logo

ఎంఈసీ గ్రూప్‌నకు మంగళం!

కాకరపాడు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల జూనియర్‌ కళాశాలలో ఎత్తివేసిన ఎంఈసీ గ్రూప్‌ను పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Published : 26 Jun 2024 02:16 IST

కాకరపాడులో నిరుపయోగంగా బాలికల పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహం 

కొయ్యూరు, న్యూస్‌టుడే : కాకరపాడు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల జూనియర్‌ కళాశాలలో ఎత్తివేసిన ఎంఈసీ గ్రూప్‌ను పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. గురుకుల జానియర్‌ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌లుండేవి. ప్రతి విభాగంలో 40 మంది చొప్పున విద్యార్థులను చేర్చుకునేవారు. ప్రథమ సంవత్సరంలో 160 మంది, ద్వితీయ ఏడాదిలో 160 మంది ఉండేవారు. ఈ ఏడాది ఎంఈసీ గ్రూప్‌ని ఎత్తివేశారు. మూడు గ్రూప్‌లలో 40 మంది చొప్పున 120 మంది విద్యార్థులు చేరారు. ఏడాది క్రితం వరకు ఇదే కళాశాలలో బాలికలకు అవకాశం కల్పించారు. ఒక్కో గ్రూప్‌లో 10 సీట్లు కేటాయించేవారు. వీరి కోసం ప్రత్యేకంగా పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాన్ని నిర్మించారు. గతేడాది బాలికలను చేర్చుకోలేదు. ద్వితీయ ఏడాది చదివిన బాలికలు మార్చిలో పరీక్షలు రాసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి అది నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఈ ఏడాది ఎంఈసీ గ్రూప్‌ను ఎత్తేయడంతో మన్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎంఈసీ స్థానంలో హెచ్‌ఈసీ గ్రూప్‌నైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటే బాలికలకు అవకాశం కల్పించి పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాన్ని వినియోగంలోకి తీసుకురావాలని వారంతా కోరుతున్నారు. 

కలెక్టర్, పీవో దృష్టికి తీసుకెళ్తా.. 

సాధారణంగా కళాశాలల్లో కొత్త గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడేమో ఉన్న గ్రూప్‌ను తొలగించేశారు. దీని వల్ల గిరిజన విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతోంది. హెచ్‌ఈసీ గ్రూప్‌నైనా ఏర్పాటు చేయాలి. నిరుపయోగంగానున్న బాలికల పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహంలో బాలికల కళాశాల ఏర్పాటు చేయాలి. ఈ విషయాలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్తాను. 
- బి.రమేష్‌బాబు, ఎంపీపీ, కొయ్యూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని