logo

Vijayawada: వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల ఇసుక దందా

అధికారం కోల్పోయినా వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ నాయకులు దానిని వీడడం లేదు. ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు.

Updated : 23 Jun 2024 09:31 IST

అర్ధరాత్రి అక్రమంగా తరలింపు
విజయవాడలో అడ్డుకున్న తెదేపా నాయకులు
విజయవాడ(భవానీపురం), న్యూస్‌టుడే

వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

అధికారం కోల్పోయినా వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ నాయకులు దానిని వీడడం లేదు. ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. గత ప్రభుత్వంలో చేసినట్లు ఇంకా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగిస్తున్నారు. సేకరించిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం నుంచి ఇసుక టిప్పర్లు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భవానీపురం వస్తున్నాయి. దాదాపు ఎనిమిది ఇసుక టిప్పర్లు వరుసగా వెళ్లడాన్ని విజయవాడలోని భవానీపురానికి చెందిన మాజీ కార్పొరేటర్‌ రామయ్య, మరికొందరు నాయకులు గుర్తించారు. వెంటనే ఆ టిప్పర్లు వెళ్తున్న మార్గాన్ని అనుసరించారు. రెండు టిప్పర్లు మాత్రం బైపాస్‌ రహదారి వెంట ఉన్న విద్యాధరపురం డిపో లారీ కాటా వద్దకు వెళ్లి ఆగాయి. మిగిలిన వాహనాలు వెళ్లిపోయాయి. వెంటనే అక్కడ ఆగిన టిప్పర్ల డ్రైవర్ల వద్దకు వెళ్లి ఇసుకకు సంబంధించిన బిల్లులు అడిగారు. తమ వద్ద ఏ విధమైన బిల్లులు లేవంటూ డ్రైవర్లు సమాధానం ఇచ్చారు. తెదేపా నాయకులు డ్రైవర్‌ను నిలదీయగా మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులకు చెందినవిగా తెలిపారు. అలాగే మరో టిప్పర్‌ డ్రైవర్‌ను ప్రశ్నిస్తుండగా అక్కడే రహదారిపైనే ఇసుక అన్‌లోడ్‌ చేసి వెళ్లిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మరో టిప్పర్‌ డ్రైవర్‌ను అడ్డుకుని భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక సీఐ అక్కడకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఇసుకను అక్రమంగా తరలించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భవానీపురం సీఐని తెదేపా నాయకులు కోరారు. ఈ విషయమై భవానీపురం స్టేషన్‌ సీఐ ప్రసాద్‌ మాట్లాడుతూ ఇసుక తరలింపుపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బైపాస్‌ రహదారిపై కుప్పగా పోసిన ఇసుక

పట్టించుకోని రెవెన్యూ అధికారులు...

తెదేపా ప్రభుత్వం కొలువుదీరి కొద్ది రోజులే అయింది. దీంతో ఇంకా ఇసుక విధానం ప్రకటించలేదు. కొన్ని ఇసుక రేవులు మూసివేశారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఈ సహజ వనరును అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఏవిధమైన బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నా రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలు దాటి మరీ భారీ వాహనాలు ఇసుక నింపుకొని వస్తున్నా దృష్టి పెట్టడం లేదు.

స్వాధీనం చేసుకున్న టిప్పర్‌ 

గుంటూరు, రాజధాని గ్రామాల నుంచి విజయవాడకు ఇసుకను టిప్పర్లలో రాత్రి సమయంలో భారీ ఎత్తున నగరంలోకి వస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో ఇసుక రవాణా జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక వ్యాపారం చేసిన వైకాపా నాయకులు ఇప్పటికీ అక్రమాలకు పాల్పడేందుకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే డంపింగ్‌ యార్డుల నుంచి కూడా ఇసుకను తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికే డంపింగ్‌ యార్డుల్లో చాలా వరకు ఇసుక ఖాళీ అయ్యింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అక్రమార్కుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని