logo

నైరుతి విస్తరించినా.. తగ్గని ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా వాతావరణం చల్లబడలేదు.

Published : 26 Jun 2024 02:03 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా వాతావరణం చల్లబడలేదు. పలు జిల్లాల్లో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా జంగమేశ్వరపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదైంది. బాపట్ల, కావలి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటాయి. మరోవైపు రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కానీ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో భారీ వర్షాల గురించి ప్రస్తావించలేదు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, కర్నూలు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని