logo

ఇచ్చేది లేదు... వచ్చేది రాదు

సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం వివిధ వర్గాల ఉపాధికి ఊతమిచ్చే సబ్సిడీ రుణాలను ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 28 Mar 2023 05:59 IST

ఎస్సీ నిరుద్యోగ యువతకు దక్కని కేంద్ర సబ్సిడీ
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం వివిధ వర్గాల ఉపాధికి ఊతమిచ్చే సబ్సిడీ రుణాలను ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, రైతులకు మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందిస్తూ వస్తున్న రాయితీ రుణాలను అర్ధంతరంగా నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్థిక సహకారం లభించకపోగా చివరకు కేంద్ర ప్రభుత్వం పరంగా ఇచ్చే సబ్సిడీ సైతం వారికి దక్కడం లేదు.

గతంలో ఎస్సీ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యువత, రైతులు, భూమిలేని నిరుపేదలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలు అందించేవారు. ఎంపికచేసిన లబ్ధిదారులకు వివిధ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మొత్తంలో సగాన్ని ప్రభుత్వమే రాయితీగా భరించి మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించేవారు. ఎస్సీ రైతులకు పొలాల్లో బోర్లు వేసుకునేందుకు రుణాలు, నిరుపేదలకు భూమి కొనుగోలు నిమిత్తం రుణం మంజూరు చేసేవారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు 15,864 యూనిట్లు మంజూరు చేసి మొత్తం రూ.223.07 కోట్లు రాయితీ రుణాలుగా మంజూరు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మొదటి సంవత్సరం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించి లబ్ధిదారుల ఎంపిక సాగుతుండగా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు రుణ మంజూరు ప్రక్రియను నిలిపివేశారు. అప్పటి నుంచి నేటి వరకూ కార్పొరేషన్‌ పరంగా ఎలాంటి కదలిక లేదు. వ్యక్తిగతంగా ఎవరైనా స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకులను ఆశ్రయించినా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.

బ్యాంకులను ఆశ్రయించినా..

సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడంతో ఉపాధి కోసం ఎస్సీ వర్గాలు వ్యక్తిగతంగా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు. చిన్నపాటి రైతులు వ్యవసాయ భూముల్లో బోర్లు, బిందు సేద్యం తదితరాలకూ రుణం పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా గడచిన నాలుగేళ్లుగా ఎటువంటి స్వయం ఉపాధి అవకాశాలకు నోచుకోని ఎస్సీ వర్గాలు ప్రభుత్వ నవరత్న పథకాలైన అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి వాటి ద్వారా స్వల్ప లబ్ధికి పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాల సంక్షేమ కోసం అదనపు సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధికోసం ఆటోలు, ట్రాక్టర్లు, దుకాణాలు, టెంట్‌హౌస్‌లు, ల్యాబ్‌ల వంటివి కార్పొరేషన్‌ లేదా వ్యక్తిగత రుణాలతో ఏర్పాటు చేసుకున్న యువతకు యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కింద గరిష్ఠంగా రూ.60 వేలు, పొలాల్లో బోర్లు, బిందు, తుంపర సేద్యం కోసం రుణాలు తీసుకున్న ఎస్సీ రైతులకు గరిష్ఠంగా రూ.50 వేల వరకూ అదనపు సబ్సిడీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 లోపు అర్హుల జాబితాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

వివరాలు లేవు

నాలుగేళ్లుగా కేవలం అలంకారప్రాయంగా కొనసాగుతూ ఎస్సీ వర్గాలకు దూరమైన కార్పొరేషన్‌ వద్ద వ్యక్తిగతంగా స్వయం ఉపాధి పొందుతున్న వారి వివరాలు లేవు. దీంతో గ్రామాల్లో ఎవరైనా కేంద్ర సబ్సిడీకి అర్హులుగా ఉంటే వారి వివరాలు తెలియచేయాలంటూ బ్యాంకర్లు, పరిశ్రమలశాఖ, ఎంపీడీవోలను కోరినా నేటి వరకూ ఒక్కరి పేరుకూడా రాకపోవడాన్ని బట్టి జిల్లా వార్షిక రుణప్రణాళికలో ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం చూపే లక్ష్యాలు ఏమవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద అందివచ్చే అవకాశం ఉన్న ఆర్థిక ఆసరా కళ్లెదుటే చేజారుతోందన్న విషయం తెలుసుకున్న ఎస్సీ వర్గాలకు చెందిన పలువురు తమ అభ్యున్నతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు మేడిపండును తలపిస్తోందని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని