logo

నిధులివ్వక నిలిచిన నిర్మాణాలు

2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటుతో అంతకుముందు ఉన్న తెదేపా ప్రభుత్వంలో మంజూరై నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయి

Published : 26 Jun 2024 02:13 IST

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు 

ఆర్డీఓ కార్యాలయ భవనం నిర్మాణం ఇలా..

చింతూరు, న్యూస్‌టుడే: 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటుతో అంతకుముందు ఉన్న తెదేపా ప్రభుత్వంలో మంజూరై నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన తరవాత ఏర్పడిన విలీన మండలాలపై తెదేపా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని డివిజనల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు పక్కా భవనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం రావడంతో ఈ మండలాల్లో అభివృద్ధి అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎటపాకలో రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, చింతూరు కేంద్రంగా ఐటీడీఏను ఏర్పాటు చేసి ఈ నాలుగు మండలాల సమస్యల పరిష్కారానికి అన్ని కార్యాలయాలను అప్పటి తెదేపా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి పక్కా భవనాలను మంజూరు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఎటపాకలోని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని చింతూరు కేంద్రంగా మార్పుచేశారు. వీటిలో ప్రధానంగా ఆర్డీఓ కార్యాలయం, డిగ్రీ కళాశాల, తహసీల్దార్‌ కార్యాలయాలకు భవనాలను మంజూరు చేయడంతోపాటు నిధులూ మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు సకాలంలో బిల్లు మంజూరు చేయకపోవడంతో ఆ నిర్మాణాలు నిలిచిపోయాయి.

డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తలపెట్టిన వ్యవసాయ గోదాము ఇలా.. 

బిల్లులు చెల్లించక..

పరిపాలనా సౌలభ్యం కోసం ఎటపాక నుంచి చింతూరు కేంద్రానికి ఆర్డీఓ కార్యాలయాన్ని తరలించిన తరువాత 2018లో అప్పటి ప్రభుత్వం రూ. 2.25 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులు వేగంగా జరుగుతుండగా వైకాపా ప్రభుత్వం దాదాపుగా పూర్తయిన నిర్మాణానికి 2022లో కేవలం రూ. 84.3 లక్షలు బిల్లులే చెల్లించడంతో గుత్తేదారు మధ్యలోనే పనులు నిలిపివేశారు.

తహసీల్దార్‌ కార్యాలయమూ అంతే...

చింతూరు తహసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థలోకి చేరుకోవడంతో కొత్త భవనం నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 లక్షలు మంజూరు చేసింది. అయితే వైకాపా అధికారంలో వచ్చాక ఇది పునాదులకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్‌ కార్యాలయ భవనం వర్షం వస్తే మడుగులా మారిపోతోంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 
బీ దీనిపై చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య మాట్లాడుతూ.. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని, భవిష్యత్తులో వీటిని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

డిగ్రీ కళాశాలకు అదే దుస్థితి..

విలీన మండలాలకు ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనే నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కళాశాల నిర్మాణం కోసం తెదేపా ప్రభుత్వం 2018లో రూ. కోటి నిధులు మంజూరు చేసింది. టెంటర్ల ద్వారా గుత్తేదారులకు పనులు అప్పగించింది. ఈ భవన నిర్మాణం దాదాపుగా పూర్తి అయినా వైకాపా ప్రభుత్వం రూ. 60 లక్షలు చెల్లించడంతో మిగతా పనులు నిలిచిపోయాయి. ఈ కళాశాలకు ప్రభుత్వం 2.45 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో అందులో అరెకరా బలవంతంగా తీసుకుని వ్యవసాయ గోదామును నిర్మించే పనులు చేపట్టింది. డిగ్రీ కళాశాలకు ఆటస్థలంతోపాటు ఇతర అవసరాలకు కేటాయించిన భూమిని అప్పటి అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి కళాశాల భూమిలో నిర్మాణాలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని