logo

AP News: మురళీకృష్ణ మామూలోడు కాదు.. పేర్ని నాని, జోగి రమేష్‌ల అండతో రెచ్చిపోయి అక్రమాలు

జలవనరుల శాఖ బందరు సబ్‌ డివిజను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా నేటికీ కొనసాగుతున్న మురళీకృష్ణ ఏకకాలంలో మూడు పోస్టులను నిర్వహించారు.

Updated : 22 Jun 2024 07:41 IST

ఏకకాలంలో మూడు పోస్టుల నిర్వహణ
విచారణ చేయించాలని ఇంజినీర్ల డిమాండ్‌

ఈనాడు, అమరావతి: పేరు సీహెచ్‌ మురళీకృష్ణ... చేసింది డిప్లమో...అసిస్టెంట్‌ ఇంజినీరు హోదా.. చేసేది మాత్రం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా.. అంతేకాదు.. ఏకకాలంలో మూడు పోస్టులను చూసిన ఘనుడు... నాటి వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, నాటి ప్రజాప్రతినిధుల అండదండలే కారణం.. తాజాగా... అడ్డదారిలో అడహక్‌ పదోన్నతి కోసం ప్రయత్నమూ చేశారు. టెండర్లలో గోల్‌మాల్‌.. బినామీలతో పనులు చేయడం.. వచ్చింది పైవారికి పంచిపెట్టడం.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో.
విచిత్రమేమంటే.. ప్రభుత్వం మారినా.. తన హోదాకేమీ భంగం వాటిల్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారు!

జలవనరుల శాఖ బందరు సబ్‌ డివిజను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా నేటికీ కొనసాగుతున్న మురళీకృష్ణ ఏకకాలంలో మూడు పోస్టులను నిర్వహించారు. గత ఐదేళ్లలో ఆయన చేయని అక్రమం లేదు. ఎన్ని వెలుగు చూసినా.. విచారణ లేదు. చర్యల్లేవు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఎస్‌ఈ వరకు ఆయన ఎంత చెబితే అంత. బినామీ పేర్లతో కాంట్రాక్టులు సైతం చేశారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి తనవారికి అడ్డంగా దోచిపెట్టారు. పేర్ని నాని బంధువునంటూ ప్రచారం చేసుకునేవారు. జోగి రమేష్‌తో సన్నిహితంగా ఉండేవారు. తాజాగా ప్రభుత్వం మారడంతో తెదేపా ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తన హోదాకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఈయన అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

2020 నుంచి జలవనరుల శాఖ డీఈగా అదనపు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఏటా ఓఅండ్‌ఎం పనులపై పెత్తనం చలాయిస్తున్నారు. ఎస్‌ఈ తిరుమలరావు మారిన తరువాత ఈఈ ప్రసాద్‌కు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈయనను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

ఏకకాలంలో మూడు!

మురళీకృష్ణ

2015లో పులిచింతల ప్రాజెక్టు నుంచి మచిలీపట్నం సబ్‌ డివిజన్‌కు బదిలీపై వచ్చారు. పెడన డ్రెయినేజీ సెక్షన్‌లో అంచనాల వెరిఫికేషన్‌ (పరిశీలన) పోస్టు ఖాళీగా ఉండడంతో పెడనకు వచ్చారు. 2019లో ప్రభుత్వం మారాక ఈయన హవా మొదలైంది. పెడన డ్రెయినేజీ సెక్షన్‌ ఏఈఈగా ఉన్న ఈయనకు 2019 జులై 18 నుంచి 2022 జులై 4 వరకు మచిలీపట్నం సెక్షన్‌ ఏఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొంతమంది ఏఈఈలు ఉన్నా వారిని కాదని మురళీకృష్ణకే కట్టబెట్టారు. ఈ రెండూ నిర్వహిస్తుండగానే.. 2020 సెప్టెంబరు 9న జలవనరుల శాఖ బందరు సబ్‌ డివిజను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా అదనపు బాధ్యతలు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఇదే పోస్టులో కొనసాగుతున్నారు. బీటెక్, ఎంటెక్‌ చేసినవారు ఏఈఈలుగా ఉంటే.. ఈయన మాత్రం డీఈఈగా హోదా వెలగబెడుతున్నారు. ఒక రెగ్యులర్‌ పోస్టుతోపాటు రెండు అదనపు బాధ్యతలను నిర్వహించారంటే ఈయనపై నాటి వైకాపా ప్రజాప్రతినిధులకు ఎంత ప్రేమో అర్థమవుతోంది కదా.. జోగి రమేష్‌ అనుచరులతో కలిసి బినామీ కాంట్రాక్టులు చేశారని ఫిర్యాదులు వెళ్లాయి. 

పదోన్నతికి చక్రం తిప్పి..!

సరిగ్గా ఎన్నికలకు ముందు ఎఈ నుంచి డీఈగా అడ్‌హక్‌ పదోన్నతి పొందేందుకు దస్త్రం కదిపారు. సీఎంవో నుంచి ఆమోద ముద్ర వేయించారు. ఇద్దరు ఈఎన్‌సీలలో ఒకరు పచ్చజెండా ఊపారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో మిగిలిన ఏఈఈలు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలంటూ ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దీంతో ఈఎన్‌సీ (పరిపాలన విభాగం) దస్త్రాన్ని నిలిపేశారు. సీఎంవో నుంచి పదేపదే ఒత్తిడి తెచ్చినా లొంగలేదు. దీంతో పదోన్నతి ఆగిపోయింది. 

పనులు చేయకుండా బిల్లులు!

జల వనరుల శాఖ బందరు సబ్‌ డివిజను డీఈగా అదనపు బాధ్యతలు చేపట్టాక నాటి వైకాపా మంత్రుల పేర్లు చెప్పి ఆ శాఖలో ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు అందరినీ గుప్పిట్లో పెట్టుకున్నారు. అన్ని కాంట్రాక్టులు తన కనుసన్నల్లో జరిగేలా చూశారు. ఓ గుత్తేదారుతో కలిసి బినామీ అవతారమెత్తి భాగస్వామిగా పనులు చేయించారు. అదేమని అధికారులు అడిగితే.. నాటి మంత్రులతో సమాధానం చెప్పించేవారు. రూ. కోట్లు కొల్లగొట్టి.. తలా పిడికెడు పంచేవారని సమాచారం. 

  • బందరు కాలువ పూడిక తీత పనులను 7.70 కిలోమీటరు నుంచి 30.300 కిలోమీటరు వరకు విభజించి టెండర్లను పిలవగా.. రద్దు చేయించి ప్యాకేజీగా పిలిపించారు. తన అనుకూలురైన కిలారు శ్రీనివాసరావుకు అధిక ధరలకు దక్కేలా చక్రం తిప్పారు. వీటిలో మురళీకృష్ణ కూడా భాగస్వామిగా ఉన్నారని చెబుతున్నారు. పూడికతీతకు అంచనాల ప్రకారం ఘనపు మీటరుకు రూ. 117 చెల్లించాల్సి ఉండగా.. దూరంగా వేశారని చెప్పి రూ. 182.70 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ మట్టిని రియల్టర్లకు విక్రయించి అదనంగా సొమ్ము చేసుకున్నారు. 
  • 2022లో సాధారణ నిర్వహణ పనులకు ఆమోదం తెలిపింది. నాటి మంత్రుల సూచనల మేరకు పిలిచిన టెండర్లను రద్దు చేసి ప్యాకేజీలుగా మార్చిన ఘనత మురళీకృష్ణదే. డ్రెయినేజీ పనులను సాధారణ పద్ధతిలోనే పిలవగా.. జలవనరుల శాఖలో మాత్రం ప్యాకేజీలుగా చేసి ఒక్కోటి రూ. 2.50 కోట్ల చొప్పున బడా గుత్తేదారులు మాత్రమే అర్హత పొందేలా నిబంధనలు రూపొందించారు. అదేమంటే పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రతిపాదించారని ఎస్‌ఈని బురిడీ కొట్టించారు. కేసీ డివిజనులో టెండర్లన్నీ తన అనుచరులకు అందేలా చక్రం తిప్పారు.  పెదలంక డ్రెయినేజీ ముదినేపల్లి, బంటుమిల్లి సెక్షన్లకు సంబంధించింది. 2020లో దీని అదనపు బాధ్యతలు తీసుకుని పనులు చేయించారు. వీటిలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పెదలంక డ్రెయినేజీలో డ్రెడ్జింగ్‌ పనులు చేయకుండానే బిల్లులు పెట్టారు. భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లినా.. పేర్ని నాని, జోగి రమేష్‌ అడ్డుగా నిలిచారని అధికారులు చెబుతున్నారు. రి తాళ్లపాలెం మేజర్‌ డ్రెయిన్‌ పనులను దాదాపు రూ. 31.50 లక్షలతో నామమాత్రంగా అయిందనిపించి బిల్లులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. తాళ్లపాలెం ఎఫ్‌డీఆర్‌ పనులు (వరద నష్ట నివారణ) అంచనాలు రూపొందించి కలెక్టర్‌ నిధులతో నామినేషన్‌ పద్ధతిపై గుత్తేదారులకు అప్పగించారు. ఇక్కడ కూడా పేర్ని నాని, జోగి రమేష్‌ పేర్లు చెప్పి తనకు నచ్చిన గుత్తేదారులకే పనులిచ్చారు. ఈ పేర్లను కలెక్టరుకు ఆయనే ప్రతిపాదించారు. నాడు కలెక్టర్‌ పి.రాజాబాబు కావడంతో పేర్ని నాని పేరు చెప్పడమే తరువాయి మంజూరు చేశారు. ఇలా మొత్తం రూ. 2 కోట్లు పక్కదారి పట్టాయి. 

తెదేపా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణం

ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో తొలుత మంత్రి కొల్లు రవీంద్రను కలిసి, అభినందనలు తెలిపారు. తర్వాత పెడన, అవనిగడ్డ ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బుద్ధప్రసాద్‌లను కలిశారు. తనను గుడివాడ పరిసరాల్లోనే ఉంచాలంటూ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. గత పదేళ్లుగా బందరులో ఉన్న ఒకే ఒక్క క్వార్టర్‌లో ఉంటున్నారు. ఈయన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేయించాలని మిగిలిన ఇంజినీర్లు డిమాండ్‌ చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని