logo

రెండు ఆలయాల్లో 25 కిలోల వెండి ఆభరణాల చోరీ

మోపిదేవి మండలం టేకుపల్లి, పామర్రు మండలం నిమ్మకూరులోని ఆలయాల్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు.

Updated : 12 Jun 2024 05:18 IST

టేకుపల్లి రామేశ్వరాలయంలో మూడు కవచాలు మాయం

చోరీకి పాల్పడి వెళ్తున్న ముసుగు వ్యక్తి (సీసీ ఫుటేజీ), వేలిముద్రలు సేకరిస్తూ.. 

టేకుపల్లి (మోపిదేవి), న్యూస్‌టుడే: మోపిదేవి మండలం టేకుపల్లి, పామర్రు మండలం నిమ్మకూరులోని ఆలయాల్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. రెండు ఘటనల్లోనూ గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 25 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. టేకుపల్లి బాలపార్వతీ సమేత రామేశ్వరాలయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి ముసుగులు వేసుకొని ఆలయం వెనుక ద్వారం గుండా వచ్చి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వీరభద్రస్వామివార్లకు ఉన్న మూడు వెండి కవచాలను దొంగిలించారు. సుమారు 16 కిలోల బరువు ఉండే వాటి విలువ రూ.13 లక్షల వరకు ఉంటుందని అర్చకుడు లంక రమాసూర్యవరప్రసాద్‌ తెలిపారు. ఉదయం అభిషేకం చేద్దామని వచ్చిన వరప్రసాద్‌ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి ఆలయ కార్యదర్శి నీలలోహిత శాస్త్రికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితమే వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా వెండి కవచాలను అలంకరించారు. చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. వేలిముద్రల సేకరణ బృందం ఆధారాలు సేకరించారు. ఈ దేవాలయం ప్రస్తుతం కంచికామకోటి పీఠ(కంచి) ట్రస్ట్‌ దత్తత తీసుకున్న అనంతరం వివిధ నూతన కార్యక్రమాలకు శ్రీకారం పలికారు. రమాసూర్యవరప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


నిమ్మకూరు ఆంజనేయస్వామి ఆలయంలో.. 

నిమ్మకూరు (పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: నిమ్మకూరు ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి వస్తువులు చోరీ చేసిన సంఘటనపై కేసు నమోదు చేశామని పామర్రు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే స్వామివారి వెండి తోరణం, వెండి కవచం, ఒక కిరీటం చోరీకి గురయ్యాయన్నారు. వాటి బరువు సుమారు ఏడు నుంచి 10 కిలోలు ఉంటుందని, సోమవారం అర్ధరాత్రి చోరీ చేసి ఉంటారని భావిస్తున్నామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని