logo

Jogi Ramesh: జోగి మెడకు అగ్రి ఉచ్చు.. ఏసీబీ విచారణకు డీజీపీ ఆదేశం

మాజీ మంత్రి జోగి రమేష్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలో ఆయనపై విచారణ ప్రారంభించారు.

Updated : 11 Jul 2024 07:44 IST

రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల ప్రమేయం
కేసు నమోదుకు రంగం సిద్ధం..
ఈనాడు, అమరావతి

మాజీ మంత్రి జోగి రమేష్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలో ఆయనపై విచారణ ప్రారంభించారు. ఏకంగా సర్వే నెంబరు మార్చి.. తనయుడు రాజీవ్, బాబాయ్‌ వెంకటేశ్వరరావు పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించిన ఆయన వాటిని వెంటనే అమ్మడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో జోగి అధికారులపై తీవ్ర ఒత్తిడి తేగా.. కొందరు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమంపై లోతైన విచారణకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఏసీబీని ఆదేశించారు. విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. అంబాపురంలో అగ్రిగోల్డ్‌ జప్తు చేసిన రూ.10 కోట్లు విలువైన నివేశన స్థలాన్ని ఆక్రమించి విక్రయించారు. దీనిపై గత ప్రభుత్వంలోనే టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. జోగి దందా, అధికారుల వత్తాసుపై ఫిర్యాదు అందినా నాడు పోలీసులు కేసు పెట్టలేదు.

ఏం జరిగిందంటే..!

ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం సర్వేనెంబరు 88లో పట్టాదారులుగా కనుమూరి వెంకట రామరాజు, కనుమూరి సుబ్బరాజులు ఉన్నారు. దీనిలో 4 ఎకరాలను 1969లోనే బొమ్ము వెంకట చలమారెడ్డికి అమ్మారు. దీనిలో వారు ఒక ఎకరం 2001లో పి.మురళీమోహన్‌కు అమ్మగా ఆయన 2014లో మహాలక్ష్మీ ప్రాపర్టీస్‌కు (ఎ.మోహన్‌రామదాసు) 3,800 గజాలు విక్రయించారు. అందులో జోగి వెంకటేశ్వరరావుకు 1,086 గజాలు, జోగి రాజీవ్‌కు 1,074 గజాలు 2022లో అమ్మారు. తమ దస్తావేజుల్లో సర్వేనెంబరు తప్పుగా నమోదైందని స్వీయ సవరణ పేరుతో వెంకటేశ్వరరావు,  రాజీవ్‌లు సర్వేనెంబరు 87గా మార్చుకుని మళ్లీ రిజిస్టర్‌ చేయించారు. ఆ తర్వాత వీటిని వైకాపా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువులకు సర్వేనెంబరు 87 మీద రిజిస్టర్‌ చేయించారు. అంబాపురం రీసర్వేనెంబరు 87లో అల్లూరి కృష్ణమూర్తికి, అక్కడి నుంచి అవ్వా వెంకట శేషునారాయణకు విక్రయించినట్లు ఉంది. అవ్వా వెంకట శేషు నారాయణరావు కుటుంబం అగ్రిగోల్డ్‌ భాగస్వాములు. ఆర్‌ఎస్‌ నెంబరు 87లో 2293.05 గజాల స్థలాన్ని హోంశాఖ జప్తు చేసింది. జోగి రమేష్‌ తనయుడు 2022లో కొని 2023లో విక్రయించారు. 

అధికార బలంతో అడ్డగోలు...

స్వీయ సవరణ.. కేవలం అచ్చుతప్పులు, పేర్లు తప్పులు, అక్షర దోషాలు, సరిహద్దులు తప్పుగా ఉంటేనే చేస్తారు. కానీ లిగు డాక్యుమెంట్లలో సర్వేనెంబరు 88గా ఉంటే.. తమ భూమి సర్వే నెంబరు 87గా సవరణ చేయడం చెల్లదు. కానీ తన అధికార బలంతో అధికారులపై ఒత్తిడి చేసి మరీ రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనికి నాటి నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వత్తాసు పలికారు. ఆయనకు తర్వాత ఇబ్రహీంపట్నం పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన జోగికి దగ్గర వ్యక్తి. తహసీల్దారు జాహ్నవిరెడ్డి సైతం విజయవాడ గ్రామీణంలో వైకాపా నేతలకు అనుకూలంగా ఉండి.. మట్టి తవ్వకాలనూ చూడనట్లు వదిలేశారు. దీంతో ఎన్నికల ముందు కావాలని విజయవాడ పశ్చిమకు బదిలీ చేసి తిరిగి ఎన్నికలు కాగానే అక్కడికి చేరుకున్నారు. మండల సర్వేయర్‌ తనకు తెలియకుండా సర్వే చేసి 87లో భూమి ఉందని ధ్రువీకరణ ఇచ్చారని తహసీల్దారు చెబుతున్న విషయం ఏమాత్రం నమ్మశక్యంగా లేదనేది వాస్తవం. దీనిలో రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారుల పాత్ర ఉన్నా వారిపై చర్యలు లేకుండా కంటితుడుపుగా ముగ్గురు ఉద్యోగులపై వేటు వేశారు. సివిల్‌ పంచాయితీ పేరుతో జోగి కబ్జాపై ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకుండా పక్కన పడేయడాన్ని అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా వ్యవహారంలో ఇప్పటి వరకు డీటీ విజయ్‌కుమార్, మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయరు దేదీప్యలను మాత్రమే అప్పటి కలెక్టర్‌ డిల్లీరావు సస్పెండ్‌ చేశారు.

అనిశా రంగంలోకి..

దీనిపై పూర్తి వివరాలను విజయవాడ సీపీ... డీజీపీకి అందజేయగా ఏసీబీ ద్వారా విచారణకు నిర్ణయించారు. జోగి రమేష్‌ పాత్రపై అనిశా అధికారులు లోతుగా విచారణ చేసి.. ఆపై కేసు నమోదు చేసే వీలుందని తెలిసింది. ఇప్పటికే ఆయన చుట్టూ కేసుల ఉచ్చులు భిగిస్తున్నాయి. గతంలో చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లిన కేసు విచారణ జరుగుతోంది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఆయనతోపాటు అనుచరులు పాల్గొన్నట్లు విచారణ చేస్తున్నారు. వీటిపై ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం జోగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పెడన పరిధిలో రంగారావు కుటుంబానికి చెందిన 70 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయడానికి యత్నిస్తున్నట్లు ఫిర్యాదులు రాగా విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. వీటన్నింటితో జోగి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని