logo

హామీలు అమలు చేయాల్సిందే : ఇఫ్ట్యూ

చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్ట్యూ) రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.పోలారిలు కోరారు.

Published : 12 Jun 2024 04:30 IST

మాట్లాడుతున్న ప్రసాద్‌. పక్కన పొలారి, రవిచంద్ర, శ్రీనివాసరావు తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్ట్యూ) రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.పోలారిలు కోరారు. మంగళవారం వారు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 2019లో చంద్రబాబు, 2024లో జగన్‌ సర్కారులను రాష్ట్ర ప్రజలు ఓడించారని.. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడంవల్లనే .. ఓటమి పాలయ్యారన్నారు. ప్రజల్లో భాగమైన కార్మిక, రైతు, కూలి, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా రంగాలు, దళిత, ఆదివాసీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాజకీయ వివక్షతలకు తావులేకుండా సూపర్‌ సిక్స్‌ పథకాలను వర్తింపజేయాలని కోరారు. మొత్తం 76 రకాల షెడ్యూల్డ్‌ ఎంప్లాయీస్‌ కార్మికులకు నెలకు రూ.26వేలకు తగ్గకుండా కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. ఒప్పంద, పొరుగు సేవలు, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, ఆటో మోటారు కార్మికులు, హమాలీ, ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. భవన నిర్మాణరంగ బోర్డును పునరుద్ధరించాలని, ఆటో మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పాత బకాయిల పేరిట వసూలు చేసిన విద్యుత్తు ఛార్జీలు, చెత్త పన్ను రద్దు చేయాలని కోరారు. ఓపీఎస్‌ అమలుతో పాటు ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు వచ్చేలా చూడాలని కోరారు. ప్రతిపక్షాలు, ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి సహా సంబంధిత శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తులు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్‌ఐఏ దాడులను నిరోధించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేతకు కృషి చేయాలన్నారు. పోర్టుల నిర్మాణానికి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎ.రవిచంద్ర, డి.శ్రీనివాసరావు, ముని శంకర్, సిహెచ్‌.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని