logo

Vijayawada: ఐదేళ్లుగా అక్రమార్కుల ఇష్టారాజ్యం.. దుర్గగుడి ప్రక్షాళనకు వేళాయె!

‘రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై చంద్రబాబు సర్కారు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రక్షాళన చర్యలను ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది.

Published : 17 Jun 2024 07:54 IST

ఈనాడు, అమరావతి

‘రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై చంద్రబాబు సర్కారు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రక్షాళన చర్యలను ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఇంద్రకీలాద్రిపై జరిగినన్ని అక్రమాలు, అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదు. దేవస్థానం ప్రతిష్ఠను సైతం దిగజార్చేలా వెండి సింహాల చోరీ సహా అనేక వివాదాలకు కేంద్రంగా అమ్మవారి ఆలయాన్ని మార్చేశారు. జగన్‌ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల చొప్పున పనిచేసిన ఇద్దరు దేవాదాయశాఖ మంత్రులు.. విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలయ ఆదాయాన్ని కరిగించారు.

కానీ ఆలయంలో భక్తులకు అవసరమైన అభివృద్ధి, కనీస సౌకర్యాల కల్పన ఒక్కటీ చేసింది లేదు. వెలంపల్లి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ.. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు కొనసాగిస్తూ.. ఒకే పనికి రెండేసి సార్లు నమూనాలు తయారు చేయించి వాటి ఆవిష్కరణ కార్యక్రమాలను చేయించుకున్నారు. అవే నమూనాలను ఆవిష్కరించేందుకు నాటి సీఎం జగన్‌ను సైతం ఆలయానికి రెండేసిసార్లు రప్పించిన ఘనతా వీరికే దక్కుతుంది. కానీ.. ఆ నమూనాల్లో ఒక్కదానికీ ఇంతవరకూ ఇటుక కూడా వేసింది లేదు.’]

ప్రణాళిక బుట్టదాఖలు

గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే దుర్గగుడి సమగ్రాభివృద్ధి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈవోగా తొలిసారి ఐఏఎస్‌ అధికారి సూర్యకుమారిని నియమించి రూ.100 కోట్లతో బృహత్తర ప్రణాళిక రూపొందించారు. మల్లికార్జునపేట వైపు స్థల సేకరణ కూడా చేపట్టారు. కనకదుర్గానగర్‌ వైపు అలిపిరి తరహాలో టోల్‌ప్లాజా, స్వాగత ద్వారం, పుష్పవనం, భక్తులు సేదదీరేందుకు సదుపాయాలు, కుమ్మరిపాలెం వద్ద తితిదే స్థలంలో కల్యాణ మండపాలు, భక్తులకు కాటేజీలు, పార్కింగ్‌ సదుపాయం, దుర్గాఘాట్‌ అభివద్ధి, అధునాతన కేశఖండనశాల, అన్నదాన భవనం, ప్రసాదంపోటు నిర్మించాలని ప్రతిపాదించారు. వైకాపా సర్కారు వచ్చిన వెంటనే మంత్రి వెలంపల్లి వాటిని బుట్టదాఖలు చేశారు.


కార్యాలయాల పేరుతో రూ.కోట్ల వృథా..

దుర్గగుడిలో గత ఐదేళ్లలో ఈవోలు మారిన ప్రతిసారీ కార్యాలయాలను మార్చుకుంటూ వచ్చారు. జమ్మిదొడ్డిలోని వసతిగృహంలో ఉన్న ఈవో కార్యాలయాన్ని కొండమీద ఉన్న మహామండపంలోకి మార్చేందుకు రూ.కోటికి పైనే ఖర్చు చేశారు. కార్యాలయంలో ఏసీల పేరుతో భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కనీసం కార్యాలయం మార్చాకైనా జమ్మిదొడ్డి వసతిగృహాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారా అంటే అదీ లేదు. ఖాళీగా వదిలేశారు. వైకాపా నేతల ఆదేశాలతో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆ గదులను సిఫార్సులపై వాడుకున్నారు. దుర్గగుడి డబ్బులతో భక్తుల కాటేజీల కోసమంటూ గతంలో సీతానగరంలో కృష్ణానదీ తీరంలో ఓ భవనం కట్టారు. దాన్ని కూడా దేవాదాయశాఖ కార్యాలయం కోసం వాడుకుంటున్నారు. దీనికి కూతవేటు దూరంలోనే గొల్లపూడిలో విశాలమైన దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఉండగా.. భక్తుల కోసం కట్టిన కాటేజీని కూడా ఆక్రమించడమేంటనే విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకునే నాథుడే లేడు. ఏటా 2కోట్ల మందికి పైగా వచ్చే భక్తుల కోసం కనీస వసతులతో కాటేజీలు కూడా లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం.


మాట ఇచ్చి.. తప్పారు!

కొండ చరియలు విరిగి పడిన సమయంలో ఆలయానికి వచ్చిన జగన్‌ ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు వెంటనే విడుదల చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ ఆ నిధులూ ఇవ్వలేదు. నమూనాలు పట్టాలెక్కలేదు. కానీ ఆలయంలో వివిధ పనుల కాంట్రాక్టులను మాత్రం వెలంపల్లి తన బినామీలకు కట్టబెట్టి భారీగానే ఆర్జించారు. రెండున్నరేళ్ల వెలంపల్లి హడావుడి ముగిసి.. కొత్తగా కొట్టు సత్యనారాయణ వచ్చారు. ఆయన కూడా మళ్లీ నా నమూనాలు ఇవీ అంటూ.. వెలంపల్లి హయాంలోని అన్నింటినీ పక్కన పెట్టేశారు. వాటి కోసం వెచ్చించిన రూ.లక్షలు వృథా అయ్యాయి. కొట్టు ఏకంగా రూ.220 కోట్లతో ఆలయ రూపురేఖలు మార్చేస్తానంటూ ఓ పది శిలాఫలకాలను జగన్‌ను తీసుకొచ్చి ఆవిష్కరింపజేశారు. కానీ ఒక్క పని కూడా చేసింది లేదు. 


అధికారులకు తోచినట్లుగా నిర్ణయాలు..

త ప్రభుత్వంలో ఆలయానికి ఈవోలుగా నియమించిన అధికారులంతా ఎవరికి నచ్చినట్టు వాళ్లు నిర్ణయాలు తీసుకుంటూ.. అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లోనూ అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఒఐదేళ్లు.. వెలంపల్లి, కొట్టు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. చివరికి చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయానికి ఆధ్యాత్మిక శోభను పెంచేందుకు రూ.5 కోట్ల వరకూ వెచ్చించి కనకదుర్గానగర్‌లో నిర్మించిన రాతి మండపం(పెర్గోలా)ను కూడా పొక్లెయిన్లు, రంపాలను తీసుకొచ్చి కోసేసి, నేలమట్టం చేసేసి ఏమీ మిగల్చకుండా చేశారు. పైగా రాతి మండపం వద్ద అంతకుముందున్న ఈవో సురేష్‌బాబు దుకాణ సముదాయాల ఏర్పాటుకు ప్రతిపాదన పెట్టారు. తర్వాత వచ్చిన భ్రమరాంబ సమయంలో 20 వరకూ దుకాణాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ వెంటనే రాతిమండపం సహా ఈ దుకాణాలనూ తొలగించి ఆలయ ఆదాయాన్ని వృథా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని