logo

కార్పొరేషన్‌ నెత్తిన రీసర్వే భారం!

నగరంలో చేపడుతున్న ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం’ కింద భూముల రీసర్వే పరికరాల కొనుగోళ్ల వ్యయభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ నెత్తిన మోపింది.

Updated : 25 Mar 2023 04:28 IST

విజయవాడనగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో చేపడుతున్న ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం’ కింద భూముల రీసర్వే పరికరాల కొనుగోళ్ల వ్యయభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థ నెత్తిన మోపింది. ఈ మేరకు విజయవాడ కార్పొరేషన్‌ తన వాటా కింద రూ.1.33 కోట్లు చెల్లించాలంటూ ఎంఏయూడీ ఇప్పటికే మెమో జారీచేసింది. అధికారులు ఆ సొమ్మును కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ ఖాతాకు నగరపాలక సంస్థ ఖజానా నుంచి ఇటీవల బదలాయించారు.

నగరం 61.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అందులో వివిధ రకాల భూములు, భవనాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. మూడు నియోజకవర్గాల్లో 2.5 లక్షల మంది భూ యజమాన్యపు హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ’శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం’ కింద నగరంలోని 64 డివిజన్లలోని అన్ని రకాల భూములు, ఆస్తులను రీసర్వే చేసి, యాజమాన్యపు హక్కులు నిర్ధారిస్తారు. ఈమేరకు నగరంలో భూముల రీసర్వే కోసం ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌తోపాటు, రోవర్లు, టాబ్‌లు, డెస్క్‌టాప్‌లు, ప్రింటర్లు వంటి సాంకేతిక పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చును కార్పొరేషన్‌ చెల్లించాలని సూచించింది. వాటా సొమ్మును వెంటనే ఎంఏయూడీకి మళ్లించాలంటూ అధికారులకు పంపిన లేఖలో పేర్కొంది. ఈ స్థితిలో చేసేది లేక రూ.1.33 కోట్లు సీడీఎంఏ ఖాతాకు మళ్లించి కౌన్సిల్‌ నుంచి పరిపాలనా ఆమోదం పొందాల్సివచ్చింది.

ప్రస్తుతం ఏం జరుగుతోందంటే..!

భూముల రీసర్వేకు సంబంధించి ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ అనుబంధ సంస్థల భూములు, ఆస్తులు, ఇతర శాఖల భూములు, భవనాలు తదితర వివరాలతోపాటు, అధికారిక, అనధికారిక లేఔట్లు వంటి సమాచారాన్ని, వివరాలను రీసర్వే రికార్డుల్లో అక్షాంశ, రేఖాంశాలతో నమోదు చేస్తున్నారు. నగరంలోని స్థానిక భౌగోళిక అంశాల ఆధారంగా ఆ వివరాలతో కూడిన మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం దాదాపుగా పూర్తి కావడంతో, ఇక ప్రైవేటు ఆస్తులు, నగరవాసుల భూహక్కు పత్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో రీసర్వే మొదలు పెడతారు.

ప్రక్రియ ఇలా..!

కృష్ణాజిల్లా గెజిట్‌లో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు 2021 ఆగస్టులో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అందుకు అనువుగా నగరంలోని అన్ని భూముల రీసర్వేకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు.  కార్స్‌ టెక్నాలజీ, డ్రోన్సు, రోవర్‌ వంటి సాంకేతిక పరికరాల ద్వారా స్థానిక యజమానుల భూస్థితిని, పత్రాల ఆధారంగా హక్కులను తెలుసుకునేలా ప్రత్యేకంగా రీసర్వే బృందాలను సిద్ధం చేసి వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

బృందంలో ఉండేది వీరే..

నగరంలో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యజమానులకు చెందిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని స్థానిక వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ, అడ్మిన్‌ సెక్రటరీ, ఎమినీటీస్‌ సెక్రటరీ, వీఆర్‌వో ద్వారా నిర్వహిస్తారు. సంబంధిత డివిజన్‌ ప్రాంతాల్లోని భూ యజమానుల నుంచి ముందుగా వారికి చెందిన భూముల సరిహద్దులు, హక్కుపత్రాలను ముందుగా పరిశీలిస్తారు. ఆ తదుపరి రీసర్వే వివరాలను ల్యాండ్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వ్యక్తుల స్థల విస్తీర్ణపు వివరాల ఆధారంగా ప్రత్యేకంగా వారికి గుర్తింపు నంబరుతోపాటు, శాశ్వత భూహక్కు పత్రాలను అందిస్తారు.

అభ్యంతరాలు ఉంటే..!

నగరంలో యాజమాన్య హక్కులు కలిగి ఉన్నవారి భూముల రీసర్వే అనంతరం సంబంధిత యజమానులకు 9 (2) కింద నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుల ద్వారా తెలియజేసిన వివరాల్లో ఏమైనా అభ్యంతరాలు, పొరపాట్లు, లోపాలు, తప్పొప్పులు, ఇతర సమస్యలు, ఇబ్బందులు ఉంటే యజమానులు తమ పరిధిలోని వార్డు సచివాలయాల్లోని సర్వే బృందాలకు అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సమస్య పరిష్కారానికి అధికారులు మొబైల్‌ మెజిస్ట్రేట్‌ను ఏర్పాటు చేసి వాస్తవిక అంశాల ఆధారంగా తగిన న్యాయం కోసం ఆదేశాలు ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని