్యులైన మహిళలతో మార్ట్‌లో సరకులు కొనుగోలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రుణం కోసం దరఖాస్తు చేసే ప్రతి గ్రూపు సభ్యులు విధిగా సరకులు కొనుగోలు చేయాలంటూ వెలుగు సీసీలు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
  • వైకాపా ప్రభుత్వ హయాంలో మహిళలు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెదేపా అధికారంలోకి రావడంతో మహిళల్లో చైతన్యం వచ్చింది. రుణం కోసం వెళ్తే సరకులు కొనుగోలు చేయాలని చెబితే గట్టిగా నిలదీస్తున్నారు. గాంధీ గ్రామానికి చెందిన గాంధీ ఆదర్శ, సోలాపురమ్మ, గౌరీ సేవా సంఘం, గాంధీ స్వయం సేవా సంఘాల ప్రతినిధులు వెలుగు సీసీని నిలదీశారు. వీరికి మాజీ సర్పంచి దాడి కనక శ్రీను, తెదేపా గ్రామ అధ్యక్షుడు దాడి నాగఅప్పారావు మద్దతుగా నిలిచారు. సరకులు కొనుగోలు చేయాలన్న నిబంధన సరికాదని సిబ్బంది హెచ్చరించారు. 
  • ఈ విషయమై వెలుగు ఏపీఎం కనకరాజును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. సరకుల కొనుగోలు విషయంలో గ్రూపు సభ్యులపై ఎలాంటి ఒత్తిళ్లు చేయడం లేదన్నారు. ఇదే విషయాన్ని గాంధీ గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు చెప్పామన్నారు. మహిళలే ఏర్పాటు చేసుకున్న మార్ట్‌ కావడంతో వాళ్లే మార్ట్‌ వ్యాపారాభివృద్ధికి చొరవ చూపాలే తప్ప.. అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని