logo

అరాచకాలకు అడ్డేది?

కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలతో పాటు వారి వారసుల అరాచకాలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిపోయాయి.

Updated : 28 May 2024 04:52 IST

గతంలో ఇంటిపై దాడి.. ఇప్పుడు కారుకు నిప్పు
పోలీసుల ఉదాసీనత వల్లే రెచ్చిపోతున్న వైకాపా మూక
తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు
ఈనాడు, అమరావతి

సోమవారం తెల్లవారుజామున తగలబడుతున్న కారు

కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలతో పాటు వారి వారసుల అరాచకాలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిపోయాయి. ప్రతిపక్ష పార్టీల్లో క్రియాశీలకంగా ఉండే నేతలు, కార్యకర్తలపై వరుస దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రధానంగా మచిలీపట్నం, పెనమలూరుల్లో పోలింగ్‌కు రెండు నెలల ముందు నుంచి వైకాపా యువ నేతల హల్చల్‌ శ్రుతిమించిపోయింది. వైకాపా పాలన ఆరంభమైనప్పటి నుంచి మచిలీపట్నంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు దిగడం.. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించడం లాంటివి పెరిగిపోయాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఇదే పంథా కొనసాగించడం, దాడులకు దిగడంతో మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), పెనమలూరులో మంత్రి జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. పోలింగ్‌ ముగిసినప్పటికీ ఈ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మచిలీటప్నంలో జనసేన పార్టీ నాయకుడు కర్రి మహేశ్‌ ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును ఆదివారం అర్ధరాత్రి సమయంలో వచ్చి మరీ నిప్పంటించి దహనం చేశారు. ఇది కచ్చితంగా పేర్ని కిట్టు అనుచరుల పనేనని బాధితుడు మహేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కార్యకర్తలను ఎత్తుకెళ్లి దాడులు

మచిలీపట్నంలో పేర్ని కిట్టు హవా ఆరంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలపై దాడులు మరింత పెరిగిపోయాయి. భాస్కరపురంలో ఎన్నికల ముందు జనసేన పార్టీ జెండా దిమ్మెను ఏకంగా పొక్లెయిన్‌ తీసుకొచ్చి మరీ వైకాపా మూకలు అర్ధరాత్రి తొలగించాయి. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అనంతరం తెదేపా ఫ్లెక్సీలను చింపేసి విధ్వంసం చేశారు. తెదేపా, జనసేన నేతలపై కవ్వింపు చర్యలకు దిగారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు దాడికి దిగారు. ఇదే సమయంలో వైకాపా ఫ్లెక్సీలు చింపారంటూ తెదేపా సానుభూతిపరులను సైతం వేధింపులకు గురిచేశారు. ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్‌ అనే తెదేపా సానుభూతి పరుడిని ఏకంగా సినీఫక్కీలో ఎత్తుకెళ్లి మరీ దాడి చేశారు. కేవలం తమ పార్టీ ఫ్లెక్సీ చింపాడనే కారణంతో దారుణంగా కొట్టారు. ఇలాగే మచిలీపట్నం పరిధిలో ఫ్లెక్సీలు చింపారు, బ్యానర్లు తొలగించారంటూ చాలా మందిని ఇబ్బందులకు గురిచేశారు. బుద్దాలపాలెం, తాళ్లపాలెం, సుల్తాన్‌నగరం, ఉల్లిపాలెం ప్రాంతాల్లో వరుస దాడులు చేశారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఎత్తుకెళ్లి విచ్చలవిడిగా కొట్టడం, తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టి పోలీసులకు అప్పగించడం.. ఇదే పంథా యథేచ్ఛగా సాగించారు. బాధితులను స్టేషన్‌కు తీసుకెళ్లి మళ్లీ కొట్టించి తమ పైశాచికానందం తీర్చుకున్నారు.

మే 2: తమపై జరిగిన దాడిని వివరిస్తున్న బాధితులు మహేష్, హేమలత

ఇప్పటికీ అడ్డుకట్ట వేయలేరా..

ఐదేళ్లుగా వైకాపా నేతల అడుగులకు మడుగులొత్తిన పోలీసులు కనీసం ఇప్పటికీ వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయలేరా..? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. మచిలీపట్నంలో గతంలో ఇంటిలోనికి దూరి మరీ కర్రి మహేశ్‌ భార్య, బంధువులపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో కేవలం ఒక్క రోజులోనే బయటకొచ్చి.. మళ్లీ దౌర్జన్యాలు మొదలెట్టారంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరుతున్నారు.

పోలింగ్‌ రోజు దారుణం..

మచిలీపట్నం, పెనమలూరుల్లో పోలింగ్‌ రోజు కూడా వైకాపా మూకలు రెచ్చిపోయాయి. తెదేపా తరఫున మచిలీపట్నంలోని సర్కారుతోట బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్న ఆర్‌.రత్నారావు, పామర్తి రాజాలపై దారుణంగా రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. కేవలం బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారనే సాకుతో.. అత్యంత దారుణంగా దాడికి దిగడం చూస్తే.. ప్రశాంతమైన మచిలీపట్నంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ముందురోజు వారిని బెదిరించి.. బూత్‌లో కూర్చోవద్దని చెప్పినా వినలేదనే కారణంతో ఏకంగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఇలాగే.. పెనమలూరులోనూ జోగి రమేష్, ఆయన వర్గీయులు చేసిన అరాచకం తెల్సిందే. ఏకంగా పోలింగ్‌ బూత్‌లోనికి దూరిపోయి మరీ విధ్వంసం సృష్టించారు. తెదేపా బూత్‌ ఏజెంట్లపై దాడి చేశారు. ప్రశాంతంగా ఉండే పెనమలూరును రాళ్ల దాడులతో అట్టుడికించారు. చివరికి పోలీసులపైనా దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించారు. ఏకంగా సీఐడీ డీఎస్పీ సోమయ్యపైనే.. వైకాపాకు చెందిన సీడీసీ ఛైర్మన్‌ రాజులపాటి రామచంద్రరావు దాడికి యత్నించడంతో కేసు నమోదు చేసి అతనిపై రౌడీషీట్‌ తెరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని