logo

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి దొంగాటలో ముగ్గురు అవుట్‌!

రాష్ట్ర హోంశాఖ జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ భూములను మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన వ్యవహారంలో ప్రాథమికంగా ముగ్గురు రెవెన్యూ సిబ్బందిపై వేటు పడింది.

Updated : 25 Jun 2024 09:40 IST

డీటీ, మండల, గ్రామ సర్వేయర్లపై సస్పెన్షన్‌ వేటు 
శాఖాపరమైన విచారణకు ఇన్‌ఛార్జి కలెక్టరు ఆదేశం

ఈనాడు - అమరావతి: రాష్ట్ర హోంశాఖ జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ భూములను మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులకు కట్టబెట్టిన వ్యవహారంలో ప్రాథమికంగా ముగ్గురు రెవెన్యూ సిబ్బందిపై వేటు పడింది. గ్రామీణ మండల తహసీల్దారు జాహ్నవి ఇచ్చిన నివేదిక ఆధారంగా గతేడాది గ్రామీణ మండలంలో డిప్యూటీ తహసీల్దారుగా (డీటీ) పని చేసిన విజయ్‌కుమార్, మండల సర్వేయరు రమేష్, గ్రామ సర్వేయరు దేదీప్యలను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టరు, సంయుక్త కలెక్టరు సంపత్‌కుమార్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విజయ్‌కుమార్‌ జగ్గయ్యపేట మండలంలో పని చేస్తున్నారు. ఈ అక్రమంపై శాఖాపరమైన దర్యాప్తు చేస్తామని ఇన్‌ఛార్జి కలెక్టరు సంపత్‌కుమార్‌ ‘ఈనాడు’తో చెప్పారు. తహసీల్దారు నివేదిక ప్రకారం పోలీసు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. భూహక్కులను తేల్చుకునేందుకు న్యాయస్థానానికి వెళ్లాలని ఫిర్యాదుదారులకు సూచించినట్టు తెలిసింది. జోగి కబ్జాలో ఉన్న భూమిని సీఐడీ తిరిగి స్వాధీనం చేసుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించినట్టు సమాచారం.

విజయవాడ గ్రామీణం అంబాపురంలో ఆక్రమించిన భూములు ఇవే..


ఉన్నతాధికారులకు తెలియకుండానే..!

అగ్రిగోల్డ్‌ భూములను జోగి రమేష్‌ తనయుడు రాజీవ్, బాబాయ్‌ వెంకటేశ్వరరావు చేజిక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉన్నతాధికారులకు తెలియకుండానే జరిగాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికైతే చిరుద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. డిప్యూటీ తహసీల్దారు ఎఫ్‌ఎల్‌ (సర్వే, స్వాధీనం) ఆదేశాలిచ్చారని, ఆయనకే అధికారం ఉందని తహసీల్దారు చెబుతున్నారు. మండల సర్వేయరు సొంత నిర్ణయం తీసుకునే సర్వే చేశారా? అన్నది తేలాల్సి ఉంది. గ్రామ సర్వేయరు పాత్ర నామమాత్రం. సర్వే నంబరు 88లో జోగి కుటుంబం మొదట కొనుగోలు చేసిన భూమి అక్కడ లేదని గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారు. దీంతో సర్వే నంబరు 87లో ఉండొచ్చని ఆయన సూచించారని తహసీల్దారు తన నివేదికలో పేర్కొన్నారు. వెంటనే స్వీయ సవరణ చేయడం.. ఆ వెంటనే సర్వే నంబరు 87తో రిజిస్ట్రేషన్‌ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. 

ఎవరు పడితే వారు స్వీయ సవరణల పేరుతో వేరే సర్వే నంబరులోకి భూమిని ఎలా మార్చేస్తారు? దీనికి ఉన్నతాధికారుల సహకారం ఉందా?

  • నాడు మంత్రి హోదాలో జోగి రమేష్‌ స్వయంగా తన కుమారుడు రాజీవ్‌ పేరుతో కొనుగోలు చేసిన భూమి సర్వే నంబరును మార్చడంలో ఆయన పాత్ర లేకుండా ఉంటుందా? 
  • సర్వే నంబరును మార్చేశాక తనకు నమ్మకస్థులైన వైకాపా నేతలకే వాటిని విక్రయించినట్టు చూపించారు. వీరు బినామీలా లేక అసలు కొనుగోలుదారులా? వీరు ఇంతవరకు ఎందుకు తెర మీదకు రాలేదు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని తెదేపా నిలదీస్తోంది. 


పోలీసు కేసు కీలకం..!

భూ కబ్జా వ్యవహారంలో జోగి కుటుంబంపై కేసు నమోదుకు పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. కొత్త డీజీపీ సూచనల మేరకు పకడ్బందీగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అగ్రిగోల్డ్‌ భూములను చట్ట ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోనున్నారు. ఒకే భూమిని ఇరువర్గాలకు విక్రయించినట్టు చెబుతోన్న పోలవరపు మురళీమోహన్‌ సంబంధీకులపై కేసు నమోదు అంశం కూడా పోలీసుల పరిశీలనలో ఉంది. సర్వే చేసి తప్పుడు ధ్రువీకరణపత్రాలిచ్చిన రెవెన్యూ సిబ్బందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. జోగి రాజీవ్‌ నుంచి భూమిని కొన్న కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువులు.. యాజమాన్య హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మరో కీలక పాత్రధారి సబ్‌రిజిస్ట్రార్‌. నిషేధిత జాబితాలో ఉన్న భూములను స్వీయ సవరణ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారన్నది ప్రశ్న.


ఇంతకాలం తాత్సారమా? 

విజయవాడ గ్రామీణంలో దాదాపు రూ. 10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ భూములను సర్వే నంబరు మార్చేసి ఆక్రమించుకున్న వైకాపా నాయకుడు జోగి రమేష్‌ కుటుంబంపై కేసులు పెట్టాలని రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. ఈ అక్రమాలపై గ్రామీణ తహసీల్దారు నాలుగు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా.. అక్రమాలు కళ్లెదుటే కనబడుతున్నా.. మొన్నటి వరకు పోలీసు పట్టించుకోలేదు. అసలు ఫిర్యాదునే పరిశీలించలేదు.  తాజాగా ఉన్నతాధికారుల జోక్యంతోనే కాస్త కదలిక వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని