logo

వేర్వేరు చోట్ల గంజాయితో ఏడుగురి అరెస్ట్టు

అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మంగళవారం వేర్వేరు చోట్ల గంజాయితో ఏడుగురు పట్టుబడ్డారు.

Updated : 26 Jun 2024 04:34 IST

నిందితులతో అనంతగిరి ఎస్సై, సిబ్బంది  

రోలుగుంట, గొలుగొండ, న్యూస్‌టుడే: అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మంగళవారం వేర్వేరు చోట్ల గంజాయితో ఏడుగురు పట్టుబడ్డారు. రోలుగుంట ఎం.కె.పట్నం శివారు పెదపేట సమీపంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 78 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తకోట సీఐ అప్పలనాయుడు, రోలుగుంట ఎస్సై సురేష్‌ పేర్కొన్నారు. ఎం.కె.పట్నంకు చెందిన శరమండ ఈశ్వరరావు, బి.బి.పట్నంకు చెందిన మోయ్యా జ్యోతిబాబు బైక్‌పై గంజాయి రవాణాకు సన్నద్ధమవుతుండగా పట్టుకున్నామన్నారు. బైక్‌పైతోపాటు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసినట్లు చెప్పారు.  గొలుగొండ మండలం సీతకండి కూడలిలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు గంజాయితో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. నిందితులు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మామిడి మణికంఠ, దాసరి వినియకుమార్‌గా గుర్తించినట్లు ఎస్సై కృష్ణారావు చెప్పారు. వారి నుంచి నాలుగు కేజీల గంజాయి, రెండు మొబైల్‌ ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను కోర్టుకు హాజరుపరిచి రిమాండుకు తరలించారు.
అనంతగిరి గ్రామీణం: డముకు వ్యూపాయింట్‌ వద్ద సోమవారం సాయంత్రం వాహన తనిఖీలు చేపడుతుండగా గంజాయితో ముగ్గురు యువకులు పట్టుబడ్డారని అనంతగిరి ఎస్సై కరక రాము మంగళవారం తెలిపారు. విశాఖపట్నంకు చెందిన చింతపల్లి అప్పలరాజు, గుంట భరత్, డుంబ్రిగుడ మండలం అడ్రగుడ గ్రామానికి చెందిన కిల్లో రాజు స్కూటీపై 2 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. వారిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. 
గంజాయి సాగు, రవాణా నేరం
జి.మాడుగుల: చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఐ రమేష్‌ పేర్కొన్నారు. పాలమామిడి గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని సీఐ దృష్టికి గ్రామస్థులు తీసుకొచ్చారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి సాగు, రవాణా, సారా నేరమని పేర్కొన్నారు. ఐదేళ్లు నిండిన పిల్లలను బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యతోనే జీవితాలు మారుతాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని