logo

World Fathers Day: నడిపించే కథానాయకుడు.. నాన్న

మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని  పరిచయం చేసేది నాన్న.. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే.. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు.

Updated : 16 Jun 2024 07:48 IST

ప్రపంచ తండ్రుల దినోత్సవం నేడు 

మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని  పరిచయం చేసేది నాన్న.. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే.. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. ప్రతి కొడుకు.. కూతురు జీవితాల్లో నిజమైన హీరో నాన్నే.. తండ్రిని స్ఫూర్తిగా.. ప్రేరణగా.. ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో తరిస్తున్న మన ప్రజాప్రతినిధుల ప్రస్థానంపై ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 

ఆయన జీవితమే స్ఫూర్తి

 నాన్న సుబ్బారావుతో కొల్లు రవీంద్ర

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: మాది బందరు మండలం గరాలదిబ్బ గ్రామం. మేము ముగ్గురు మగ పిల్లలం, ముగ్గురు ఆడ పిల్లలం. నాన్న సుబ్బారావు అంటే రైస్‌మిల్‌ కనస్ట్రక్షన్‌ వ్యాపారిగా అందరికీ తెలుసు. ఆ వ్యాపారం మా తాత నుంచి వస్తోంది. ఇప్పటికీ నేను దానిని కొనసాగిస్తూ వస్తున్నా. రవీంద్ర చాలా కూల్‌గా ఉంటాడని అని అంటారు. అది మా నాన్న నుంచి నేర్చుకున్న లక్షణం. ఆయన విపరీతంగా కష్టపడేవారు. మధ్యలో ఎలాంటి సమస్యలు  ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేవారే కానీ ఆందోళన చెందేవారు కాదు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించేవారు. పదిమందితో మంచిగా ఉండాలి, ఆప్యాయంగా పలకరించాలని చెప్పేవారు. సమస్యలు అనేవి మనం భూమి మీద ఉన్నంత కాలం వస్తూ.. పోతూ ఉంటాయని చెప్పేవారు ఆ మాట నాలో చాలా మార్పు తెచ్చింది. ఓటమి అయినా, విజయమైనా, ఇబ్బందులు ఎదురైనా ప్రతి అంశాన్ని సులువుగా తీసుకోగలగడానికి అదే కారణం. ఆత్మవిశ్వాసం, ఆశావాహ దృక్పథం ఆయన నుంచి నేర్చుకున్నవే. నా జీవితమే నాకు స్ఫూర్తి. 

కొల్లు రవీంద్ర, రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్‌ శాఖా మంత్రి


ప్రతి అడుగు నాన్న చూపిన బాటలోనే.. 

 తండ్రి రామశేషగిరిరావుతో యార్లగడ్డ వెంకట్రావు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నేను అమెరికా వెళ్లి వ్యాపారం చేసే స్థాయికి ఎదగడంలోనూ, రాజకీయంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలుపొందడంలోను తండ్రి రామశేషగిరిరావు పాత్ర ఎంతో ఉంది. ఏ పని చేసినా పది మందికి మేలు జరగాలి, దేనికోసం వ్యక్తిత్వం వదులుకోవద్దంటూ విద్యార్థి దశ నుంచి నన్ను ప్రోత్సహించే వారు. అదేవిధంగా కుటుంబం పైనా, రైతులపై అభిమానం చూపాలంటూ చెప్పారు. అందుకే వారసత్వంగా మేలు జాతి ఎడ్లు, ఆవులు పెంచడంతో పాటు, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌గా రుణాల మంజూరు ప్రక్రియను సరళతరం చేయడంతో పాటు, వడ్డీ భారం తగ్గించేలా చర్యలు తీసుకున్నా. మరోపక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తూ అందరం కలిసి జీవిస్తున్నాం. ఎమ్మెల్యే కావాలన్న కోరికతో భారీగా ఆదాయం వచ్చే వ్యాపారాలు వదులుకుని అమెరికా నుంచి వచ్చినా, ఏమీ అనకుండా ప్రజలకు మంచి చేస్తావనే నమ్మకం ఉంటే ధైర్యంగా రాజకీయాల్లో దిగు అంటూ వెన్ను తట్టారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ నాతో పాటు ఇంటింటి ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ, విలువల కారణంగానే ఈ స్థాయికి చేరానని గర్వంగా చెప్పగలను.

యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం ఎమ్మెల్యే


రోల్‌ మోడల్‌ నాన్నే : కుమార్‌ రాజా

తండ్రి రామయ్యతో ఎమ్మెల్యే కుమార్‌రాజా 

న్యూస్‌టుడే, పామర్రు రూరల్‌: నా రోల్‌ మోడల్‌ మా నాన్న వర్ల రామయ్య. ప్రతి విషయంలో ఆయనే నాకు ఆదర్శం. ఏ పని ప్రారంభించినా దాన్ని సాధించే వరకు వదలకూడదనేది ఆయన నుంచే నేర్చుకున్నాను. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం నీ సొంతమవుతుందని హితబోధ చేసేవారు. అదే స్ఫూర్తితో విద్యలో ముందంజలో నిలవగలిగాను. ఎక్కడ ఓడిపోయామో అక్కడే విజయం సాధించాలనేది నాన్న ఆలోచన. ఆయన చెప్పిన గొప్ప విషయాలను మననం చేసుకొంటూ నిస్వార్థంగా మూడేళ్లు కష్టపడ్డాను. చివరికి విజయం సాధించగలిగాను. ఈ ఘన విజయం నాన్నకు అంకితమిస్తున్నాను. జీవితమనేది సవాల్‌గా ఉండాలని.. ప్రతి విషయంలో ముందుండాలి, దేనికీ భయపడకూడదని ధైర్యం చెప్పేవారు. ఆయన నుంచి అలవర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదల, స్ఫూర్తే నా విజయ రహస్యం.


పోరాడేతత్వం నేర్చుకున్నా : బోడే

తండ్రి వెంకటేశ్వరరావుతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌

పెనమలూరు, న్యూస్‌టుడే: పోరాడాలి.. ఓడినా మళ్లీ గెలవాలనే తత్వాన్ని నాన్న వెంకటేశ్వరరావు చిన్ననాటి నుంచే అలవర్చారు. రాజకీయంగా..వ్యాపారపరంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎప్పటికప్పుడు నాకు అన్ని రకాలుగా ఆత్మస్థైరాన్ని అందించారు. కష్టపడడం, ఎంచుకున్న రంగంలో ప్రథమ స్థానంలో రాణించడం, సమయపాలన పాటించడం వంటి అంశాల్లో నన్ను చిన్ననాటి నుంచి తీర్చిదిద్దారు. అందుకే నేను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా. తొలిసారి నేను పోరంకి సర్పంచిగా పోటీచేసి ఓటమి పాలయ్యా. ఆ సమయంలో నాన్న నన్ను మరింత ప్రోత్సహించారు. దీంతో  నాలో పోరాడేతత్వం మరింత పెరిగింది. ఈ పట్టుదలే నాకు ఈ ఎన్నికల్లో 60 వేల మెజారిటీని అందించింది. నా విజయాల వెనుక నాన్నదే ప్రధానపాత్ర. అందుకే నాన్న అంటే నాకిష్టం.


నాన్నే నా గురువు : బుద్ధప్రసాద్‌

తండ్రి వెంకట కృష్ణారావుతో (పాత చిత్రం) 

న్యూస్‌టుడే, అవనిగడ్డ: చిన్ననాటి నుంచి నాన్న మండలి వెంకట కృష్ణారావు సభలు, సమావేశాలకు నన్ను వెంట తీసుకెళ్లేవారు. ఎందరో పెద్దలతో పరిచయాలు చేశారు. పాఠశాలలో చదువుకోవడం కంటే తండ్రితో తిరగడం తోనే మంచి జ్ఞానం సంపాదించుకున్నాను. పిన్న వయసు నుంచే సేవా దృక్పథం అలవడింది. దివిసీమ ఉప్పెన సమయంలో అది మరింత పెరిగింది. నన్ను సమాజ సేవకుడిగా తీర్చదిద్దాలని గాంధీక్షేత్రం ద్వారా తర్ఫీదు ఇచ్చారు.  ఆయన నోటితో చెప్పకుండానే ఆయనలోని మనోభావాలను గ్రహించేవాడిని. నీకంటే పెద్దవారితో సహవాసం చేస్తే బాగు పడతావు, చెడ్డవారితో సహవాసం చేస్తే పనికిరాకుండా పోతావని ఒక సారి అన్నారు. అదే నా జీవితానికి ప్రేరణ ఇచ్చింది. 


విరోధులైనా ప్రేమించాలనేవారు

వెంకట్రావుతో కృష్ణప్రసాద్‌

రాజకీయాల తరువాత ప్రత్యర్థులు ఉంటారు. కానీ మా నాన్నను రాజకీయాలకు అతీతంగా అందరూ ఇప్పటికీ అభిమానిస్తుంటారు. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఎదురైనప్పుడు వాళ్లు పలకరించకుండా వెళ్లిపోతున్నా నాన్న పిలిచి మాట్లాడేవారు. ఇలాంటి సంఘటనలు నేను స్వయంగా చూసి అడిగాను. విరోధి అయినా ప్రేమించాలి, వాళ్లు వారి పార్టీపరంగా విమర్శిస్తుంటారు. కానీ వ్యక్తిగత బంధాలకు విలువ ఇవ్వాలి అనేవారు. ఆ విలువలను పాటిస్తూనే నేను రాజకీయం చేస్తున్నా. నేను, అక్క ఇద్దరం మా అభిప్రాయాలను గౌరవిస్తూ ఇష్టం వచ్చింది చేయమనేవారు. నేను చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పుడు కూడా ఆలోచించుకో నీ ఇష్టం అన్నారు కానీ బలవంతం చేయలేదు. కుల, మత భేదాలు లేకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ అక్క, బావ, అన్న, తమ్ముడు అనిపిలిచే వ్యక్తి కాగిత వెంకట్రావు. అదే నన్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించేలా చేసింది.

కాగిత కృష్ణప్రసాద్,పెడన ఎమ్మెల్యే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని