logo

సర్దుపోటు తప్పదా..?

ఈ నెలలో వచ్చిన బిల్లులో 22వ వాయిదాను మోపారు. ఇంకా 14 నెలల పాటు వినియోగదారులు భరించాల్సి ఉంది.

Updated : 27 May 2024 05:06 IST

ముగిసిన ఎఫ్‌పీపీసీఏ- 1 ఛార్జీలు
202223కి వర్తింపుపై త్వరలో నిర్ణయం
ఈనాడు, అమరావతి

ఈ నెలలో వచ్చిన బిల్లులో 22వ వాయిదాను మోపారు. ఇంకా 14 నెలల పాటు వినియోగదారులు భరించాల్సి ఉంది. దీంతో పాటు ఎఫ్‌పీపీసీఏ -2 భారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సంబంధిత నెలలో వాడుకున్న విద్యుత్తుపై తర్వాతి నెలలో వచ్చే బిల్లులో లెక్కించి ఎఫ్‌పీపీసీఏ 2 ఛార్జీలు విధిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు 40 పైసలు చొప్పున లెక్కించి వసూలు చేస్తున్నారు. దీన్ని కొనసాగించడంతో ఈ నెలలో వచ్చిన బిల్లులో కిందట నెల తాలూకూ ఛార్జీలను విధించారు. 

కరకాల భారాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల కాస్త ఊరట కలిగినా.. ఇది ఎక్కువ కాలం ఉండేలా కనిపించడం లేదు. వినియోగదారుడి మెడపై మరో కత్తి వేలాడుతోంది. గత రెండేళ్లుగా విద్యుత్తు ఛార్జీల బాదుడుకు అన్ని వర్గాల ప్రజలు కుదేలయ్యారు. పేదల మొదలు ఉన్నత ఆదాయవర్గాల వరకు అందరూ ఛార్జీల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం బిల్లులో సర్దుబాటు రుసుములే పది శాతం పైగా ఉంటున్నాయి. ఒకేసారి మూడు రకాల వడ్డనల దెబ్బకు కరెంటు బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌పీపీసీఏ- 1 (ఇంధన, విద్యుత్తు సర్దుబాటు ఛార్జీలు) గడువు ఏప్రిల్‌ నెల బిల్లుతో పూర్తి అయింది. దీని స్థానంలో తర్వాత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బాదుడు సిద్ధమవుతోంది. విద్యుత్తు నియంత్రణ మండలి ఆమోదం తెలపడమే ఆలస్యం. 

ఊరట కొన్నాళ్లే..

2021- 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నష్టాల పేరుతో ఎఫ్‌పీపీసీఏ-1 పేరుతో 2023 ఏప్రిల్‌ నుంచి విధించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంబంధిత నెలలో వాడిని యూనిట్లను 2023- 24లో అదే నెలలోని విద్యుత్తు బిల్లులో సర్దుబాటు చేశారు. యూనిట్‌కు 20 పైసల నుంచి గరిష్ఠంగా 66 పైసల వరకు భారాన్ని వడ్డించారు. మొదటి త్రైమాసికంలో యూనిట్‌కు రూ.0.20, రెండో త్రైమాసికంలో యూనిట్‌ రూ.0.63, మూడో త్రైమాసికంలో రూ.0.63, చివరి త్రైమాసికంలో ప్రతి యూనిట్‌పై రూ.0.66 చొప్పున లెక్కించి వసూలు చేశారు. ఈ ఏడాది మార్చి నెల వినియోగాన్ని ఏప్రిల్‌ బిల్లులో వేశారు. ఈ సర్దుబాటు పూర్తి కావడంతో ఈ నెలలో వచ్చిన బిల్లులో రెండు రకాల వడ్డనలే విధించారు. మిగిలిన భారాలు కొనసాగుతున్నాయి. విద్యుత్తు వ్యాపారానికి సంబంధించి 2014- 15 నుంచి 2018- 19 కాలంలో డిస్కమ్‌కు నష్టాలు వచ్చాయని ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ కాలంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్‌కు 22 పై. చొప్పున లెక్కగట్టి బిల్లులో విధిస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి 36 నెలల పాటు ఈ ఛార్జీలను వసూలు చేస్తారు. 


ఈఆర్సీ నుంచి అనుమతి రాగానే వడ్డన 

ప్రస్తుతానికి ఎఫ్‌పీపీసీఏ -1 పూర్తి అయినా.. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్తు వినియోగంపై ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల నేపథ్యంలో కొంత సమయం వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఎప్పుడైనా దీనిపై ఈఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021- 22 సంవత్సరానికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి డిస్కమ్‌ రూ.150 కోట్లకు పైగా వినియోగదారుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంతెంత వసూలు చేయాలన్న దానిపై త్వరలో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.


అదనపు వినియోగం పేరుతో మరో బాదుడు

ప్పటికే ఇంధన సర్దుబాటు ఛార్జీలతో హడలెత్తుతున్న వినియోగదారులకు విద్యుత్తు శాఖ ఏసీడీ పేరుతో మరో భారాన్ని మోపింది. విద్యుత్తు కనెక్షన్‌పై అనుమతి తీసుకున్న దాని కంటే ఎక్కువగా వినియోగించుకున్నారంటూ తాఖీదులు అందుతున్నాయి.దీని నుంచి వ్యవసాయ, గృహ కనెక్షన్లలో 500 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారిని మినహాయించడం కాస్త ఊరటనిచ్చే అంశం. మిగిలిన అన్ని కేటగిరీలకు ఇది వర్తిస్తోంది. లోడ్‌ పెరిగిందని.. దాని స్లాబ్‌ మారుస్తూ అదనంగా డిపాజిట్‌ వసూలు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన యూనిట్ల సగటు లెక్కించి.. దానికి రెట్టింపు డిపాజిట్‌గా వసూలు చేస్తున్నారు. భారాలన్నీ ఒకే బిల్లులో విధించడంతో అందరూ గగ్గోలు పెడుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని