logo

బాబూ.. మీరే ఇవ్వాలి భరోసా..!

ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబునాయుడు తొలిసారి అనకాపల్లి జిల్లాకు వస్తున్నారు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన పోలవరం ఎడమకాలువ ఆక్విడక్ట్‌ను ఆయన గురువారం పరిశీలించనున్నారు.

Updated : 11 Jul 2024 05:27 IST

నాలుగోసారి సీఎం అయ్యాక తొలిసారి జిల్లాలో పర్యటన
నేడు పోలవరం కాలువ ఆక్విడక్ట్‌ పరిశీలన
వైకాపా చేసిన గాయాలపై దృష్టిసారించాలని కోరుతున్న జిల్లావాసులు

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు మరలా కొలువుతీరడంతో అభివృద్ధిని పట్టాలెక్కించాలని, వైకాపా చేసిన గాయాలకు మందు పూయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఈనాడు, అనకాపల్లి - న్యూస్‌టుడే, ఎస్‌.రాయవరం, అనకాపల్లి: ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబునాయుడు తొలిసారి అనకాపల్లి జిల్లాకు వస్తున్నారు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన పోలవరం ఎడమకాలువ ఆక్విడక్ట్‌ను ఆయన గురువారం పరిశీలించనున్నారు. వైకాపా సర్కారు గత అయిదేళ్లలో నిర్లక్ష్యం చేసిన రంగాల్లో అతి ముఖ్యమైన జలవనరుల శాఖకు జవసత్వాలు కల్పించేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గత పాలకులు అన్ని జలవనరులనూ నిర్వీర్యం చేసేశారు. 2014-19 మధ్యలో తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులను సైతం వైకాపా నేతలు పట్టించుకోలేదు. వారి చర్యల కారణంగా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు జిల్లా నుంచి వెనక్కి మళ్లిపోయాయి.

10 శాతం పనులు కూడా చేయలేకపోయారు..

అయిదేళ్లలో ఒక్కశాతం కూడా చేయలేకపోయిన ఆక్విడక్ట్‌

పోలవరం ఎడమ కాలువ పనుల్లో భాగంగా దార్లపూడి వద్ద అడ్డురోడ్డు- నర్సీపట్నం రహదారితో పాటు, వరాహానది ఉండడంతో ఈ ప్రాంతంలో పైనుంచి ఆక్విడక్ట్‌ నిర్మించాల్సి వచ్చింది. దీనికోసం 2017-2018లో తెదేపా ప్రభుత్వం రూ.154.86 నిధులు మంజూరు చేసింది. సుమారు 1.3 కి.మీ. పొడవునా ఆరు కాలువలుగా ఆక్విడక్ట్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 2019 ఎన్నికల వరకు ఈ పనులు వేగంగా జరగడంతో సుమారు 90 శాతం పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వరాహానదిపై ఉన్న ప్రాంతం దాదాపుగా పూర్తికాగా, ర.భ.శా. రహదారిపై నిర్మించాల్సిన భాగం నిలిచిపోయింది. మిగిలిన 10 శాతం పనులను వైకాపా ఈ అయిదేళ్లలో పూర్తిచేయలేకపోయింది. జగన్‌ సర్కారుపై నమ్మకంలేక గుత్తేదారులు ఈ నిర్మాణంపై వెనుకంజ వేశారు. ఇప్పుడీ పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే నేరుగా వస్తుండడంతో త్వరలోనే ఆక్విడక్ట్‌ పనులు పట్టాలెక్కనున్నట్లు స్పష్టమవుతోంది.

పరిశోధన లేదు.. అంతా వేదనే..

  • తెదేపా ప్రభుత్వం హయాంలో వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట వేసింది. స్థానిక అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగశాలలు, రైతు శిక్షణ భవనాల నిర్మాణాలకు రూ.5.79 కోట్లు మంజూరు చేశారు. కొంత నిర్మాణం పూర్తయ్యాక ప్రభుత్వం మారడంతో ఆయా కట్టడాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
  • అనకాపల్లి మండలం టి.సిరసపల్లిలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరు చేశారు. ఇందుకోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్థల సేకరణ, మౌలిక వసతుల కోసం సుమారు రూ.10.41 కోట్లు మంజూరు చేశారు. నూతన భవనాలు నిర్మాణం పూర్తిచేసే వరకు బెల్లం మార్కెట్‌ యార్డులో తాత్కాలికంగా కేంద్రాన్ని ప్రారంభించారు.  వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించారు.

పరిశోధన కేంద్రంలో సమీక్షిస్తున్న చంద్రబాబు, నాటి మంత్రులు తదితరులు

ఎన్నో ఏళ్లగా జిల్లాలోని రైతులకు సేవలు అందిస్తున్న అనకాపల్లిలోని ఏరువాక కేంద్రాన్ని వైకాపా అధికారంలోకి వచ్చాక ఇక్కడ నుంచి అమలాపురం తరలించేశారు.

గ్రోయిన్ల గోడు వినండి..

శారదా నదిపై ఉన్న రెండు గ్రోయిన్ల స్థానంలో ఆనకట్టలు నిర్మించాలని గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. వీటికోసం రూ.23.86 కోట్లు మంజూరు చేయడంతో పాటు 2018 డిసెంబరు 27న చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ప్రారంభించకుండానే నిలిచిపోయాయి. కంటి ముందే పుష్కలంగా నీరు ఉన్నా పంటపొలాలకు చేరని పరిస్థితి. తుమ్మపాల ఆనకట్ట పూర్తయితే 12,541 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, పలు గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. భూగర్భజలాలు అభివృద్ధి చెందుతాయి.

శారదానదిపై తుమ్మపాల వద్ద ఆనకట్ట నిర్మించాల్సిన ప్రాంతం

పరిశ్రమించాలి మీరే..

తెదేపా ప్రభుత్వ హయాంలో అనకాపల్లి మండలం కోడూరు, వల్లూరులో పరిశ్రమల ఏర్పాటుకు 420 ఎకరాల భూమిని సేకరించారు. రైతులకు పరిహారం చెల్లించారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం మారడంతో వాటి జోలికి ఎవరూ పోలేదు. కోడూరులో ఆటోనగర్‌ అంటూ హడావుడి చేశారు తప్ప ఒక్క యూనిట్‌ కూడా ఏర్పాటు చేయించలేకపోయారు.    సేకరించిన భూముల్లో పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత కూటమి సర్కారుపైనే ఉందిప్పుడు.


ముఖ్యమంత్రి పర్యటనకు భారీ భద్రత

డీఐజీ, కలెక్టర్‌ పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చిస్తున్న డీఐజీ విశాల్‌గున్ని, కలెక్టర్‌ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణ

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: ఎస్‌.రాయవరం మండలం దార్లపూడిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలవరం ఎడమ కాలువపై దార్లపూడి వద్ద ఆక్విడక్ట్‌ను సీఎం సందర్శించనున్నారు. పోలవరం కాలువ, ఆక్విడక్ట్‌ ఉన్న ప్రాంతమంతా ఎత్తయిన కొండను ఆనుకుని ఉంది. దీంతో ఈ ప్రాంతంతోపాటు కొండపైన సైతం భారీగా పోలీసు సిబ్బందిని కాపలా ఉంచుతున్నారు. బుధవారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఇక్కడి ప్రదేశాలను నిశితంగా పరిశీలించి, జాగిలంతో తనిఖీలు చేపట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఏర్పాట్లను డీఐజీ విశాల్‌ గున్ని, కలెక్టర్‌ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. హెలిపాడ్, ఆక్విడక్ట్‌ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై పోలీస్, ఆర్‌అండ్‌బీ, పోలవరం ప్రాజెక్ట్‌ అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షం కురిస్తే తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. చంద్రబాబు జిల్లా ఉన్నత పాఠశాలలోని హెలిపాడ్‌ నుంచి రోడ్డు మార్గాన ఆక్విడక్ట్‌కు చేరుకునేలా అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్విడక్ట్‌ వద్ద తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం హెలికాప్టర్‌తో రెండుసార్లు ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

దార్లపూడి ప్రధాన రహదారిపై చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ నాయకులు దారిపొడవునా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి ఆక్విడక్ట్‌ వరకు ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు, సందర్శన ప్రాంతం, ఫొటో గ్యాలరీలను సిద్ధం చేశారు. ఆర్‌డీఓ జయరాం, డీఎస్పీ మోహన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, ఉప సర్పంచి పోలిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బుధవారం సాయంత్రం హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని