logo

ఆగని రుణ వేధింపులు

ఈఎంఐ కట్టాలనో.. అవసరానికి డబ్బు కావాలని.. చిన్న మొత్తమే కదా, తేలికగా కట్టేయొచ్చని ఎక్కువ మంది రుణం తీసుకుంటున్నారు. ఎటువంటి హామీ లేకుండా వేగంగా ఖాతాలో జమ చేస్తున్నారని లోన్‌యాప్‌ల వైపు మొగ్గు చూప్తున్నారు.

Published : 26 Mar 2023 05:27 IST

హామీ లేకుండానే అప్పు అంటూ ప్రకటనలు
సాంకేతికంగా దొరక్కుండా నిందితుల జాగ్రత్తలు

ఈనాడు, అమరావతి: ఈఎంఐ కట్టాలనో.. అవసరానికి డబ్బు కావాలని.. చిన్న మొత్తమే కదా, తేలికగా కట్టేయొచ్చని ఎక్కువ మంది రుణం తీసుకుంటున్నారు. ఎటువంటి హామీ లేకుండా వేగంగా ఖాతాలో జమ చేస్తున్నారని లోన్‌యాప్‌ల వైపు మొగ్గు చూప్తున్నారు. తీసుకున్న ఐదారు రోజులకే వేధింపులు మొదలవుతున్నాయి.తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని ముక్కు పిండి మరీ కట్టించుకుంటున్నారు. అయినా వదలకుండా ఇంకా చెల్లించాలని మరీ నిర్వాహకులు వేధిస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. కొంతకాలంగా తగ్గినట్లే తగ్గి.. మళ్లీ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలో లోన్‌ యాప్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల జాబితాలో ఎక్కువ మంది యువతే ఉంటోంది. ఆ తర్వాత చిరువ్యాపారులు, గృహిణులు, తదితరులు ఉంటున్నారు.

ఊబిలో కూరుకుపోతున్నారు

నగరానికి చెందిన ఓ యువకుడు పలు యాప్‌ల నుంచి రూ.4,500 రుణం తీసుకున్నాడు. నిర్దేశిత సమయానికే తీసుకున్న మొత్తాన్ని చెల్లించాడు. అయినా వాట్సాప్‌ ద్వారా నిర్వాహకులు ఇంకా డబ్బు కట్టాలని బెదిరిస్తూ సందేశాలు పంపుతున్నారు. చెల్లించని పక్షంలో నీ ఫొటోను నగ్నంగా చేసి స్నేహితులు, బంధువులకు పంపుతామని బెదిరిస్తుండడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

విజయవాడ రెండో పట్టణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అవసరం కోసం రూ.5 వేలు రుణం తీసుకుంది. వారం రోజులకే లోన్‌యాప్‌ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. పూర్తిగా చెల్లించకుంటే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అందరికీ పెడతామని దాదాపు 16 నెంబర్ల నుంచి  నిత్యం ఫోన్లు చేసి బెదిరించేవారు. దీంతో చేసేది లేక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నడ్డి విరుస్తున్న వడ్డీ

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్న వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తారు. అక్కడ నుంచి అసలు  ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. నగదు జమ చేసేటప్పుడు తమకు చెల్లించాల్సిన వడ్డీ సొమ్మును తీసుకుని మిగతా మొత్తం ఖాతాలో జమ చేస్తారు. ఆరో రోజు నుంచి వేధింపులు మొదలవుతాయి. ఉదాహరణకు రూ.7వేలు లోన్‌ తీసుకుంటే.. రూ.5,800 మాత్రమే ఇస్తారు. వారం రోజుల్లో రూ.8,100 జమ చేయాలి. ఆరో రోజు నుంచి వేధింపులు మొదలవుతాయి. డబ్బులు కట్టమని ఫోన్‌ చేస్తారు. మెసేజ్‌లు చేస్తారు. కట్టామని ఆధారాలు చూపించేవరకు అసభ్యంగా మాట్లాడటం.. ఫొటోలపై మోసగాడు, దొంగ అని ముద్ర వేసి సామాజిక మాధ్యమాల్లో పెడతారు. కొంత సమయం తర్వాత.. బంధువుల ఫొటోలపై అసభ్యంగా కామెంట్స్‌ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తారు. వేధింపులు తట్టుకోలేక లోన్‌ తీర్చేందుకు బాధితుడు మరో యాప్‌ను ఆశ్రయించి.. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇవి బయటకు చెప్పుకోలేక సతమతవుతున్న వారెందరో. తీసుకున్న రుణం కంటే ఎక్కవ చెల్లించి బతుకు జీవుడా అంటూ బయట పడిన వారూ ఉన్నారు.

సవాలుగా మారిన కేసులు

నిందితులు ఎక్కడా దొరక్కుండా ఉండేందుకు సాంకేతికంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేధించడం దర్యాప్తు అధికారులకు సవాలుగా మారుతోంది. రుణాలను జమ చేసేందుకు ఒక ఖాతా, చెల్లింపులు స్వీకరించేందుకు మరో ఖాతాను ఉపయోగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరెంటు ఖాతాలను సమకూర్చే ఏజెంట్ల నుంచి తీసుకుంటున్నారు. వీరెవరికి తమ ఖాతాల ద్వారా రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలియదు. ఇందుకు గాను వారికి ప్రతి నెలా డబ్బులు ఎరవేస్తుంటారు. వీటి ద్వారా కొన్ని ఖాతాలకు డబ్బు పంపించి అక్కడ నుంచి రుణం కావాల్సిన వారికి పంపిస్తారు. రుణం చెల్లింపులను వేరే ఖాతాల ద్వారా స్వీకరిస్తారు. ఇలా ఒకటి నుంచి మరో ఖాతాకు అక్కడ నుంచి మరో ఖాతాకు ఇలా పలు బినామీ ఖాతాలకు డబ్బులు వెళ్తుంటాయి. అంతిమంగా ఎవరికి ఈ డబ్బు వెళ్తోంది అన్నది ఎవరికీ తెలియదు. బాధితులను బెదిరించేందుకు వీవోఐపీ ద్వారా మాట్లాడుతున్నారు. విజయవాడలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం బంగ్లాదేశ్‌లోని సర్వర్ల నుంచి వస్తున్న కాల్స్‌గా గుర్తించారు. ఈ యాప్‌లను చైనాలో రూపొందించినట్లు తేలింది. బంగ్లాదేశ్‌, హాంకాంగ్‌ దేశాలతోనూ లింకులు తేలుతున్నాయి. ఐపీ చిరునామాలు దర్యాప్తు అధికారులకు చిక్కకుండా మాస్క్‌ వేస్తుండడంతో వాటి జాడ దొరకడం గగనమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని